ITC Hotels Demerger: ఐటీసీ హోటల్ విభజనలో కీలక ఘట్టం, వాటాదార్ల భేటీకి ముహూర్తం ఖరారు
ప్రతి వాటాదారుడికి 10 ITC షేర్లకు బదులు ITC హోటల్స్‌లో ఒక షేర్ కేటాయిస్తారు.
ITC Hotels Demerger: ఐటీసీ షేర్‌హోల్డర్లు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మాతృ సంస్థ ఐటీసీ లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్ వ్యాపారాన్ని విభజించే ప్రణాళికను ఆమోదించడానికి ఈ ఏడాది జూన్ మొదటి వారంలో సమావేశం జరగనుంది. ఆ భేటీలో తీసుకునే నిర్ణయం ప్రకారం ఐటీసీ హోటల్స్‌ను వేరు చేసి, కొత్త కంపెనీగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేస్తారు.
జూన్ 06న వాటాదార్ల సమావేశం
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఐటీసీ ఇచ్చిన సమాచారం ప్రకారం... ఐటీసీ వాటాదార్ల సమావేశం జూన్ 06, 2024 ఉదయం 10.30 గంటలకు ఉంటుంది. ఎలక్ట్రానిక్ మోడ్‌లో ఈ మీటింగ్ జరుగుతుంది. కంపెనీ సాధారణ వాటాదార్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని 'నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్' (NCLT) ఆదేశించిన తర్వాత ఈ భేటీకి ఏర్పాట్లు చేశారు.
షేర్ల విభజన ఇలా..
క్రితం సంవత్సరం, 14 ఆగస్టు 2023న, కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం జరిగింది, 'స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్'కు బోర్డ్ మీటింగ్‌లో ఆమోదం లభించింది. దీని ప్రకారం... ప్రతి వాటాదారుడికి 10 ITC షేర్లకు బదులు ITC హోటల్స్‌లో ఒక షేర్ కేటాయిస్తారు. ఐటీసీ హోటల్స్ ఒక్కో షేర్ ముఖ విలువ ఒక రూపాయి అవుతుంది.
విభజన ప్రక్రియ కోసం వాటాదార్లు, రుణదాతలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ (SEBI), NCLT, ఇతర నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం పొందిన తర్వాత ITC హోటల్స్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవుతాయి. హోటల్ వ్యాపారం విభజనకు లభించిన ఆమోదం ప్రకారం, ఐటీసీ హోటల్స్‌లో 40 శాతం వాటా మాతృ సంస్థ (ITC లిమిటెడ్) వద్ద ఉంటుంది. మిగిలిన 60 శాతం షేర్లు ఐటీసీ వాటాదార్ల చేతిలో ఉంటుంది.
భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆతిథ్య హాస్పిటాలిటీ పరిశ్రమలో (Hospitality Industry), హోటల్ వ్యాపారం ఒక ప్రత్యేక సంస్థగా ఎదిగేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని కంపెనీ బోర్డు విశ్వసిస్తోందని ఐటీసీ తెలిపింది. కొత్త హోటల్ యూనిట్ వ్యాపారంతో పాటు మూలధన సేకరణపై దృష్టి సారించనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు.. ITC సంస్థాగత బలం, బ్రాండ్, గుడ్‌విల్ నుంచి కూడా ప్రయోజనం పొందుతుంది.
ITCకి భారతదేశ వ్యాప్తంగా 70 ప్రదేశాల్లో 11,600 గదులతో 120 హోటళ్లు ఉన్నాయి.
బుధవారం (24 ఫిబ్రవరి 2024) మార్కెట్ ముగిసిన తర్వాత ఐటీసీ వాటాదార్ల సమావేశం తేదీని ప్రకటించారు. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి, ఐటీసీ షేర్లు 0.07 శాతం పతనంతో రూ. 428.90 వద్ద ముగిశాయి. గత మూడు నెలల్లో ITC షేర్లు పెట్టుబడిదార్లకు 7.5 శాతం ప్రతికూల రాబడి ఇచ్చాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.