Gold Hallmarking: మీ ఆభరణం హాల్‌మార్కింగ్ అసలా, నకిలీయా - ఎప్పుడైనా డౌట్ వచ్చిందా?
హాల్‌మార్కింగ్ అంటే, నాణ్యతను నిర్ధారిస్తూ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' (BIS) ఇచ్చే ప్రమాణ పత్రం. నగల మీద ఈ మార్క్ ఉంటే సదరు బంగారం స్వచ్ఛమైనన్న హామీ ఉంటుంది.
Gold Hallmarking: బంగారం అంటే భారతీయులకు, ముఖ్యంగా మగువలకు పిచ్చి. వీసమెత్తు బంగారమైనా వేసుకోకోపోతే ఒంటిపై తేళ్లు, జెర్రులు పాకినట్లు ఫీలవుతారు. నెలనెలా దేశంలోకి దిగుమతయ్యే టన్నుల కొద్దీ బంగారమే మనకున్న మోజుకు నిదర్శనం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం 3.4 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలోని 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన దిగుమతులతో పోలిస్తే, ఈసారి 35 శాతం పెరుగుదలను సూచిస్తోంది. దేశంలోకి వచ్చే బంగారమంతా బిస్కట్ల రూపంలో లాకర్లలోకి, నగల రూపంలో అతివల ఒంటి మీదకు చేరుతోంది.
అయితే, బంగారం కొనేటప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టే అంశం దాని స్వచ్ఛత. 22 క్యారెట్ల గోల్డ్ అని చెప్పి షాపువాడు ఒక నగ చూపిస్తే, అతను నిజమే చెబుతున్నాడా అన్న సంశయం కచ్చితంగా ఉంటుంది. బంగారు నగల విషయంలో ఈ ఇబ్బందిని పోగొట్టడానికి, హాల్ మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. హాల్‌మార్కింగ్ అంటే, నాణ్యతను నిర్ధారిస్తూ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' (BIS) ఇచ్చే ప్రమాణ పత్రం. నగల మీద ఈ మార్క్ ఉంటే సదరు బంగారం స్వచ్ఛమైనన్న హామీ ఉంటుంది.
శత కోటి మోసాలకు అనంత కోటి ఉపాయాలున్నట్లు.. కొంతమంది ఈ హాల్ మార్క్‌ను కూడా డూప్లికేట్ చేస్తున్నారు. BIS నుంచి లైసెన్సు పొందిన AHC (ఎసేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్) నుంచి కాకుండా, తమ సొంత తెలివితో హాల్ మార్కింగ్ వేసి, ఆ నాణ్యత లేని పసిడిని జనానికి అంటగడుతున్నారు. మీరు కొనే లేదా ఇప్పటికే కొన్న నగల మీద ఉన్న హాల్ మార్కింగ్ గుర్తు అసలైనదా లేదా నకిలీయా అన్నది తెలుసుకోవాలంటే.. వినియోగదారులకు కూడా హాల్‌మార్కింగ్ గురించి అవగాహన ఉండాలి.
అసలు - నకిలీ గుర్తింపు ఎలా?
బంగారు నగలు కొనే ముందు ఆ ఆభరణాల మీద ఉన్న BIS ముద్రను ముందుగా చూడాలి. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది.
ఆ నగ 22 క్యారెట్ల బంగారమేనని నిర్ధారించే క్యారెటేజ్ (22k 916) ఉందో లేదో చూడాలి.
బంగారు ఆభరణాల స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం (24k) అంటే సంపూర్ణ స్వచ్ఛమైనది అని అర్ధం. ఇది బిస్కట్లు, కడ్డీల రూపంలో ఉంటుంది. నగలు చేయడానికి 24k గోల్డ్ పనికిరాదు, చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఆభరణాల తయారీకి అనుకూలంగా 24k బంగారాన్ని మార్చేందుకు సాధారణంగా రాగిని (కొందరు వెండిని కూడా) అందులో కలుపుతారు. అప్పుడు బంగారం స్వచ్ఛత మారుతుంది. ఇతర లోహాల శాతం ఎంత పెరిగితే, బంగారం స్వచ్ఛత అంత తగ్గుతుంది. దీని ఆధారంగా 14k, 18k, 22k క్యారెట్లలో హాల్ మార్కింగ్ జరుగుతుంది. హాల్‌మార్క్ 22k అని ఉంటే, 91.6 శాతం స్వచ్ఛతను అది సూచిస్తుంది.
BIS ముద్రతోపాటు AHC గుర్తు ఉందో లేదో చూడాలి. షాపువాడి మీద మీకు డౌట్ ఉంటే, BIS లైసెన్స్ చూపించమని కూడా మీరు అడగొచ్చు. BIS నిబంధనల ప్రకారం.. కొనుగోలుదారుడు అడిగితే సదరు నగల వ్యాపారి లైనెన్స్ చూపించాల్సిందే. అందువల్ల, దుకాణంలోనే లైసెన్స్ కాపీని ఫ్రేమ్ కట్టి ప్రదర్శిస్తుంటారు.
నగ ధరతోపాటు, దాని మీద హాల్ మార్కింగ్ వేసినందుకు కూడా నగల వ్యాపారి మీ నుంచి డబ్బు వసూలు చేస్తాడు. హాల్ మార్కింక్ కోసం ఎంత తీసుకున్నాడో తెలుకోవాలంటే, బిల్ బ్రేక్ అప్‌ను అడగడం. ఇందులో హాల్‌మార్కింగ్ కోసం ఎంత ఛార్డ్ చేశాడో తెలుసుకోవచ్చు. హాల్ మార్కింగ్ కోసం ఒక్కో నగకు నగల వ్యాపారి నుంచి AHCలు రూ.45 వసూలు చేస్తాయి. వెండి ఆభరణాల హాల్ మార్కింగ్ కోసం రూ.35 తీసుకుంటారు.
కొన్న నగ స్వచ్ఛత మీద మీకు సందేహం ఉంటే.. మీరే సొంతంగా AHCకు వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. BIS వెబ్‌సైట్‌లో AHCల లిస్ట్ ఉంటుంది. నాణ్యత పరీక్ష కోసం వీళ్లు మీ నుంచి కొంత రుసుము వసూలు చేస్తారు.
ఒకవేళ, నగల వ్యాపారి చెప్పిన దాని కంటే తక్కువ స్వచ్ఛత ఉందని తేలితే ఆ షాపువాడికి మూడినట్లే. అలాంటి సందర్భాల్లో నగల వ్యాపారి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. బంగారం నాణ్యతను తప్పుగా తెలియజేసిన సదరు AHC మీద కూడా BIS చర్యలు తీసుకుంటుంది.