Corporate Culture: 'సైలెంట్ ఫైరింగ్' గురించి తెలుసా? - అమెజాన్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయింది!
Silent Firing: 'సైలెంట్ ఫైరింగ్' ద్వారా, టార్గెట్ చేసిన ఉద్యోగులను సదరు కంపెనీ యాజమాన్యం చాలా ఈజీగా, తన చేతులకు మట్టి అంటకుండా తొలగిస్తోంది.
Silent Firing In Corporate Culture: ఇటీవలి సంవత్సరాల్లో, ముఖ్యంగా కరోనా కాలం నుంచి కార్పొరేట్ సంస్కృతిలో కొన్ని మార్పులు వచ్చాయి. గ్రేట్ రిజిగ్నేషన్ (Great Resignation), క్వైట్ కిట్టింగ్ (Quiet Quitting), క్వైట్ ఫైరింగ్ (Quiet Firing), మూన్‌లైటింగ్ (Moonlighting), రేజ్ అప్లైయింగ్ (rage applying) లాంటి ట్రెండ్స్ పెరిగాయి. ఇవి కరోనా కంటే ముందు లేవు, వర్క్ కల్చర్‌కు అనుగుణంగా పుట్టుకొచ్చాయి. కొత్త రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పుడు, "సైలెంట్ ఫైరింగ్" అనే కొత్త ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఉనికిలోకి వస్తోంది. ఇది, ఎంప్లాయ్‌మెంట్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) వల్ల త్వరలో తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతో కార్మికుల్లో సైలెంట్ ఫైరింగ్ ట్రెండ్ ప్రారంభమవుతుందని కొందరు ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటే, ఈ మార్పు ఇప్పటికే మొదలైందని మరికొందరు నమ్ముతున్నారు.
పొమ్మనకుండా పొగబెట్టడమే సైలెంట్ ఫైరింగ్
సైలెంట్ ఫైరింగ్ (Silent Firing) అంటే.. ఒక ఉద్యోగి తనంతట తానుగా ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆ కంపెనీ నుంచి వెళ్లిపోయేలా చేయడం. కంపెనీ యజమాన్యం ఒక ఉద్యోగాన్ని సవాలుగా మార్చడం లేదా ఉద్యోగం చేసే పరిస్థితులను ప్రతికూలంగా మార్చడం వల్ల... ఆ ఒత్తిడి భరించలేక ఉద్యోగి స్వచ్ఛందంగా కంపెనీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోవడమే సైలెంట్ ఫైరింగ్. తద్వారా, యాజమాన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఆ కంపెనీలోకి మార్గం సుగమం చేస్తుందని న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. "పొమ్మనకుండా పొగబెట్టడం" అంటే ఇదే. కంపెనీ యాజమాన్యం, తాను టార్గెట్ చేసిన ఉద్యోగిని తన చేతులతో జాబ్ నుంచి తొలగించకుండా, అతనే స్వయంగా కంపెనీని వదిలి వెళ్లిపోయేలా పరిస్థితులను క్లిష్టంగా మార్చేస్తుంది.
అమెజాన్ ఒక ఉదాహరణ
దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ కూడా ఉంది. అమెజాన్ ఆఫీస్‌లో పని చేసే ఉద్యోగుల సంఖ్య సమృద్ధిగా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ వారంలో ఐదు రోజుల పనిని ఆఫీస్‌లోనే చేయాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదని ఆ కంపెనీ పట్టుబడుతోంది. ఇది నచ్చని కొందరు ఉద్యోగులు జాబ్‌కు రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. ఈ విధానం కారణంగా 73 శాతం మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టాలని భావించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అమెజాన్, వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాన్ని AIతో భర్తీ చేస్తోందట. రిమోట్ వర్క్/ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీ లాభాలకు ఢోకా లేదన్న సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. రిమోట్ వర్క్ ఆప్షన్‌ను నిరుత్సాహపరచడం ద్వారా ఖర్చు లేకుండా సిబ్బందిని తగ్గించే లక్ష్యంతో అమెజాన్ పని చేస్తోందని జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కార్పొరేట్ ప్రపంచం AI ప్రభావాన్ని చాలా ఎక్కువగా అంచనా వేస్తోందని ఎకనామిస్ట్, MIT ప్రొఫెసర్ డారన్ అసెమోగ్లు (Daron Acemoglu) హెచ్చరిస్తున్నారు. రాబోయే పదేళ్లలో కేవలం 5 శాతం ఉద్యోగాలను మాత్రమే AIతో భర్తీ చేయగలరని లేదా AI ద్వారా మద్దతు తీసుకోగలరని చెప్పారు. AI మీద అతిగా అంచనాలు, ఆశలు పెట్టుకుని చాలా డబ్బు వృథా చేస్తున్నారని అసిమోగ్లు చెప్పారు. ఆ 5 శాతం నుండి ఆర్థిక విప్లవాన్ని (గణనీయమైన లాభాలు) సాధించలేరని సూచించారు. మనుషులు చేసే పనులను అచ్చంగా అలాగే కృత్రిమ మేధ చేయలేదని, AIకి కొన్ని పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
AIతో ఉద్యోగాల భర్తీ వల్ల జెడ్ జెనరేషన్ (Gen Z) ఉద్యోగుల్లో "గ్రేట్ డిటాచ్‌మెంట్" (Great Detachment) అనే ట్రెండ్ కూడా ప్రారంభమైంది. కంపెనీకి-యువ ఉద్యోగుల మధ్య తగ్గిపోతున్న అనుబంధాన్ని ఈ ట్రెండ్ సూచిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది