Adani Stocks: అదానీ స్టాక్స్‌కు మరో షాక్ - తగ్గనున్న బరువు, పోయిన పరువు
గ్లోబల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడానికి మార్కెట్‌లో ఎన్ని షేర్లు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాన్ని MSCI పరిగణనలోకి తీసుకుంటుంది.
MSCI - Adani Stocks: అదానీ గ్రూప్ కంపెనీలకు (Adani Group companies) సంబంధించి గత రెండు రోజులుగా అనుకున్నదే జరిగింది. అదానీ గ్రూప్‌లోని కొన్ని స్టాక్స్ 'ఫ్రీ ఫ్లోట్' వెయిటేజీని (free float weightage) ఇండెక్స్ ప్రొవైడర్ MSCI తగ్గించాలని నిర్ణయించింది.
ఫ్రీ ఫ్లోట్ షేర్లు అంటే?
ఒక కంపెనీకి సంబంధించి కొంత వాటా ప్రమోటర్ల దగ్గర, ప్రభుత్వం లేదా వ్యూహాత్మక పెట్టుబడిదార్ల దగ్గర ఉంటుంది. మరికొంత వాటా లాక్ ఇన్ పిరియడ్‌లో ఉంటుంది. ఈ షేర్లు సుదీర్ఘ కాలం పాటు ఆయా వర్గాల వద్దే ఉంటాయి, మార్కెట్‌లోకి రావు. ఇవి కాక మిగిలిన షేర్లు మాత్రమే మార్కెట్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు జరపడానికి అందుబాటులో ఉంటాయి. ఇలా మార్కెట్‌లో సాధారణ కార్యకలాపాలకు అందుబాటులో ఉన్న షేర్లనే ఫ్రీ ఫ్లోట్ షేర్లుగా పిలుస్తారు.
ఇక, MSCI (Morgan Stanley Capital International) లెక్క ప్రకారం 'ఫ్రీ ఫ్లోట్' షేర్లు అంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న షేర్లే. కాకపోతే, గ్లోబల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడానికి మార్కెట్‌లో ఎన్ని షేర్లు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాన్ని MSCI పరిగణనలోకి తీసుకుంటుంది.
MSCI ఏం చెప్పింది?
'MSCI గ్లోబల్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్' (MSCI Investable Market Indexes) కోసం అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని సెక్యూరిటీల (ఈక్విటీ షేర్లు) అర్హత, 'ఫ్రీ ఫ్లోట్' నిర్ధరణకు సంబంధించి అనేక మంది మార్కెట్ భాగస్వాముల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించినట్లు ఇండెక్స్ ప్రొవైడర్ MSCI ఒక ప్రకటనలో తెలిపింది.
MSCI ప్రకటన ప్రకారం, "అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని సెక్యూరిటీల విషయంలో కొంతమంది పెట్టుబడిదార్ల స్థాయిలో తగినంత అనిశ్చితి ఉందని తేలింది. మా ప్రమాణాల ప్రకారం ఆయా సెక్యూరిటీలను ఇకపై 'ఫ్రీ ఫ్లోట్'గా పేర్కొనకూడదు. తదనుగుణంగా ఫ్లోట్ హోదా తగ్గించడం జరిగింది".
4 అదానీ కంపెనీల వెయిటేజీ తగ్గింపు
ఫ్రీ ఫ్లోట్ హోదా తగ్గించడం ద్వారా, ఇండెక్స్‌లోని 4 అదానీ కంపెనీల వెయిటేజీని MSCI తగ్గించబోతోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం... అదానీ గ్రూప్‌నకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) వెయిటేజీని 30 బేసిస్ పాయింట్ల మేర MSCI తగ్గించనుంది. దీంతో పాటు.. అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), ఏసీసీ లిమిటెడ్ (ACC) వెయిటేజీని కూడా తగ్గించనుంది.
2023 జనవరి 30 నాటికి, MSCI వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌లో (MSCI emerging markets index) ఈ నాలుగు కంపెనీలకు కలిపి 0.4% వెయిటేజ్ కలిగి ఉన్నాయి. మారిన వెయిటేజీలు 2023 మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయి.
ప్రస్తుతం, ఎనిమిది అదానీ గ్రూప్ స్టాక్స్, అనుబంధ కంపెనీల స్టాక్స్ MSCI స్టాండర్డ్ ఇండెక్స్ ప్రొవైడర్‌లో భాగంగా ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.