LPG cylinder price: కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ విందాం, వంట గ్యాస్ ధర తగ్గొచ్చు!
ఈ మధ్యకాలంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి.
LPG cylinder price: ఇంట్లో వస్తువు నుంచి ఇన్‌కం టాక్స్ వరకు ప్రతీది సామాన్యుడికి గుదిబండ మారింది. దేశంలో దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేన్నీ కొనలేం, కోరుకోలేం.
అయితే... కొత్త సంవత్సరంలో మీరు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. 2023లో ఇంటింటి వంట ఖర్చు కాస్త తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు (Oil Marketing Companies) నూతన సంవత్సరంలో వంట గ్యాస్ (LPG) ధరల తగ్గింపును ప్రకటించవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ఈ మధ్యకాలంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. గరిష్టంగా 147 డాలర్ల వరకు వెళ్లిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు, ఇప్పుడు దాదాపు సగానికి పడిపోయింది, 80 డాలర్ల వద్ద ఉంది. ఇలా తగ్గిన రేట్ల వద్ద భారతీయ చమురు సంస్థలు ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. ఈ ప్రయోజనాన్ని, LPG సిలిండర్ల ధరలను తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు ఆయా సంస్థలు అందించే అవకాశం ఉంది.
క్రూడాయిల్ ధరలు తగ్గినా, కొండ దిగని LPG రేటు
ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో 14.2 కిలోల LPG సిలిండర్‌ను రీఫిల్ చేయడానికి రూ. 1094.50 చెల్లించాలి. దేశ రాజధాని దిల్లీలో రూ. 1053, కోల్‌కతాలో రూ. 1079, ముంబైలో రూ. 1052.50, చెన్నైలో రూ. 1068. పట్నాలో రూ. 1151, లఖ్‌నవూలో రూ. 1090 చెల్లించాలి. గత ఆరు నెలలుగా, అంటే.. 6 జులై 2022 నుంచి LPG సిలిండర్ల ధరలలో ప్రభుత్వ చమురు కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. ఈ కాలంలోనే క్రూడ్ ఆయిల్ ధరల్లో భారీ పతనం చోటు చేసుకుంది. ఈ కాలంలో ముడి చమురు ధరలు దాదాపు 50 శాతం తగ్గాయి.
2022లో, ప్రభుత్వ చమురు కంపెనీలు దేశీయ వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు దాదాపు రూ. 150 పెంచాయి. అక్టోబర్ 2021లో, దేశీయ వంట గ్యాస్ రూ. 899కి అందుబాటులో ఉన్నప్పుడు, ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 85 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం, ముడి చమురు బ్యారెల్‌కు సుమారు 80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, భారత బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు సుమారు 77 డాలర్లుగా ఉంది. దేశీయ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వ చమురు కంపెనీలు ఆలోచించడానికి ఇదొక కారణం.
రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంతో పెరిగిన ఒత్తిడి
వంట గ్యాస్ భారీ ధరల విషయంలో మోదీ సర్కార్ మీద ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ఖరీదైన వంట గ్యాస్ గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. 2014లో వంట గ్యాస్ సిలిండర్‌కు రూ. 414కి ఎలా అందించామో గుర్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి రూ. 500కి సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది, జైపూర్‌లో ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 1056. అంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సగం ధరకే LPG సిలిండర్లను ప్రజలకు అందజేయబోతోంది. రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. కొత్త సంవత్సరంలో వంట గ్యాస్ ధరల తగ్గొచ్చు అన్న అంచనాలకు ఇది మరొక కారణం.