Reliance Campa Cola: పండుగ సీజన్‌లో ఫారిన్ బ్రాండ్లకు మాస్టర్ స్ట్రోక్ - కాంపా కోలా రేటు తగ్గింపు
Reliance Consumer Products Ltd: ఈ పండుగ సీజన్‌లో, ముకేశ్ అంబానీకి చెందిన 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్' భలే ఎత్తు వేసింది. తన శీతల పానీయం 'కాంపా కోలా' ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
Reliance Soft Drinks: గ్లోబల్ బేవరేజెస్ బ్రాండ్లయిన కోకా కోలా (Coca-Cola) & పెప్సికో (PepsiCo)కు పోటీగా, దేశీయ రుచితో, రిలయన్స్ (Reliance) గ్రూప్‌లో భాగమైన 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్' (Reliance Consumer Products Ltd) తయారు చేస్తున్న కూల్ డ్రింక్ 'కాంపా కోలా'. పోటీ కంపెనీల మైండ్ బ్లాంక్ అయ్యేలా దీనిని చాలా తక్కువ ధరకు మార్కెట్‌లోకి తీసుకొచ్చారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ (Mukesh Ambani). ఇప్పుడు, ఫారిన్ బ్రాండ్లను టైమ్ చూసి మరో దెబ్బకొట్టారు.
సగం రేటుకే...
మన దేశంలో పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, కాంపా కోలా' ధరలు తగ్గిస్తూ రిలయన్స్ నిర్ణయం తీసుకుంది. కాంపా కోలా ఇప్పుడు కోకా కోలా & పెప్సీ అందిస్తున్న ధరల్లో సగం రేటుకే అందుబాటులోకి వచ్చింది.
1970-80sలో కాంపా కోలా భారతదేశాన్ని ఒక ఊపు ఊపింది. అప్పట్లో, దేశంలో అది ఒక సుప్రసిద్ధ బ్రాండ్. దాని ట్యాగ్ లైన్ - "ది గ్రేట్ ఇండియన్ టేస్ట్". రుచితో పాటు ఈ ట్యాగ్ లైన్ కూడా జనానికి నచ్చింది, కాంపా కోలా సేల్స్‌ను భారీగా పెంచింది.
1990ల్లో, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా, విదేశీ శీతల పానీయాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. దీంతో, కాంపా కోలాకు ప్రజాదరణ తగ్గింది. ప్రస్తుతం, భారతీయ శీతల పానీయాల మార్కెట్‌లో కోకా కోలా 51 శాతం & పెప్సికో 34 శాతం వాటాతో మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ నియంతృత్వాన్ని ఎదుర్కొవడానికి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బరిలోకి దిగింది, కాంపా కోలాను ఆయుధంగా ఉపయోగిస్తోంది.
ఆసక్తికర కథ
కాంపా కోలా కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఎన్నికలు జరిగాయి. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో జార్జ్ ఫెర్నాండెజ్ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. అధికారంలోకి రాగానే ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో కోకా కోలా ఉత్పత్తిని ఆపేయించారు. ఫెరా (Foreign Exchange Regulation Act) సవరణలను తప్పనిసరిగా పాటించాలంటూ భారత్‌లో వ్యాపారం చేస్తున్న అన్ని విదేశీ కంపెనీలకు నోటీసులు పంపారు.
అదే సమయంలో, సర్దార్ మోహన్ సింగ్ నేతృత్వంలో 'ప్యూర్ డ్రింక్స్ గ్రూప్' (Pure Drinks Group) పని చేస్తోంది. 1949 నుంచి 1970 వరకు, భారతదేశంలో కోకా కోలాకు ఏకైక ఉత్పత్తి & పంపిణీదారుగా ఇది బిజినెస్ చేసింది. ఆ విధంగా, 21 సంవత్సరాలకు పైగా కోకా కోలా బ్రాండ్ ద్వారా భారీ లాభాలను ఆర్జించింది. విదేశీ బ్రాండ్లను ఆపేయిస్తూ జనతా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్యూర్ డ్రింక్స్ కొత్త వ్యూహం రచించింది. కాంపా కోలా బ్రాండ్‌ను లాంచ్ చేసి, దేశీయ పానీయంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.
"డబుల్ సెవెన్" కూల్‌డ్రింక్
కోకా కోలా భారత్ నుంచి వెనక్కు వెళ్లిపోయిన తర్వాత, జనతా ప్రభుత్వం "డబుల్ సెవెన్" అనే కొత్త కూల్‌డ్రింక్‌ను (Double Seven Cool Drink) దేశంలో ప్రవేశపెట్టింది. దీనికి డబుల్ సెవెన్ అని పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. 1977లో కాంగ్రెస్‌ను ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సరానికి గుర్తుగా ఈ శీతల పానీయానికి డబుల్ సెవెన్ అని పేరు పెట్టారు.
డబుల్ సెవెన్‌ను మైసూర్‌లోని 'సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' అభివృద్ధి చేసింది. జనతా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ కూల్‌డ్రింక్ భారతీయుల మనస్సులు గెలుచుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఇది, కాంపా కోలాకు మరింత కలిసొచ్చింది, నేరుగా ప్రయోజనం చేకూర్చింది. అప్పటి నుంచి భారతీయులకు ఇష్టమైన పానీయంగా కాంపా కోలా మారింది.
1990ల్లో ఫారిన్ బేవరేజెస్ రీఎంట్రీ ఇవ్వడంతో కాంపా కోలా కథ ముగిసింది. 2022 ఆగస్టులో, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కాంపా బ్రాండ్‌ను సుమారు ₹22 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దాని ఫ్లేవర్‌లో కొన్ని మార్పులు చేసి మార్కెట్ చేస్తోంది.
మరో ఆసక్తికర కథనం: ఈ వెల్లుల్లి యమా డేంజర్, పదేళ్ల క్రితం నిషేధం - మీరు ఇదే తింటున్నారా?