Luxury Homes: విలాసవంతమైన ఇళ్ల విక్రయాల్లోనూ 'భాగ్య'నగరమే - CBRE నివేదికలో ఆసక్తికర విషయాలు
Cbre Report: రూ.4 కోట్లు అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి - మార్చిలో టాప్ 7 నగరాల్లో 10 శాతం పెరిగాయి. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE నివేదికలో వెల్లడించింది.
Cbre Report On Demand Of Luxury Homes In Top 7 Cities: టాప్ 7 ప్రధాన నగరాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE తన తాజా నివేదికలో వెల్లడించింది. జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైగా ధర కలిగిన ఇళ్ల విక్రయాలు ప్రధాన నగరాల్లో 10 శాతం పెరిగాయని తెలిపింది. CBRE నివేదిక ప్రకారం 7 ప్రధాన నగరాల్లో జనవరి - మార్చి మధ్య కాలంలో ఒక్కొక్కటి రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖరీదైన విలాసవంతమైన హౌసింగ్ యూనిట్ల విక్రయాలు 10 శాతం పెరిగాయి. భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల విక్రయాలు 380 నుంచి 800 యూనిట్లకు పెరిగినట్లు వెల్లడైంది. ఈ మేరకు CBRE తన సౌత్ ఏషియా నివేదిక 'ఇండియా మార్కెట్ మానిటర్ Q1 2024'ను రిలీజ్ చేసింది. మొత్తం గృహాల విక్రయాల్లో రూ.4 కోట్లు అంతకంటే ఎక్కువ ధరలతో విలాసవంతమైన గృహాల శాతం వాటా ఈ ఏడాది జనవరి - మార్చిలో దాదాపు 5 శాతంగా ఉన్నట్లు నివేదికలో వివరించింది. ప్రధాన మెట్రో నగరాల్లోని ఇళ్ల విక్రయాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.
ఈ ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో టాప్ 7 ప్రధాన నగరాల్లో ఈ ధరల విభాగంలో మొత్తం విలాసవంతమైన ఇళ్ల విక్రయాలు 3,780 యూనిట్ల నుంచి 4,140 యూనిట్లుగా ఉన్నాయి. 'భారతీయ లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైన విస్తరణకు బలమైన ప్రాథమికాలను ప్రదర్శిస్తుంది. గృహ ఆదాయం, వినియోగదారులు ఖర్చు పెట్టే శక్తిలో స్థిరమైన పెరుగుదల ద్వారా ఇది ఆధారపడి ఉంటుంది.' అని CBRE ఇండియా, సౌత్ - ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా ఛైర్మన్ & CEO అన్షుమాన్ మ్యాగజైన్ చెప్పారు. 2024 తొలి త్రైమాసికంలో బెంగుళూరు అత్యధిక అద్దె దిగుబడి 4.45 శాతం, ముంబై తదుపరి అని ఈ నివేదిక పేర్కొంది. 'పాజిటివ్ సేల్స్ ట్రెండ్ ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా డెవలపర్లు తమ కార్యకలాపాలు వేగవంతం చేస్తున్నారు. ఈ విభాగంలో కొత్త యూనిట్లను ప్రారంభించాలని భావిస్తున్నారు.' అని నివేదికలో పేర్కొంది.
మిగిలిన నగరాల్లో ఇలా
రూ,4 కోట్లు అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే హౌసింగ్ యూనిట్ల విక్రయాల డేటా ప్రకారం.. భాగ్యనగరంలో అమ్మకాలు 380 యూనిట్ల నుంచి 800 యూనిట్లకు పెరగ్గా.. ఢిల్లీ - ఎన్ సీఆర్ విక్రయాలు 1,880 యూనిట్ల నుంచి 1,150 యూనిట్లకు క్షీణించాయి. ఇక బెంగుళూరులో విక్రయాలు 70 యూనిట్ల నుంచి 10 యూనిట్లకు.. కోల్ కతాలో కూడా 110 యూనిట్ల నుంచి 70 యూనిట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో ముంబైలో అమ్మకాలు 1,150 యూనిట్ల నుంచి 1,330 యూనిట్లకు పెరిగాయి. పూణేలో అమ్మకాలు 150 యూనిట్ల నుంచి 700 యూనిట్లకు పెరిగాయి. చెన్నైలో హౌసింగ్ యూనిట్ల విక్రయాలు (ఒక్కొక్కటి రూ.4 కోట్లు అంతకంటే ఎక్కువ) ఈ ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో 60 యూనిట్లకు తగ్గాయి.
Also Read: Godrej Group Split: 127 ఏళ్ల తరవాత విడిపోయిన గోద్రేజ్ గ్రూప్, కీలక ప్రకటన చేసిన సంస్థ