Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్-శ్లోక
శ్లోక, బుధవారం (31 మే 2023) హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Mukesh Ambani Granddaughter: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ఆయన భార్య నీతా అంబానీ (Nita Ambani) మరోసారి తాత, నానమ్మ అయ్యారు. ముకేశ్ అంబానీల పెద్ద కుమారుడు, జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, శ్లోక మెహతా దంపతులకు ఆడపిల్ల జన్మించింది. శ్లోక, బుధవారం (31 మే 2023) హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వీరికి ఈ పాప రెండో సంతానం. ఆకాశ్ అంబానీ, శ్లోక మెహతా 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి 2020 డిసెంబర్‌లో జన్మించాడు.
ప్రపంచానికి చెప్పిన ధన్‌రాజ్ నాథ్వానీ
ఆకాశ్ అంబానీ, శ్లోక దంపతులకు ఆడపిల్ల జన్మించిందన్న విషయాన్ని అంబానీ కుటుంబ స్నేహితుడు ధన్‌రాజ్ నాథ్వానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. "యువరాణి శుభాగమనం సందర్భంగా ఆకాశ్, శ్లోక అంబానీ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విలువైన సందర్భం మీ జీవితాల్లో మరింత సంతోషం, ప్రేమను నింపాలని ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.
Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi
— Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023
ఆకాశ్ అంబానీ, శ్లోక మెహతా (Akash Ambani, Shloka Mehta) దంపతులకు మరో గారాలపట్టి పుట్టిందన్న విషయంపై అంబానీ కుటుంబం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఈ వార్త ఇప్పటికే బయటకు రావడంతో, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, అంబానీ మనవరాలి జన్మ నక్షత్రం ఏంటి, ఏం పేరు పెడతారు, ఎంత ఆస్తికి వారసురాలు అంటూ ఎవరికి వాళ్లు విశ్లేషణలు చేస్తున్నారు.
ఏప్రిల్ నెలలో, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ సమయంలోనూ శ్లోక బేబీ బంప్‌తో కనిపించారు. అప్పటి నుంచే అంబానీ వారసురాలిపై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. కొన్నాళ్ల క్రితం, ముంబయిలోని సిద్ధి వినాయక టెంపుల్‌కు కూడా వెళ్లారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముఖేశ్ అంబానీ మనవరాలు మిథున రాశిలో (Gemini Horoscope) జన్మించిందని, జ్యోతిష శాస్త్రం ప్రకారం,‘K’ అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేవాళ్లు, తమకు తోచిన పేర్లు సూచిస్తున్నారు.
నవంబర్‌లో కవలలకు జన్మనిచ్చిన ఈషా అంబానీ
గత సంవత్సరం నవంబర్‌లో, ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ (Isha Ambani), ఆనంద్ పిరమాల్ (Anand Piramal) దంపతులకు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అమెరికాలో పురుడు పోసుకున్న ఈషాను, ఆమె ఇద్దరు చిన్నారులను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. ప్రయాణ సమయంలో ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి స్పెషలిస్ట్ డాక్టర్లు తోడుగా వచ్చారు. ఇండియాలో ఈషాకు, కవల పిల్లలకు అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఆ సందర్భాన్ని ఒక పండుగలాగా జరుపుకున్నారు.
మరో ఆసక్తికర కథనం: బ్లూ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, రెడ్ సిలిండర్ రేటు యథాతథం