Infosys Q3 Results: మార్కెట్‌ను సర్‌ప్రైజ్ చేసిన ఇన్ఫీ! 13% వృద్ధితో రూ.6,586 కోట్ల ఆదాయం నమోదు
Infosys Q3 Results: సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. డిసెంబర్ 2022 త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు విడుదల చేసింది.
Infosys Q3 Results:
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. డిసెంబర్ 2022 త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన డిసెంబర్ నాటికి 20.2 శాతం వృద్ధితో రూ.38,318 కోట్ల రాబడి నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో 13.4 శాతం వృద్ధితో రూ.6,586 కోట్ల రాబడిని ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కాన్‌స్టంట్ కరెన్సీ ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను 15-16 శాతం నుంచి 16-16.5 శాతానికి పెంచింది. ప్రస్తుత రాబడిని చివరి త్రైమాసికంలో విదేశీ కరెన్సీ రేటుతో పోల్చడాన్ని కాన్‌స్టంట్ కరెన్సీగా పేర్కొంటారు. చాలామంది విశ్లేషకులు కంపెనీ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను అందుకుంటుందనే అంచనా వేయడం గమనార్హం. FY23కి 21-22 శాతంతో ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్‌ను కంపెనీ నిలబెట్టుకుంది.
డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ కాన్‌స్టంట్ కరెన్సీ రాబడి వృద్ధి 13.7 శాతంతో పటిష్ఠంగా ఉంది. సీక్వెన్షియల్‌గా 2.4 శాతంగా ఉంది. తాజా త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఇన్ఫోసిస్ 3.3 బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు సొంతం చేసుకోవడం ప్రత్యేకం. చివరి ఎనిమిది క్వార్టర్లలో ఇదే పటిష్ఠం కావడం గమనార్హం.
'ఈ క్వార్టర్లో మా ఆదాయ వృద్ధి బలంగా ఉంది. డిజిటల్ వ్యాపారం, ప్రధాన సేవల్లో వృద్ధి నమోదైంది. భారీ ఒప్పందాలు కుదురుతున్నాయి. మా క్లయింట్లకు నమ్మకమైన భాగస్వామిగా ఎక్కువ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటున్నాం' అని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలిల్ పారేఖ్ అన్నారు. 'మెరుగైన ఖర్చుల నిర్వహణతో మూడో త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ పటిష్ఠంగా ఉంది. అట్రిషన్ రేటూ తగ్గింది. రాబోయే కాలంలో మరింత తగ్గుతుందని మా అంచనా' అని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ మార్జిన్ ఈ ఏడాది 200 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. మొత్తంగా చూసుకుంటే నిలకడగానే ఉంది. చివరి త్రైమాసికంలో 27.1 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు ప్రస్తుతం 24.3 శాతానికి తగ్గింది. డిజిటల్ వ్యాపార ఆదాయం కాన్‌స్టాంట్ కరెన్సీ వృద్ధి ప్రకారం 21.7 శాతంగా ఉంది. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం వాటా 62.9 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఇది 58.5 శాతం కావడం గమనార్హం.
మూడో త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక సేవల వృద్ధి నెమ్మదించింది. వార్షిక ప్రతిపాదికన 2.2 శాతంగా నమోదైంది. ఎనర్జీ, యుటిలిటీస్, తయారీ విభాగాల్లో అమ్మకాల వృద్ధి బలంగా ఉంది. వరుసగా 21 శాతం, 29 శాతం నమోదైంది. చివరి త్రైమాసికంలో ఉత్తర అమెరికా, ఐరోపాలో కంపెనీ మెరుగైన ప్రదర్శనే చేసింది. అమెరికాలో 10 శాతం, ఐరోపాలో 13.6 శాతం వృద్ధి కనబరిచింది. ఇన్ఫోసిస్ మూడో క్వార్టర్లో 50 మిలియన్ డాలర్ల బాస్కెట్‌లో ఇద్దరు క్లయింట్లు, 10 మిలియన్ డాలర్ల బాస్కెట్‌లో 13 మంది క్లయింట్లను సంపాదించింది.
Watch the live media interaction of Infosys’ performance in Q3 FY23 along with Infosys management here. #InfosysQ3FY23 https://t.co/iAtJa2Ku3W
— Infosys (@Infosys) January 12, 2023
#InfosysQ3FY23 FY23 Operating margin guidance remains unchanged at 21%-22%
— Infosys (@Infosys) January 12, 2023