CIBIL Score: లోన్ కోసం సిబిల్ స్కోర్ సరిపోవడం లేదా? ఆ క్రెడిట్ కార్డ్ వాడితే క్రెడిట్ స్కోర్ జంప్
Loan depends on CIBIL Score | కస్టమర్ల కోసం సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ జారీ చేయనున్నారు. దీన్ని రెగ్యూలర్ గా ఉపయోగించినప్పుడు, నెలవారీ బిల్లులు సకాలంలో చెల్లిస్తే CIBIL స్కోర్‌ను బిల్డ్ చేసుకోవచ్చు
Credit Score: మనలో చాలా మందికి లోన్ పొందేందుకు క్రెడిట్ స్కోర్ తగినంత ఉండదు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మెుదటిది గతంలో క్రెడిట్ ట్రాక్ రికార్డు లేకపోవటం ఒకటైతే మరొకటి మనం చేసే కొన్ని పనుల వల్ల సిబిల్ స్కోర్ (CIBIL Score) దెబ్బతినటం. కొత్తగా లోన్స్ పొందటానికి ఆర్థిక సంస్థలను సంప్రదించినప్పుడు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది.
క్రెడిట్ కార్డులు అన్ సెక్యూర్డ్ కేటగిరీ
బ్యాంకులు రెండు రకాల రుణ ఉత్పత్తులను విక్రయిస్తుంటాయి. ఒకటి సెక్యూర్డ్ కాగా మరొకటి అన్‌సెక్యూర్డ్. సాధారణంగా క్రెడిట్ కార్డులు అన్ సెక్యూర్డ్ కేటగిరీ కిందకు వస్తుంటాయి. అందువల్ల క్రెడిట్ కార్డు పొందటానికి సహజంగా సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆదాయం, బ్యాంక్ ఇతర ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ పొందటానికి అర్హతను సాధించలేకపోతే సురక్షితమైన క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను మనం అర్థం చేసుకుందాం..
సురక్షితమైన క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి..?
క్రెడిట్ కార్డు పొందేందుకు సహజంగా అర్హత లేని వ్యక్తులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి వ్యతిరేకంగా జారీచేయబడే క్రెడిట్ కార్డులను పొందవచ్చు. ఇక్కడ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తులు కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని తెరవవాల్సి ఉంటుంది. దానిని షూరిటిగా తీసుకుని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌ను అందించమని బ్యాంక్‌ని అడగవచ్చు. ఇందులో కార్డ్ పరిమితి సదరు వ్యక్తి బ్యాంకులో చేసే డిపాజిట్ మెుత్తంపై ఆదారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు డిపాజిట్ చేసిన మెుత్తంలో 75 నుంచి 90 శాతం వరకు లిమిట్ అందిస్తుంటాయి. ఉదాహరణకు రెగ్యులర్ ఇన్కమ్ లేని విద్యార్ధులు లేదా గృహిణులు వారికి ఆదాయ వనరు లేనందున సురక్షితమైన క్రెడిట్ కార్డ్ కోసం ప్రయత్నించవచ్చు.
ఇక్కడ సెక్యూర్డ్ కార్డ్ పొందిన వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కార్డు పొందిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ క్లోజ్ చేయటం కుదరదు. FD మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ముందుగా క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు ఆటోమెటిక్‌గా రెన్యూవల్ చేయబడుతుంది. పదవీకాలం మునుపటి మాదిరిగానే ఉంటుంది.
సిబిల్ స్కోర్ పెంచుకోవటంలో క్రెడిట్ కార్డ్ పాత్ర ఇదీ
కార్డ్ పొందిన తర్వాత మీరు గ్రోసరీ షాపింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, వైద్య ఖర్చులు, ఆన్‌లైన్ షాపింగ్, డైనింగ్ మొదలైన సాధారణ ఖర్చుల కోసం దాన్ని ఉపయోగించవచ్చు. బిల్లింగ్ సైకిల్ పూర్తైన తర్వాత 100 శాతం బిల్లును ఏకకాలంలో చెల్లించేలా చూసుకోండి. ప్రతినెల దీనిని ఫాలో అవటం వల్ల క్రమంగా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మీరు గడువు తేదీలోగా నెలవారీ బిల్లును చెల్లించడంలో విఫలమైతే, బ్యాంక్ సెక్యూరిటీగా అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి డబ్బును తిరిగి పొందుతుంది. సిబిల్ రిపోర్ట్ గణించే సమయంలో సమయానికి చెల్లింపులు చేయటం కూడా పరిగణించబడుతుంది.
మొదటిసారి రుణగ్రహీతలకు CIBIL స్కోర్‌ను నిర్మించడంలో సహాయం చేయడమే కాకుండా గతంలో డిఫాల్ట్ అయిన వ్యక్తులకు వారి క్రెడిట్ స్కోర్‌ను రిపేర్ చేయడానికి, పునర్నిర్మించడానికి కూడా సురక్షిత క్రెడిట్ కార్డ్ సహాయపడుతుంది. మీరు 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను అందుకున్న తర్వాత.. మీరు మీ క్రెడిట్ స్కోర్, ఆదాయ అర్హత, ఇతర పారామితుల ఆధారంగా క్రెడిట్ కార్డ్‌లు, లోన్‌ల కోసం దరఖాస్తు చేసుకుని వాటిని ఆర్థిక సంస్థల నుంచి పొందవచ్చు.