loss in Adani Stocks: కలిసికట్టుగా ₹10 లక్షల కోట్లు - నష్టాన్ని రౌండ్ ఫిగర్ చేసిన అదానీ కంపెనీలు
హిండెన్‌బర్గ్ చేసిన భీకర దాడి తర్వాత మొత్తం 10 లిస్టెడ్ అదానీ స్టాక్‌ల మార్కెట్ విలువ సగానికి సగం తగ్గింది.
![loss in Adani Stocks: కలిసికట్టుగా ₹10 లక్షల కోట్లు - నష్టాన్ని రౌండ్ ఫిగర్ చేసిన అదానీ కంపెనీలు Investors in Adani stocks lose Rs 10 lakh crore in 7 days as market cap halves, check details loss in Adani Stocks: కలిసికట్టుగా ₹10 లక్షల కోట్లు - నష్టాన్ని రౌండ్ ఫిగర్ చేసిన అదానీ కంపెనీలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/41893c2901f5d9d5e0edc2e2c8407cd81675405227089545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
loss in Adani Stocks: సరిగ్గా 11 రోజుల ముందు, అంటే 2023 జనవరి 24కు ముందు, స్టాక్ మార్కెట్‌లో అదానీ తుపాను బీభత్సం సృష్టిస్తుందని, ఇన్వెస్టర్ల సంపదను తుడిచి పెట్టేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అసలు ఆ ఆలోచన కూడా వచ్చి ఉండదు. ఎందుకంటే, అప్పటికి అదానీ స్టాక్స్ రాకెట్లకు జిరాక్స్ కాపీలు. పైపైకి దూసుకు వెళ్లడమేగానీ నేలచూపులు ఎరగవు.
కానీ, జనవరి 24 నుంచి పరిస్థితి తలకిందులైంది. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన ఆ రోజు నుంచి అదానీ రాకెట్లు తుస్సుమన్నాయి, నేరుగా నేలకూలడం మొదలు పెట్టాయి. ఇన్వెస్టర్ల సంపదను హారతి కర్పూరం చేశాయి.
"డోన్ట్ ట్రై టు క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్" (Don't try to catch a falling knife) అనే ఆంగ్ల సామెత రూపంలో స్టాక్ మార్కెట్‌లో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని మరిచి, పడుతున్న అదానీ కంపెనీల షేర్లను కొన్నవాళ్లు కూడా ఇప్పుడు నడిబజార్లో నిలబడ్డారు.
రూ.10 లక్షల కోట్ల నష్టం
బిలియనీర్ గౌతమ్ అదానీ సువిశాల సామ్రాజ్యం మీద హిండెన్‌బర్గ్ చేసిన భీకర దాడి తర్వాత, మొత్తం 10 లిస్టెడ్ అదానీ స్టాక్‌ల మార్కెట్ విలువ సగానికి సగం తగ్గింది. ఇవన్నీ కలిసికట్టుగా రూ. 10 లక్షల కోట్లు నష్టపోయాయి. అంటే, అదానీ స్టాక్స్‌లో పెట్టుబడిదార్లకు పెట్టుబడిదార్ల రూ. 10 లక్షల కోట్ల సంపదను హరించేశాయి.
అమెరికన్ షార్ట్ సెల్లర్ రిపోర్ట్ విడుదల చేసినప్పటి నుంచి, ఈ ఏడు ట్రేడింగ్ సెషన్లలో, మొత్తం 10 అదానీ గ్రూప్ స్టాక్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ 51% పైగా తగ్గి రూ. 9.31 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇంట్రా డేలో, 30% నష్టంతో రూ. 1095.30 వద్ద లోయర్ సర్క్యూట్‌లో వద్ద లాక్ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీ50 స్టాక్స్‌లో టాప్ లూజర్‌గా నిలిచింది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్టం నుంచి ఇప్పటి వరకు 74% పైగా క్షీణించింది. ఈ వారం ప్రారంభంలో ఈ కంపెనీ తన రూ. 20,000 కోట్ల FPOను ఉపసంహరించుకుంది. FPOలో ఒక్కో షేర్ ధరను రూ. 3,112 - 3,276 గా నిర్ణయించింది. ఈ ధరతో పోల్చి చూసినా, ప్రస్తుతం 65% నష్టం కనిపిస్తోంది.
మిగిలిన అదానీ గ్రూప్ స్టాక్స్‌లో, అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) రెండూ 10% లోయర్ సర్క్యూట్‌లో ఆగి బతికిపోయాయి. అంతులేని అమ్మకాల ఒత్తిడి మధ్య అదానీ పవర్ (Adani Power), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ విల్మార్ (Adani Wilmar), ఎన్డీడీవీ (NDTV) షేర్లు తలో 5% లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి.
NSE, SEBI, RBI డేగ కళ్లు
అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్‌లోని తీవ్ర అస్థిరత నుంచి పెట్టుబడిదారులను రక్షించడానికి NSE అదనపు నిఘా పెట్టింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, అంబుజా సిమెంట్స్‌ను స్వల్పకాలిక అదనపు నిఘా చర్యల (ASM) ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకువచ్చింది. ట్రేడర్లు ఈ స్టాక్స్‌లో ఇంట్రాడే ట్రేడ్‌ల కోసం కూడా ఇప్పుడు 100% ముందస్తు మార్జిన్‌ను చెల్లించాలి. దీనివల్ల షార్ట్ సెల్లింగ్ అదుపులోకి వస్తుంది.
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల క్రాష్ నేపథ్యంలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPOలోనూ ఏవైనా అవకతవకలు జరిగాయా అని సెబీ (SEBI) కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అదానీ గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సంబంధించి పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బ్యాంకులకు సూచించింది. అదానీ గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన హై లీవరేజ్డ్ (ఎక్కువ మార్జిన్) రుణాల మీద ఆర్‌బీఐ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)