ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ 'స్మార్ట్ లాక్ ఫీచర్' - కస్టమర్ల చేతుల్లో సూపర్ పవర్!
SmartLock Feature: కొత్త ఫీచర్ సాయంతో, కస్టమర్‌లు తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి సర్వీసులను ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా లాక్ చేయొచ్చు లేదా అన్‌లాక్ చేయొచ్చు.
ICICI Bank SmartLock Feature: దురదష్టవశాత్తు మన మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా హార్ట్ ఎటాక్ వచ్చినంత పనౌతుంది. ఆ ఫోన్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకింగ్ సమాచారం కూడా ఉంటుంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి ఆ సమాచారం వెళితే ఆర్థిక నష్టంతో పాటు మానసిక వేదననూ అనుభవించాల్సి వస్తుంది. తన కస్టమర్లకు ఇలాంటి దయనీయ స్థితి రాకుండా, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఒక పరిష్కారం చూపింది. తన కస్టమర్ల చేతులకే సూపర్ పవర్ అందించింది. దీనివల్ల, మొబైల్ ఫోన్ పోయినప్పటికీ కస్టమర్ల బ్యాంకింగ్ సమాచారం సురక్షితంగా ఉంటుంది.
బ్యాంక్ లావాదేవీల లాక్ & అన్‌లాక్
తన కస్టమర్ల కోసం 'స్మార్ట్‌లాక్ ఫీచర్'ను ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank SmartLock Feature) ప్రారంభించింది. దీని సాయంతో, అవసరమైనప్పుడు బ్యాంకింగ్ సమాచారాన్ని లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు. దీని కోసం బ్యాంకు హెల్ప్‌లైన్‌ను కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఈ స్మార్ట్ లాక్ ఫీచర్‌ను ఐమొబైల్ పే (iMobile Pay) యాప్‌లో అందుబాటులో ఉంచింది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఈ యాప్‌ను ఓపెన్ చేసి.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి బ్యాంకింగ్ సేవలను సులభంగా లాక్ చేయవచ్చు. ఆ సర్వీసులు అవసరం అయినప్పుడు తిరిగి అన్‌లాక్ చేసి ఉపయోగించుకోవచ్చు.
ఇంట్లో కూర్చొని స్మార్ట్‌లాక్ ప్రయోజనాలు పొందొచ్చు
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదార్లకు స్మార్ట్ లాక్ ఆప్షన్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కస్టమర్ తన ఇంట్లో కూర్చునే, iMobile Pay యాప్ ద్వారా ICICI బ్యాంక్ నుంచి చాలా సేవలు పొందొచ్చు. ఇప్పటి వరకు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పోయినా లేదా ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినా బ్యాంకు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. కస్టమర్ ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ఆ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా లావాదేవీలను బ్యాంక్ నిలిపేస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది. బ్యాంక్ కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ లాక్ సాయంతో ఆ పని కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది. అవసరమైతే ఐమొబైల్ పే యాప్‌ను కూడా పని చేయకుండా నిలిపేయవచ్చు.
'ఐమొబైల్ పే'లో స్మార్ట్ లాక్‌ను ఎలా ఉపయోగించాలి?
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ అయితే, మీ ఫోన్‌లోకి ఐసీఐసీఐ బ్యాంక్ iMobile Pay యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిలోకి లాగిన్ అయిన తర్వాత, మీరు స్మార్ట్ లాక్ ఫీచర్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయాలి. ఇది, హోమ్ స్క్రీన్ దిగువన మీకు కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత, స్మార్ట్ లాక్ ఫీచర్‌కు సంబంధించిన సేవలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా బ్యాంకింగ్ సర్వీస్‌ను నిలిపేయవచ్చు లేదా పునఃప్రారంభించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: పెళ్లైన మహిళలకు నో ఎంట్రీ! ఆపిల్ ఐఫోన్ తయారీదారు Foxconn నిర్వాకం