HMDA Plots E-Auction: తొర్రూర్, బహదూర్ పల్లిలో హెచ్ఎండీఏ ప్లాట్ల ఈ-వేలం, గజం ధర ఎంతంటే?
హెచ్ఎండీఏ పరిధిలోని రెండు వెంచర్లలో ప్లాట్ల అమ్మకానికి రెడీ అయ్యాయి. తొర్రూర్, బహదూర్ పల్లిలో మొత్తం 324 ప్లాట్ల ఈ-వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తొర్రూర్, బహదూర్ పల్లిలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల(Plots)ను మరోసారి హెచ్ఎండీఏ వేలం వేయనుంది. హెచ్ఎండీఎ(HMDA) పరిధిలోని లే అవుట్లలోని 324 ప్లాట్లకు వేలం వేసేందుకు కార్యాచరణ పూర్తి చేసింది. బహదూర్ పల్లి(Bahadurpalli)లో 101 ప్లాట్లు, తొర్రూర్(Torroor) లో 223 ప్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మార్చి మూడో వారంలో ఈ-వేలం(E-Auction) ద్వారా ప్లాట్లను విక్రయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేడ్చల్ జిల్లాలోని బహదూర్ పల్లి, రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ లోని ప్లాట్లను ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వేలం ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ సన్నాహాలు చేసింది. మల్టీ పర్పస్ జోన్ కింద ఈ లేఅవుట్లను హెచ్ఎండీఏ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. వచ్చే నెల 14, 15 తేదీల్లో బహదూర్‌పల్లిలోని 101 ప్లాట్లు, తొర్రూర్‌లోని 223 ప్లాట్లను వచ్చే నెల 14 నుంచి 17 వరకు ఈ-వేలం వేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కోకాపేట్(Kokapeta), ఖానామెట్, ఉప్పల్ భగాయత్ భూములను హెచ్ఎండీఏ విజయవంతంగా విక్రయించింది.
రేపటి నుంచి ప్రీబిడ్
బహదూర్ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్(Layout) లో 101 పాట్లు ఈ-వేలం వేసేందుకు ఫిబ్రవరి 23న ప్రీబిడ్ మీటింగ్ జరగనుంది. బహదూర్ పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ మీటింగ్ ఉంటుంది. అలాగే తొర్రూర్ లోని 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ లేఅవుట్ ను అభివృద్ధి చేసి, అందులోని 223 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. దీనికి సంబంధించి ప్రీబిడ్ మీటింగ్ ఈనెల 25వ తేదీన తోర్రూర్ సైట్ లోనే నిర్వహించనున్నారు. బహదూర్‌పల్లిలో గజానికి రూ.25 వేలు, తొర్రూర్‌లో గజానికి రూ.20 వేలు కనీస ధరను హెచ్ఎండీఏ నిర్ణయించింది. బహదూర్ పల్లిలో 600 గజాల వరకు ఒక్కో ప్లాటుకు రూ.3 లక్షలు, 600 గజాలు దాటితే రూ.5 లక్షలు, తొర్రూరులో ఒక్కో ప్లాట్‌కు రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
కోట్లు పలికిన కోకాపేట భూములు
కోకాపేట, ఉప్పల్ భగాయత్ వెంచర్లలో ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ భూములకు రూ.వేల కోట్లు పలికాయి. తాజాగా మరో రెండు వెంచర్లలో ప్లాట్ల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వెంచర్ల(Venture) ప్లాట్ల విక్రయం ద్వారా కూడా కోట్లాది రూపాయలు సమకూర్చుకునే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: Mutual Funds: ప్రతిరోజూ రూ.100 SIP - సరికొత్త మ్యూచువల్ ఫండ్ పథకం