Fortune list : కరోనా టైంలో రిలయన్స్‌కు అంత భారీ నష్టమా..!?. ఇదిగో ఫార్ట్యూన్ -500 లిస్ట్..!
ఏడాది మొత్తం జరిగే వ్యాపార పరిమాణం ఆధారంగా ఫార్ట్యూన్ -500 కంపెనీల జాబితాను ప్రకటిస్తారు. కోవిడ్ కారణంగా వ్యాపారం తగ్గిపోవడంతో రిలయన్స్ 155వ స్థానానికి పడిపోయింది.
కరోనా కారణంగా దేశంలో అన్ని వ్యాపార సంస్థలూ నష్టపోయాయి కానీ.. ఒక్క రిలయన్స్ మాత్రమే లాభపడిందని దేశవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. ఎందుకంటే.. ఆ కరోనా సమయంలోనే రిలయన్స్ పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించింది. ఫేస్‌బుక్ నుంచి అరాంకో వరకూ అనేక మంది వెల్లువలా వచ్చి పెట్టుబడులు పెట్టారు. అందు వల్ల షేర్ల విలువ పెరిగింది. కానీ నిజానికి రిలయన్స్ సంస్థ కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయింది. అన్ని వ్యాపార సంస్థల్లానే .. ఇబ్బంది పడింది. కాకపోతే.. వాటాల అమ్మకాలు.. పెట్టుబడుల రూపంలో లాభపడి ఉండవచ్చు కానీ.. వ్యాపారం విషయంలో మాత్రం.. బాగా నష్టపోయింది. ఎంత అంటే... గత ఏడాది ఫార్ట్యూన్ 500 కంపెనీల జాబితాలో టాప్ 100లో ఉండే రిలయన్స్ ఈ సారి 155వ స్థానానికి పరిమితం అయింది.
ప్రపంచంలో గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపాప పరంగా అతి పెద్ద కంపెనీల జాబితాను ఫార్ట్యూన్ సంస్థ ప్రకటించింది. టాప్ 500 కంపెనీల్లో భారత్‌కు చెందినవి అతి స్వల్పంగా ఉన్నాయి. టాప్ 100లో ఎప్పుడూ చోటు దక్కించుకునే రిలయన్స్ ఈ సారి 155వ స్థానానికి పరిమితం అయింది. దీనికి కారణం.. కరోనా కాలంలో పెట్రో ఉత్పత్తు డిమాండ్ భారీగా తగ్గడంతో పాటు...లాక్ డౌన్ ఎఫెక్ట్ కూడా కారణం. గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఆదాయం 25.3 శాతం తగ్గి 63 బిలియన్ డాలర్లకు పరిమితం అయినట్లుగా ఫార్ట్యూన్ తెలిపింది. 2017 తర్వాత రిలయన్స్‌కు ఇదే అతి తక్కువ ర్యాంక్.
ఫార్ట్యూన్ -500 కంపెనీల్లో నెంబర్ వన్ వాల్మార్ట్. ఈ కంపెనీ వ్యాపారం ఒక్క ఏడాదిలో 524 బిలియన్ డాలర్లు. తర్వాత రెండో స్థానంలో చైనాకు చెందిన చైనా స్టేట్ గ్రిడ్ ఉంది. ఈ సంస్థ వ్యాపారం 384 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఆ తర్వాత అమెజాన్ ఉంది. ఆమెజాన్ ఆదాయం 280 బిలియన్ డాలర్లు. ఫార్ట్యూన్ 500 జాబితాలో మరికొన్ని ఇండియన్ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. గతం కన్నా 16 స్థానాలు మెరుగుపర్చుకుని 205వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ర్యాంక్ 212. అనూహ్యంగా రాజేష్ ఎక్స్ పోర్ట్స్ అనే కంపెనీ.. టాటా మోటార్స్‌ను అధిగమించింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు ఫార్ట్యూన్ 500 జాబితాలో 348వస్థానం దక్కగా.. టాటా మోటార్స్ 357 ర్యాంకుతో సరి పెట్టుకుంది.
ఫార్ట్యూన్ -500కంపెనీలే దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోని వ్యాపార సామ్రాజ్యాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటి ఆదాయం.. చాలా దేశాల బడ్జెట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ కంపెనీల పనితీరు మీద ఆధారపడి ఉంటాయి. కోవిడ్ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు సవాళ్లు ఎదుర్కొన్నాయి. అయితే.. ఇప్పుడిప్పుడే వేగంగా కోలుకుంటున్నాయి.