CBDT ITR filing: కార్పొరేట్ కంపెనీల ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు గడువు నవంబర్ 7 వరకు పొడిగింపు
కంపెనీ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో 8 రోజులు ఉపశమనం ఇస్తూ ఆఖరు తేదీని నవంబర్ 7, 2022 వరకు జరిపింది.
ITR filing deadline: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ - CBDT), కంపెనీలకు ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే తేదీని వాటి కోసం పొడిగించింది.
మరో 8 రోజుల ఉపశమనం
2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే తేదీని కంపెనీల కేటగిరీలో పెంచుతున్నట్లు CBDT ప్రకటించింది. ఈ వర్గం కిందకు వచ్చే పన్ను చెల్లింపుదారులు లేదా సంస్థలు ITR ఫైల్ చేయడానికి చివరి తేదీని 2022 అక్టోబర్ 31గా CBDT గతంలో నిర్ధేశించింది. కంపెనీ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో 8 రోజులు ఉపశమనం ఇస్తూ ఆఖరు తేదీని నవంబర్ 7, 2022 వరకు జరిపింది.
CBDT extends the due date for furnishing Income Tax Return for AY 2022-23 to 7th November, 2022 for certain categories of assessees in consequence of extension of due dates for filing various reports of audit. Circular No. 20/2022 dated 26.10.2022 issued.https://t.co/x9yhpL0d1T pic.twitter.com/T4LbT9Qy4K
— Income Tax India (@IncomeTaxIndia) October 26, 2022
కంపెనీ ఆదాయ, వ్యయ వివరాలను తెలిపే ఆడిట్ నివేదికలను దాఖలు చేసే గడువును గత నెలలో CBDT పొడిగించింది. ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ITR ఫైలింగ్ కోసం గడువు తేదీ పొడిగింపును పేర్కొంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యులర్ నంబర్ 20/2022 in F.No.225/49/2021/ITA-II. ఈ సర్క్యులర్‌ను www.incometaxindia.gov.in. సైట్‌లో చూడవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139 సబ్ సెక్షన్ 1 ప్రకారం తుది గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పెంచింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, సమర్పణ తేదీని మరో 8 రోజులు పెంచడం వల్ల పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.
వ్యక్తిగత ITR ఫైలింగ్‌కు డిసెంబర్ 31 వరకు గడువు
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి 2022 జులై 31తో గడువు ముగిసింది. జరిమానాతో రిటర్న్‌లు దాఖలు చేయడానికి 2022 డిసెంబర్ 31 వరకు గడువుంది. వ్యక్తిగత ఆదాయాన్ని బట్టి 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు జరిమానాతో కలిపి, 2022 డిసెంబర్ 31 నాడు లేదా ఈ తేదీ కంటే ముందు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఈ గడువు పొడిగింపు మీద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదు. జరిమానా లేకుండా రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఇచ్చిన చివరి తేదీ 2022 జులై 31ను CBDT పెంచలేదు కాబట్టి, జరిమానాతో కలిపి రిటర్న్‌లు దాఖలు చేసే తేదీని కూడా పెంచకపోవచ్చని భావిస్తున్నారు.