Jewellery Retailers Shares: ధన్‌తేరస్ వస్తోందని జ్యువెలరీ స్టాక్స్ కొంటున్నారా?, ముందు ఇది చదవండి
ఈ పండుగ సీజన్‌లో మొదటి 10 రోజుల్లోనే ఆభరణాల అమ్మకాలు 20% పెరిగాయి.
Jewellery Retailers Shares: బంగారం ఎప్పటికీ బంగారమే. పండుగలు, పబ్బాలతో సంబంధం లేకుండా (ఇండియాలో) పరుగులు పెడుతూనే ఉంటుంది. ఫెస్టివ్ సీజన్‌లో మెరుపు మరింత పెరుగుతుంది. ఈ పండుగ సీజన్‌లో బంగారు నగల అమ్మకాలు అమాంతం పెరగడంతో జ్యువెలరీ రిటైలర్స్ షేర్లు గత కొన్ని నెలలుగా దౌడు తీస్తున్నాయి.
షేర్ల పరుగో పరుగు
2023 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (అక్టోబర్ 18వ తేదీ వరకు) చూస్తే.... పీసీ జ్యువెలర్ (PC Jeweller) షేర్లు 390 శాతం ర్యాలీ చేశాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ (Kalyan Jewellers) కౌంటర్ 84 శాతం, త్రిభువన్‌దాస్ భీమాజీ జవేరీ (Tribhovandas Bhimji Zaveri) స్క్రిప్ 21 శాతం, టైటన్ (Titan) షేర్లు 4 పెరిగాయి. ఇదే కాలంలో, నష్టాల నుంచి బయపడేందుకు BSE సెన్సెక్స్ ఆపసోపాలు పడుతోంది.
గత ట్రెండ్‌లను బట్టి చూస్తే, ఈ ఏడాది ధన్ తేరస్‌లో (Dhanteras) నగల వ్యాపారులు బంపర్ సేల్స్ చేసే అవకాశం ఉంది. తగ్గిన బంగారం ధర డిమాండ్‌ను పెంచింది, అమ్మకాల అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఆభరణాల దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది.
అనలిస్ట్‌లు బుల్లిష్
HDFC సెక్యూరిటీస్ వేసిన లెక్క ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో మొదటి 10 రోజుల్లోనే ఆభరణాల అమ్మకాలు 20% పెరిగాయి. ఈ ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్న మార్కెట్ అనలిస్ట్‌లు జ్యువెలరీ స్టాక్స్ మీద నమ్మకంతో ఉన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23), బంగారు నగల విక్రయాల్లో ఆరోగ్యకరమైన 18% వార్షిక వృద్ధిని టైటన్ సాధించింది. కళ్యాణ్ జ్యువెలర్స్ మొత్తం అమ్మకాలు 20% పైగా పెరిగాయి.
బంగారు ఆభరణాల మీద హాల్‌మార్క్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో, కొనుగోళ్ల గాలి అసంఘిటిత రంగం నుంచి సంఘటిత రంగం వైపు మళ్లింది. చిన్నాచితకా షాపుల్లో నగలు కొనడం తగ్గింది. బ్రాండెడ్ రిటైల్ ఔట్‌లెట్లలో ఫుట్‌ప్రింట్స్ పెరుగుతున్నాయి. లిస్టెడ్ కంపెనీలు ఈ మార్పు నుంచి గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటున్నాయి.
దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంలో, టైటన్ & కళ్యాణ్ జ్యువెలర్స్ మీద IDBI క్యాపిటల్ బుల్లిష్‌గా ఉంది. ఈ సెక్టార్‌కు రావలసిన లాభాలన్నీ పండుగ సీజన్ ప్రారంభంలోనే వచ్చాయి కాబట్టి, మీడియం టర్మ్‌లో పెద్దగా ర్యాలీ ఉంటుందని ఈ బ్రోకరేజ్ భావించడం లేదు.
ALSO READ: ఒక షేర్ కొంటే మరొకటి ఫ్రీ - మహారాష్ట్ర సీమ్‌లెస్ బోనస్ ఇష్యూ
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.