Mukesh Ambani Family Office: విదేశాలకు మకాం మార్చేస్తున్న ముఖేష్ అంబానీ!
సింగపూర్‌లోని ఒక భారీ ఎస్టేట్‌ను తన కార్యాలయంగా ముఖేష్ అంబానీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Mukesh Ambani Family Office: లక్ష్మీపుత్రుడు, ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడు (సుమారు రూ.6.86 లక్షల కోట్ల సంపద), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd) చైర్మన్ ముఖేష్ అంబానీ సింగపూర్‌లో జెండా పాతబోతున్నారు. అక్కడ ఒక కుటుంబ కార్యాలయాన్ని (Family Office) ఏర్పాటు చేయబోతున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆఫీస్ అనగానే ఓ పెద్ద బిల్డింగ్, అన్ని గదుల్లో కీ బోర్డుల మోతలు గుర్తుకు వస్తున్నాయా..?. ఈ ప్రపంచ స్థాయి కుబేరుడి ఆఫీసు అలా ఉండదట. సింగపూర్‌లోని ఒక భారీ ఎస్టేట్‌ను తన కార్యాలయంగా ముఖేష్ అంబానీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆఫీస్ కోసం ఇప్పటికే ఒక మేనేజర్‌ని నియమించినట్లు సమాచారం. ఆ ఆఫీసు కోసం సిబ్బందిని నియమించే బాధ్యతను సదరు మేనేజర్ చూసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ కార్యాలయ పనులు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.
అంబానీ కంటే ముందు..
సింగపూర్‌లో ఫ్యామిలీ ఆఫీసు ఏర్పాటు కొత్త విషయం కాదు. ప్రపంచ స్థాయి సంపన్నులంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంబానీ కంటే ముందే చాలా మంది కుబేరులు సింగపూర్‌లో తమ కుటుంబ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ లిస్ట్‌లో బిలియనీర్ రే డాలియో, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ పేర్లు కూడా ఉన్నారు. తక్కువ పన్నులు, మంచి భద్రత ఏర్పాట్ల కారణంగా కుటుంబ కార్యాలయాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా సింగపూర్ ప్రసిద్ధి చెందుతోంది. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2021 ముగింపు నాటికి సింగపూర్‌లో ఉన్న కుటుంబ కార్యాలయాల సంఖ్య 700. అంతకుముందు సంవత్సరం వీటి సంఖ్య కేవలం 400 మాత్రమే.
ఫ్యామిలీ ఆఫీస్ అంటే..
లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే సంపన్న కుటుంబాలు, తమ కోసం ఏర్పాటు చేసుకునే ప్రైవేట్ వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీయే ఫ్యామిలీ ఆఫీస్. ఆ సంపన్న కుటుంబానికి దేశ, విదేశాల్లో ఉన్న పెట్టుబడులను కుటుంబ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఫైనాన్సియల్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్ సహా ఇతర ఆర్థిక వ్యవహారాలన్నింటినీ ఈ ఆఫీస్ చూసుకుంటుంది. వీటిని ఏర్పాటు చేయడం, నిర్వహించటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి, ఇలాంటి వాటిని సంపన్న కుటుంబాలు మాత్రమే ప్రారంభిస్తుంటాయి. కుటుంబ సంపదను మరింత పెంచి తర్వాతి తరాలకు అందించటం ఫ్యామిలీ ఆఫీసుల లక్ష్యం.
ప్రపంచ స్థాయి సంపన్నుల రద్దీ (global rich crowding) కారణంగా సింగపూర్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కార్లు, ఇళ్లు, ఇతర వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి. దీంతో, సంపన్నులు కొనే వస్తువులు, పొందే సేవల మీద మరిన్ని పన్నులు విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
EXCLUSIVE: Asia’s second-richest man Mukesh Ambani is setting up a family office in Singapore, another boost to the wealth hub https://t.co/PFmpytemRC
— Bloomberg Markets (@markets) October 7, 2022