Forex: పడిపోయిన ఫారెక్స్ నిల్వలు, ఈసారి 2.16 బిలియన్ డాలర్లు తగ్గుదల
ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ మారక నిల్వలు 8 బిలియన్ డాలర్లు పెరిగాయి.
Iindia's Forex Reserves: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు మళ్లీ తగ్గాయి. ఈ నెల ప్రారంభంలో తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుని మురిపించిన ఫారెక్స్ రిజర్వ్స్, తాజాగా ఆ కొండ దిగి వచ్చాయి.
ఆర్‌బీఐ (Reserve Bank Of India) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 ఏప్రిల్ 21వ తేదీతో ముగిసిన వారంలో, భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు (Forex Reserves) 2.16 బిలియన్ డాలర్లు క్షీణించాయి, 584.25 బిలియన్లకు తగ్గాయి. ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ మారక నిల్వలు 8 బిలియన్ డాలర్లు పెరిగాయి.
ఈ నెల ప్రారంభంలో తొమ్మిది నెలల గరిష్ట స్థాయి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం, రెండు వారాల క్రితం, విదేశీ మారక నిల్వలు 586.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, ఇది తొమ్మిది నెలల గరిష్ట స్థాయి. అయితే, అక్కడి నుంచి ఫండ్ క్షీణించింది, 584.25 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
సమీక్షలో ఉన్న వారంలో, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) 2.14 బిలియన్ డాలర్లు తగ్గి 514.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు అంటే.. విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. డాలర్ రూపంలో ఈ విలువను చెబుతారు.
2023 ఏప్రిల్ 21వ తేదీతో ముగిసిన వారంలో, భారత్‌లో బంగారం నిల్వలు (Gold reserves) 2.4 మిలియన్ డాలర్లు తగ్గి 46.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్ టైమ్ హై రికార్డ్. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఈ కారణంగా, విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఉత్పన్నమయిన ప్రపంచ ఉద్రిక్తతలు కూడా మన దేశ ఫారెక్స్ రిజర్వ్స్‌పై ప్రభావం చూపాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు కొనుగోళ్ల కోసం డాలర్ల రూపంలో ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది.
ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల కారణంగా డాలర్‌తో రూపాయి మారకంలో భారీ బలహీనత నెలకొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10 శాతం పడిపోయింది. రూపాయి విలువ పతనాన్ని ఆపడానికి ఆర్‌బీఐ డాలర్లను విక్రయించాల్సి వచ్చింది. రూపాయి క్షీణతకు అడ్డుకట్ట పడినా డాలర్లు సహా ఇతర విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గాయి.
డాలర్‌తో రూపాయి విలువ
శుక్రవారం నాడు (28 ఏప్రిల్ 2023), డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.83 వద్ద ముగిసింది. వారం క్రితం రూపాయి 82.10 స్థాయిలో ఉంది.
ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.