Rented House: ఇంటర్‌లో మార్కులు తగ్గాయని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు, ఇదేం చోద్యం?
12వ తరగతిలో 90% మార్కులు ఉంటేనే మీకు బెంగళూరులో ఇల్లు దొరుకుతుందని పేర్కొన్నారు.
Rented House in Bengaluru: డిగ్రీ చదవడానికి లేదా ఉద్యోగంలో చేరడానికి 12వ తరగతిలో వచ్చిన మార్కుల గురించి అడుగుతారు. కానీ, ఇల్లు అద్దెకు కావాలన్నా ఇంటర్‌లో వచ్చిన మార్కుల గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదికూడా, 90% కంటే మార్కులు తగ్గితే ఇల్లు లేదు పొమ్మంటున్నారు. విచిత్రంగా ఉన్న సంఘటన మన దేశంలోని ఒక మెట్రో నగరంలో జరిగింది. కాబట్టి, మీరు కూడా అద్దె ఇంటి వేటలో ఉంటే, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ షీట్‌ను వెంట తీసుకెళ్లండి, అందులో 90 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
యోగేష్ అనే తన బంధువు బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెళ్లాడని, 12వ తరగతిలో 90 శాతం మార్కులు రాకపోవడంతో ఇల్లు ఇవ్వలేదని ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు, ఇది వైరల్‌గా మారింది. అద్దెదారు & బ్రోకర్ మధ్య జరిగిన వాట్సాప్ (WhatsApp) చాట్ స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేసారు. శుభ్ అనే యాజర్ దీనిని షేర్ చేశారు.
"Marks don't decide your future, but it definitely decides whether you get a flat in banglore or not" pic.twitter.com/L0a9Sjms6d
— Shubh (@kadaipaneeeer) April 27, 2023
మీ భవిష్యత్తును మార్కులు నిర్ణయించలేవు, కానీ మీరు అద్దె ఇంటిని పొందగలరో, లేదో అవి ఖచ్చితంగా నిర్ణయిస్తాయంటూ శుభ్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 12వ తరగతిలో 90% మార్కులు ఉంటేనే మీకు బెంగళూరులో ఇల్లు దొరుకుతుందని పేర్కొన్నారు. లేని పక్షంలో ఇల్లు లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకోలేరంటూ బాధపడ్డాడు. 12వ తరగతిలో కనీసం 90% మార్కులు రానందుకు ఇంటి యజమాని ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నిరాకరించడాన్ని తాను నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశాడు. ఇది అరుదైన విచిత్ర సంఘటన అయినా, బెంగళూరులో అద్దె ఇంటి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
అద్దె ఇంటి కోసం ఎన్ని పత్రాలు అడిగారో తెలుసా?
ఇంతకీ సదరు యోగేష్‌కు ఇంటర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..?, అతనికి 76% మార్కులు వచ్చాయి. శుభ్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో, యోగేష్ ప్రొఫైల్‌ను ఇంటి యజమాని ఆమోదించినట్లు బ్రోకర్ యోగేష్‌కి చెప్పాడు. ఆ తరువాత, అతని నుంచి లింక్డ్‌ఇన్, ట్విట్టర్ ఖాతా వివరాలు, పాన్, ఆధార్ కార్డులతో పాటు 10వ తరగతి, 12 తరగతుల మార్క్‌షీట్‌లను కూడా అడిగాడు. అంతేకాదు, తన గురించి తాను 150 నుంచి 200 పదాల్లో రాసి, దానిని షేర్ చేయమని కోరాడు.
అద్దె ఇంటి కోసం యోగేష్ అన్ని టెస్ట్‌లు పాసయినా, 12వ తరగతిలో మార్కులు తక్కువ రావడంతో ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు యజమాని నిరాకరించాడు. ఈ ట్వీట్‌కి 1.4 మిలియన్ల వీక్షణలు మరియు 15 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. యూజర్లు ఈ పోస్ట్‌పై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు నిజమంటారు, మరికొందరు ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఐటీలో పని చేయకుంటే తక్కువ ధరకే ఒక గది లభిస్తుందని, ఐటీ కంపెనీలో పని చేస్తే మాత్రం ఒక్క గది అద్దె 30 వేలు ఉంటుందని యూజర్లు తెలిపారు.
అద్దె గది కోసం త్వరలోనే ఎంట్రన్స్ టెస్ట్ పెడతారని ఒకరు కామెంట్ చేస్తే, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగే రోజు ఎంతో దూరంలో లేదని మరికొందరు యూజర్లు కామెంట్ రాశారు.