₹75 Coin: ప్రధాని లాంచ్ చేసిన ₹75 నాణేలను ఎలా కొనాలి?
భారతదేశ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం + 75వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా ₹75 నాణేన్ని ఆవిష్కరించారు.
75 Rupees Coin Buy Online: భారతదేశ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా, మే నెల 28వ తేదీన, ప్రధాని నరేంద్ర మోదీ 75 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. మన దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భానికి గుర్తుగా కూడా ఈ నాణేన్ని రూపొందించారు.
75 రూపాయల స్మారక నాణేన్ని తీసుకొచ్చేందుకు మే 25వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని మింట్‌లో తయారు చేస్తారు. ఇలాంటి నాణేలు విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం, ఆయన జ్ఞాపకార్ధం 1964లో మొదటిసారి స్మారక నాణన్ని విడుదల చేశారు. అప్పటి నుంచి నుంచి ఇప్పటి వరకు.. వివిధ చారిత్రక సంఘటనలు, స్మారక చిహ్నాలు, సందర్భాలకు గుర్తుగా 150కి పైగా ప్రత్యేక నాణేలను ముద్రించి, విడుదల చేశారు. తాజాగా, భారతదేశ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం + 75వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా ₹75 నాణేన్ని ఆవిష్కరించారు.
75 రూపాయల నాణెం ప్రత్యేకత
ఈ నాణెం వృత్తాకారంలో 44 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉంటుంది. దీని బరువు 35 గ్రాములు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో కలిపి ఈ కాయిన్ తయారు చేశారు. నాణేనికి ఒక వైపు అశోక స్థూపం గుర్తు ఉంది, దాని క్రింద 'సత్యమేవ జయతే' అన్న అక్షరాలు ముద్రించారు. అశోక స్థూపానికి ఎడమ వైపున దేవనాగరి లిపిలో 'భారత్' అనే పదం, కుడి వైపున ఆంగ్లంలో 'ఇండియా' అని ముద్రించారు. అశోక స్థూపం చిహ్నం కింది వైపున '₹75' అని ముద్రించారు.
నాణేనికి మరోవైపున కొత్త పార్లమెంటు భవనం బొమ్మ ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో 'సాన్సి సంకుల్' అని, దిగువ అంచున ఆంగ్లంలో 'పార్లమెంట్ కాంప్లెక్స్' అని రాసి ఉంది. పార్లమెంటు భవనం బొమ్మ దిగువన 2023 అన్న అంకె కనిపిస్తుంది.
75 రూపాయల నాణెం ధర
75 రూపాయల నాణెం విలువ కేవలం రూ. 75 మాత్రమే కాదు, అంతకు చాలా ఎక్కువ రెట్ల విలువ ఉంటుంది. ఎందుకంటే, విలువైన లోహాలను ఉపయోగించి దీనిని రూపొందించారు. ఒక్క నాణెంలో వాడిన లోహాల ఖరీదే రూ. 1300 తక్కువ కాకుండా ఉంటుదని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం, ‘మన్‌కీ బాత్’ వందో ఎపిసోడ్ గుర్తుగా రూ. 100 స్మారక నాణేన్ని లాంచ్ చేశారు, దాని ధరను రూ. 3,494గా నిర్ణయించారు. ఈ ₹100 నాణెం, ప్రస్తుతం విడుదల చేసిన ₹75 నాణెంలో దాదాపు ఒకే నిష్పత్తిలో, ఒకే లోహాలను వినియోగించారు. కాబట్టి, 75 రూపాయల స్మారక నాణం ధర రూ. 3,500కు తక్కువ కాకుండా ఉండొచ్చని అంచనా.
నాణేల చట్టం 2011 ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి వివిధ విలువల్లో నాణేలను అచ్చు వేసి, విడుదల చేసే హక్కు ఉంది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాల్లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రాల్లో (మింట్) వీటిని అచ్చు పోస్తారు.
75 రూపాయల నాణెంతో లావాదేవీలు చేయవచ్చా?
ముందే చెప్పుకున్నట్లు ఇది ఒక స్మారక నాణెం. నగదు లావాదేవీల్లో ఇది చెల్లుబాటు కాదు. నాణేల సేకరణ మీద ఆసక్తితో 75 రూపాయల నాణేన్ని కొని దాచుకోవాలే తప్ప, వినియోగానికి ఉపయోగపడదు. అయితే, సుదీర్ఘ భవిష్యత్‌లో వీటికి చాలా విలువ ఉండవచ్చు.
రూ.75 నాణెం ఎలా కొనాలి?
రూ.75 స్మారక నాణేలను ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్ Indiagovmint.in ద్వారా కొనవచ్చు. ఏ స్మారక నాణేన్ని అయినా ఈ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇంకా, కోల్‌కతా మింట్, ముంబై మింట్, హైదరాబాద్ మింట్ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసుకోవచ్చు. మీరు డబ్బు చెల్లించేముందు, అవి అధికారిక సైటా, నకిలీ సైటా అన్నది మాత్రం క్రాస్ చెక్ చేసుకోండి.