Card Tokenization: డెబిట్, క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ గడువు పొడగించాలని ఆర్‌బీఐకి వినతి
టోకెనైజేషన్ లావాదేవీలు చేపట్టేందుకు నిలకడైన ఏపీఐ ప్రక్రియ అవసరమని ఎంపీఏఐ, ఏడీఐఎఫ్ తెలిపాయి. ఆర్‌బీఐ నిబంధనలు అమలుకు ఇంకా సమయం పడుతుందని, స్టేక్‌హోల్డర్లు అంతా సిద్ధమవ్వాల్సి ఉందని పేర్కొన్నాయి.
టోకెనైజేషన్ తుది గడువును డిసెంబర్ 31 నుంచి మరికొంత కాలం పెంచాలని మర్చంట్ పేమెంట్స్ అలియన్స్ ఆఫ్ ఇండియా (MPAI), అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ADIF) ఆర్‌బీఐని కోరాయి. నిర్వహణ పరమైన సవాళ్లతో టోకెనైజేషన్ పరివర్తన ఆలస్యమవుతుందని పేర్కొన్నాయి. బ్యాంకులు సహా మర్చంట్స్, చెల్లింపుల పరిశ్రమ ఇంకా ఇందుకు సిద్ధంగా లేవని అంటున్నాయి.
టోకెనైజేషన్ లావాదేవీలు చేపట్టేందుకు నిలకడైన ఏపీఐ ప్రక్రియ అవసరమని ఎంపీఏఐ, ఏడీఐఎఫ్ తెలిపాయి. ఆర్‌బీఐ నిబంధనలు అమలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని, స్టేక్‌హోల్డర్లు అంతా సిద్ధమవ్వాల్సి ఉందని పేర్కొన్నాయి. కట్టుదిట్టంగా ఇప్పుడే అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టోకెనైజేషన్ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించాయి.
'బ్యాంకులు ఇంకా సన్నద్ధం కాకపోతే మర్చంట్స్ రాబడి తగ్గిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 20-40 శాతం వరకు ఆదాయం నష్టపోయే అవకాశం ఉంది' అని ఏడీఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిజో కురువిల్లా జార్జ్ అంటున్నారు. 'ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సంసిద్ధం కాకపోవడం డిజిటల్ చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతి లావాదేవీకి కష్టపడాల్సి వస్తుంది. నకిలీ, మోసపూరిత లావాదేవీలు పెరిగే అవకాశం ఉంటుంది' అని ఎంపీఏఐ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ వివాల్ మెహతా అన్నారు.
2020, మార్చిలోనే ఆర్‌బీఐ టోకెనైజేషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై వ్యాపారస్థులు కస్టమర్ల కార్డు వివరాలను తమ వెబ్‌సైట్లు, యాప్స్‌లో భద్రపరచొద్దని వెల్లడించింది. టోకెనైజేషన్‌కు సంబంధించిన నిబంధనలు అమలు చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఇస్తున్నట్టు 2021, సెప్టెంబర్లో ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటి వరకు భద్రపరిచిన సమాచారం 2022, జనవరి 1లోపు తొలగించాలని ఆదేశించింది.
టోకెనైజేషన్ ఇలా పనిచేస్తుంది
మీరు లావాదేవీలు చేపట్టేటప్పుడు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ, ఓటీపీ, పిన్ వివరాలు ఎంటర్ చేస్తుంటారు. అవన్నీ సరిగ్గా ఉంటేనే లావాదేవీ చెల్లుతుంది. ఈ ప్రకియనంతా ఇకపై టోకెనైజేషన్ భర్తీ చేస్తుంది. ఇందుకు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా మీ కార్డుకు సంబంధించిన టోకెన్‌ను నమోదు చేస్తే చాలు.
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు