Ajay Banga: ప్రపంచ బ్యాంక్ చీఫ్ పదవికి ఏకైక నామినేషన్ - అజయ్ బంగాకు లైన్ క్లియర్
అజయ్ బంగాకు పోటీగా ఏ దేశమూ మరో పేరును ప్రతిపాదించలేదు.
Ajay Banga: ఇండియన్-అమెరికన్ బిజినెస్ లీడర్ అజయ్ బంగా, ప్రపంచ బ్యాంక్ (World Bank) తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి లైన్ క్లియర్ అయింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేసే తేదీ 2023 మార్చి 29, బుధవారంతో ముగిసింది. ఈ గడువులోగా అజయ్ బంగా నుంచి మాత్రమే నామినేషన్ వచ్చింది. ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడి కుర్చీ కోసం అజయ్ బంగాకు పోటీగా ఏ దేశమూ మరో పేరును ప్రతిపాదించలేదు. దీంతో, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని నిర్ధరణ అయింది.
సాధారణంగా, ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఏ అభ్యర్థికి అగ్రరాజ్యం అమెరికా మద్దతు ప్రకటిస్తే, ఆ వ్యక్తే ఎన్నికవుతుంటారు. ప్రపంచ బ్యాంకులో అత్యధిక షేర్లు అగ్రరాజ్యానివే. కాబట్టి, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎన్నికలో అమెరికా మాటే చెల్లుబాటు అవుతుంది. ఈసారి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ అజయ్ బంగా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటన విడుదల చేశారు. అప్పుడే అజయ్ బంగాకు లైన్ క్లియర్ అయింది. అయితే.. ఎన్నికకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి కాబట్టి.. నామినేషన్ వేయడం, వాటిని పరిశీలించడం వంటి తూతూమంత్రపు పనులు కొనసాగుతున్నాయి.
ముందే దిగిపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు
ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్ (David Malpass), తన పదవీకాలం ముగియడానికి దాదాపు ఒక సంవత్సరం ముందే, ఈ ఏడాది జూన్‌లో, ఆ కుర్చీ నుంచి దిగిపోతున్నారు. దీంతో, కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు సంబంధించి తదుపరి దశను ప్రపంచ బ్యాంకు ప్రకటిస్తుంది. మే ప్రారంభంలో అజయ్ బంగా పేరును అధికారికంగా ప్రకటిస్తారు.
రాబోయే కొద్ది నెలల్లో ప్రపంచ బ్యాంకులో గణనీయమైన మార్పును మీరు చూస్తారు. 21వ శతాబ్దపు సవాళ్లను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఈ సంస్థను అభివృద్ధి చేస్తూనే, ప్రపంచ పురోగతిని వేగవంతం చేసే బాధ్యత అజయ్ బంగాపై ఉంటుంది. పేదరిక నిర్మూలన, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రపంచ బ్యాంకుకు ఇది సహాయపడుతుంది అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ చెప్పారు.
అజయ్ బంగా వయస్సు 63 సంవత్సరాలు. ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్‌గా ప్రస్తుతం ఆయన పని చేస్తున్నారు.
గ్లోబల్ ఆర్గనైజేషన్‌కు నాయకత్వం వహించడానికి అజయ్ బంగా అత్యంత అనుకూలమైన వ్యక్తి అని జో బిడెన్ చెప్పారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్ బంగా అభ్యర్థిత్వానికి భారత్ మద్దతు తెలిపింది.
ఆ సీట్‌లో కూర్చునే తొలి భారతీయ-అమెరికన్
అజయ్ బంగా పేరును అధికారికంగా ఆమోదించే ప్రక్రియ పూర్తయితే... ప్రపంచ బ్యాంకుకు అధిపతిగా ఉన్న తొలి భారతీయ-అమెరికన్, తొలి అమెరికన్ సిక్కు ఆయనే అవుతారు.
అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. దిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, అహ్మదాబాద్ ఐఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో అజయ్ బంగా చేసిన సేవలకు గాను, 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.