Income Tax Return: మరికొన్ని రోజుల్లో ITR ఫైలింగ్ తుది గడువు - ఎవరు, ఏ సెక్షన్ కింద దాఖలు చేయాలో తెలుసుకోండి
ఆదాయపు పన్ను రిటర్న్‌ను సాధారణ గడువులోగా దాఖలు చేయలేకపోతే, ఆలస్య రుసుముతో కలిపి ఆ తర్వాతి గడువు తేదీలోగా ఫైల్ చేయవచ్చు.
Income Tax Return: 2022 డిసెంబర్ 31వ తేదీ చాలా పనులను పూర్తి చేయడానికి ముగింపు తేదీగా ఉంది. ఆధార్, పాన్ కార్డ్ సంబంధిత పనులు, కొన్ని బ్యాంక్ ఆఫర్లు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు వంటి వాటికి ఈ సంవత్సరం చివరి తేదీనే ఆఖరి గడువు. వీటిలో... 2021-22 ఆర్థిక సంవత్సరం (FY 2021-22) లేదా 2022-23 మదింపు సంవత్సరానికి (AY 2022-23) సంబంధించి, జరిమానాతో కలిపి మీ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన తుది గడువు (Last Date for ITR Filing) కూడా 2022 డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తుంది. అదే విధంగా, రివైజ్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (Revised Income Tax Return) దాఖలు చేయడానికి కూడా 2022 డిసెంబర్ 31ని చివరి తేదీగా ఖరారు చేశారు. 2023 జనవరి 1 లేదా ఆ తర్వాత వీటిని సమర్పించినా ఆదాయ పన్ను చట్టం ప్రకారం ప్రయోజనాలు పొందలేరు.
ఆదాయపు పన్ను చట్టం నిబంధన ప్రకారం, ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్న్‌ను సాధారణ గడువులోగా దాఖలు చేయలేకపోతే, ఆలస్య రుసుముతో కలిపి ఆ తర్వాతి గడువు తేదీలోగా ఫైల్ చేయవచ్చు. 2022 జులై 31వ తేదీని సాధారణ గడువుగా ఆదాయ పన్ను విభాగం గతంలో నిర్ణయించింది. ఆ తేదీలోగా, 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను పత్రాలు సమర్పించిన వాళ్లకు ఎలాంటి జరిమానా విధించలేదు. ఆ తేదీ తర్వాతి నుంచి ITR ఫైల్ చేసేవాళ్లు జరిమానాతో (ఏడాది ఆదాయాన్ని బట్టి రూ. 1000 లేదా రూ. 5000) కలిపి ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీ 2022 డిసెంబర్ 31.
అదే విధంగా, ఎవరైనా ITR ఫైల్ చేసినప్పుడు ఏదైనా తప్పు దొర్లితే, సవరించిన ITR (Revised Income Tax Return) ఫైల్ చేయడం ద్వారా ఆ తప్పును సరిదిద్దుకోవచ్చు. దీనికి కూడా చివరి తేదీ 2022 డిసెంబర్ 31. ఇది కూడా 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరానికి సంబంధించింది.
సెక్షన్ 139(4) ప్రకారం...
ఆదాయపు పన్ను చట్టం- 1961లోని సెక్షన్ 139(4) ప్రకారం ఆలస్య రుసుముతో కలిపి ITR దాఖలు చేయవచ్చు. దాఖలు చేసే ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, ఇలాంటి సందర్భంలో కొన్ని విషయాలను మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. పన్ను రిటర్న్‌లో ఫామ్‌ను ఎంచుకోవడం దగ్గర నుంచి, పెనాల్టీ మొత్తం, వడ్డీ రేటు, బాకీ ఉన్న పన్ను గురించి పూర్తిగా అర్ధం చేసుకోవాలి.
సెక్షన్ 139(5) ప్రకారం...
ఆదాయపు పన్ను చట్టం- 1961లోని సెక్షన్ 139(5) కింద రివైజ్డ్ ITRను దాఖలు చేయవచ్చు. ఇక్కడ కూడా ఫైల్ చేసే ప్రక్రియ అసలైన ప్రక్రియ లాగే ఉంటుంది. కాకపోతే, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు రివైజ్డ్ ITRను ఫైల్ చేస్తున్నప్పుడు, అతను సెక్షన్ 139(5)ని ఎంచుకున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ITR నంబర్‌ను కూడా భద్రపరుచుకోవాలి.