Maruti Q4 Results: డివిడెండ్ అంటే ఇలా ఉండాలి - మారుతి షేర్‌హోల్డర్లకు పండగ
2023 మార్చి త్రైమాసికంలో రూ. 86.85 గా ఉన్న మారుతి సుజుకీ EPS (Earnings Per Share), 2024 మార్చి త్రైమాసికంలో రూ. 123.34 కు పెరిగింది.
Maruti Suzuki Q4 FY24 Results: దేశంలోని అతి పెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి, తన షేర్‌హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఎన్నడూలేనంత డివిడెండ్‌ను (Maruti Suzuki FY24 Dividend) ఈసారి అనౌన్స్ చేసింది. మార్చి త్రైమాసిక నికర లాభంలో ఈ ఆటోమొబైల్ కంపెనీ దూసుకెళ్లింది.
మారుతి సుజుకీ లాభం, డివిడెండ్
మారుతి సుజుకీ, 2024 జనవరి-మార్చి త్రైమాసికం (Q4 FY24) ఫలితాల కార్డ్‌ను శుక్రవారం (26 ఏప్రిల్ 2024) వెల్లడించింది. నాలుగో త్రైమాసికంలో రూ. 3,877.8 కోట్ల నికర లాభాన్ని (Maruti Suzuki Q4 FY24 Net Profit) మారుతి ఆర్జించింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ మొత్తం రూ. 2,623.6 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే, సంవత్సర కాలంలో మారుతి సుజుకీ 'పన్ను తర్వాతి లాభం' (PAT) 47.8 శాతం జంప్ చేసింది. భారీ స్థాయిలో వచ్చి పడ్డ లాభాలను తన షేర్‌హోల్డర్లతో పంచుకోవాలని ఆటోమొబైల్ కంపెనీ నిర్ణయించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 125 డివిడెండ్ ప్రకటించింది. మారుతి సుజుకీ ఇప్పటి వరకు ప్రకటించిన అతి పెద్ద డివిడెండ్ ఇదే.
మారుతి సుజుకీ ఆదాయం
2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మారుతి సుజుకీ ఆదాయం (Maruti Suzuki Q4 FY24 Revenue) రూ. 36,697.5 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం, 2023 మార్చి త్రైమాసికంలో ఇది రూ. 30,821 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే, ఈ ఏడాది కాలంలో (YoY) 19 శాతం పెరిగింది. 2024 జనవరి-మార్చి కాలంలో 'పన్నుకు ముందు లాభం' (PBT) కూడా 53.6 శాతం పెరిగి రూ. 49,978 కోట్లకు చేరుకుంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇది రూ. 32,548 కోట్లుగా ఉంది.
2023 మార్చి త్రైమాసికంలో రూ. 86.85 గా ఉన్న మారుతి సుజుకీ EPS (Earnings Per Share), 2024 మార్చి త్రైమాసికంలో రూ. 123.34 కు పెరిగింది.
మారుతి సుజుకీ విక్రయాలు
2023-24 ఫైనాన్షియల్ ఇయర్ చివరి క్వార్టర్‌లో మారుతి సుజుకి విక్రయాలు 13.4 శాతం పెరిగాయి, 5,84,031 యూనిట్లకు చేరుకున్నాయి. 2023 మార్చి త్రైమాసికంలో టోటల్ సేల్స్ 5,14,927 యూనిట్లుగా ఉన్నాయి.
గుజరాత్‌లోని నాలుగో యూనిట్‌లో ఈ సంవత్సరం చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. మారుతి తొలిసారిగా 20 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించిందని చెప్పారు. అంతేకాదు, కంపెనీ వరుసగా మూడో సంవత్సరం కూడా వాహనాల అతి పెద్ద ఎగుమతిదారుగా నిలిచిందని వివరించారు.
శుక్రవారం, మారుతి సుజుకీ షేర్ ధర బీఎస్‌ఈలో 1.70 శాతం తగ్గి రూ. 12,687 వద్ద క్లోజ్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.