Sanchar Saathi: పోయిన ఫోన్‌ను కనిపెట్టే సంచార్ సాథి పోర్టల్‌ను ఉపయోగించడం ఎలా?
వేరొక సిమ్ వేసి ఉపయోగిస్తుంటే దొంగిలించిన మొబైల్ ఎక్కడుందన్న విషయాన్ని లొకేషన్ ఆధారంగా మొబైల్ ఆపరేటర్ సులభంగా పట్టేస్తుంది.
Sanchar Saathi Portal: సాధారణంగా, ఎవరి స్మార్ట్ ఫోన్ దొంగతనానికి గురైనా, పోగొట్టుకున్నా వెతకడం అనవసరం అని వదిలేస్తారు. లేదా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ విషయాన్ని మర్చిపోతారు. ఎందుకంటే, ఇక ఆ ఫోన్ దొరకదని గట్టిగా నమ్ముతారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దొంగతనానికి గురైన లేదా పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఇకపై సులభంగా కనిపెట్టవచ్చు. మొదట కొన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా పరిశీలించిన AI ఆధారిత టెక్నాలజీని ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.
దొంగిలించిన మొబైల్‌ను ఉపయోగించడం ఇకపై సులభం కాదు
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న సంచార్ సాథి పోర్టల్‌ను (Sanchar Saathi Portal) ప్రారంభించింది, 17వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ గురించి ఈ పోర్టల్ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ మొబైల్ ఫోన్‌ను సులభంగా, చట్టబద్ధంగా బ్లాక్ చేయవచ్చు & అన్‌బ్లాక్ చేయవచ్చు. దీంతో పాటు, ఆ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. సంచార్ సాథి పోర్టల్‌లో సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, ఆ సమాచారం మొబైల్ ఆపరేటర్ దగ్గరకు వెళ్తుంది. అదే మొబైల్‌లో వేరొక సిమ్ వేసి ఉపయోగిస్తుంటే దొంగిలించిన మొబైల్ ఎక్కడుందన్న విషయాన్ని లొకేషన్ ఆధారంగా మొబైల్ ఆపరేటర్ సులభంగా పట్టేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా, ఒక ఐడీపై ఎన్ని సిమ్ కార్డ్‌లు జారీ చేశారో కూడా మీకు తెలుస్తుంది. దీనివల్ల, మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా సిమ్ తీసుకుంటే ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు, తొలగించవచ్చు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడం ఎలా?
ముందుగా https://sancharsaathi.gov.in/ సైట్‌లోకి వెళ్లండి
హోమ్ పేజీలో కనిపించే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి.
ఇక్కడ, బ్లాక్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత, మొబైల్ సమాచారాన్ని నమోదు చేయవలసిన పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది.
మీరు రెండు మొబైల్ నంబర్‌లను, 15 అంకెల IMEI నంబర్‌లను నమోదు చేయాలి.
దీంతో పాటు, మీ ఫోన్ మోడల్, కొన్నప్పుడు తీసుకున్న ఇన్‌వాయిస్‌ను కూడా అప్‌లోడ్ చేయాలి.
మొబైల్ పోగొట్టుకున్న తేదీ, సమయం, జిల్లా, రాష్ట్ర సమాచారాన్ని కూడా పూరించాలి.
మీరు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాలి. ఆ FIR నంబర్, పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతం, జిల్లా, రాష్ట్రం పేరును పోర్టల్‌లో నమోదు చేయాలి.
FIR కాపీని ఈ పేజీలో అప్‌లోడ్ చేయాలి.
ఇప్పుడు.. మీ పేరు, చిరునామా, ఈ-మెయిల్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
చివరగా, డిస్‌క్లైమర్‌కు టిక్ పెట్టి, ఫారాన్ని సబ్మిట్ చేయండి.
ఈ ఫారాన్ని సమర్పించిన తర్వాత మీ ఫోన్ ఎక్కడున్నా బ్లాక్ అవుతుంది.
స్మార్ట్ ఫోన్ ఒరిజినలా, డూప్లికేటా?
ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫోన్లకు డిటోగా ఉండే క్లోన్ ఫోన్లు మార్కెట్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. ఒరిజినల్ ఫోన్‌గా చెప్పి, వాటిని అమాయక జనానికి అంటగడుతున్నారు. అలాంటి ఫోన్ నిజమైనదో, కాదో తెలుసుకోవడానికి సంచార్ సాథి పోర్టల్ ఉపయోగపడుతుంది. ఆ ఫోన్ ఐఎంఈఐ (IMEI) నంబర్‌ను పోర్టల్‌లో ఎంటర్ చేస్తే, ఆ పరికరం ఒరిజినలా, నకిలీనా అన్నది సులభంగా తెలిసిపోతుంది.