Infosys Variable Pay: మొన్న విప్రో, నిన్న టీసీఎస్, నేడు ఇన్ఫీ! ఉద్యోగుల వేరియబుల్ పే తగ్గింపు!
Infosys Variable Pay: ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వరుస షాకులు ఇస్తున్నాయి. అట్రిషన్ రేటుతో భారీ వేతనాలు ఆఫర్ చేసే సంస్థలు ఇప్పుడు వేరియబుల్ పేను ఆలస్యం చేస్తున్నాయి.
![Infosys Variable Pay: మొన్న విప్రో, నిన్న టీసీఎస్, నేడు ఇన్ఫీ! ఉద్యోగుల వేరియబుల్ పే తగ్గింపు! Infosys Reduces Average Variable Pay for June Quarter Amid Margin Squeeze Infosys Variable Pay: మొన్న విప్రో, నిన్న టీసీఎస్, నేడు ఇన్ఫీ! ఉద్యోగుల వేరియబుల్ పే తగ్గింపు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/16/61d8be3a44fb0c8e6340691822a37ab2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Infosys Variable Pay: ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వరుస షాకులు ఇస్తున్నాయి. అట్రిషన్ రేటుతో భారీ వేతనాలు ఆఫర్ చేసే సంస్థలు ఇప్పుడు వేరియబుల్ పేను ఆలస్యం చేస్తున్నాయి. మరికొన్ని పర్సంటేజీ తగ్గిస్తున్నాయి. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వేరియబుల్ పేను 70 శాతానికి తగ్గించినట్టు సమాచారం. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం, లాభదాయకత, మార్జిన్లు తగ్గడమే ఇందుకు కారణాలని తెలిసింది.
విప్రో ఈ మధ్యే కొందరు ఉద్యోగుల వేరియబుల్ పేను నిలిపివేసింది. మార్జిన్లపై ఒత్తిడి, టాలెంట్ సరఫరా గొలుసులో సామర్థ్యం లేకపోవడం, టెక్నాలజీలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి రావడమే ఇందుకు కారణాలుగా తెలిపింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ క్వార్టర్లీ వేరియబుల్ పేను కొందరు ఉద్యోగులకు నెల రోజులు ఆలస్యం చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ అదే బాటలో నడిచింది. 2023 ఆర్థిక ఏడాది, తొలి త్రైమాసికంలో వేరియబుల్ పే ఔట్‌ను 70 శాతానికి కుదించింది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు తెలియజేసింది.
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచనాలు అందుకోలేదు. ఖర్చులు ఎక్కువ అవ్వడంతో నికర లాభం కేవలం 3.2 శాతమే పెరిగింది. పూర్తి ఏడాది ఆదాయ వృద్ధిరేటు మాత్రం 14-16 శాతం వరకు ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఎక్కువ గిరాకీ, ఒప్పందాలు ఉన్నాయని వెల్లడించింది.
Also Read: పడిపోయిన ఐటీ స్టాక్స్! ఒడుదొడుకుల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
మార్జిన్ మార్గదర్శకాలను 21-23 శాతంగా ఉంచుకున్నా ఖర్చులు, పోటీ పెరగడంతో మార్జిన్లు తగ్గొచ్చని ఇన్ఫోసిస్ స్పష్టం చేస్తోంది. 2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ నిర్వాహక మార్జిన్లు 20 శాతంగా ఉండటం గమనార్హం. ఉద్యోగుల అధిక ప్రయోజనాల ఖర్చులు, సబ్ కాంట్రాక్టుల ఖర్చులు, ప్రయాణ ఖర్చులన్నీ కలిపి తడిసి మోపెడవుతున్నాయని వెల్లడించింది. అట్రిషన్ రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగుల ఖర్చులు పెరిగి ఐటీ పరిశ్రమ లాభదాయకతను తగ్గిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
కంపెనీ వృద్ధి రేటు మెరుగ్గా ఉందని, నియామకాల్లో ప్రతిభావంతుల కోసం పెట్టుబడులు పెడుతున్నామని, పోటీదారులకు దీటుగా వేతనాలు పెంచుతున్నామని తొలి త్రైమాసికం స్టేట్‌మెంట్లో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. మార్జిన్లపై ఇప్పటికిప్పుడు వీటి ప్రభావం పడ్డా సుదీర్ఘ కాలంలో అట్రిషన్ రేట్ తగ్గుతుందని, భవిష్యత్తులో మెరుగైన స్థితిలో నిలుస్తామని ఆయన వెల్లడించారు. ప్రెషర్స్ రాకతో మార్జిన్లపై 160 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడిందన్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)