HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలెర్ట్, ఇకపై అలాంటి SMSలు బంద్
HDFC Bank SMS Alerts: బ్యాంక్ ఖాతాల్లో ఇ-మెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కూడా కస్టమర్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విజ్ఞప్తి చేసింది.
HDFC Bank UPI Transactions SMS Alert: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇప్పటి వరకు తన కస్టమర్లకు అందిస్తున్న ఒక కీలక సౌకర్యాన్ని నిలిపేయాలని నిర్ణయించింది. ఇది, వచ్చే నెల 25 (2024 జూన్ 25వ తేదీ) నుంచి అమల్లోకి వస్తుంది.
రూ. 100 లోపు యూపీఐ లావాదేవీలు - రూ. 500 లోపు క్రెడిట్లకు వర్తింపు
UPI (Unifide Payments Interface) ద్వారా 100 రూపాయల లోపు ఖర్చు చేసినా, లేదా, 500 రూపాయల లోపు నగదును అందుకున్నా ఖాతాదార్ల మొబైల్ నంబర్లకు ఆ సందేశాలు (SMS Alert) రావని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం.. యూపీఐ ద్వారా ఎవరికైనా రూ. 100 కంటే ఎక్కువ పంపినప్పుడు లేదా QR కోడ్ స్కాన్ చేసి చెల్లించిప్పుడు; ఎవరి నుంచైనా రూ. 500 మించి రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫోన్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది.
బ్యాంక్ ఖాతాల్లో ఇ-మెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కూడా కస్టమర్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విజ్ఞప్తి చేసింది. దీనివల్ల, ఎలాంటి పరిమితి లేకుండా అన్ని రకాల లావాదేవీలకు కస్టమర్లు ఇ-మెయిల్ ద్వారా అలెర్ట్స్ స్వీకరిస్తారని చెప్పింది. బ్యాంక్ వెల్లడించిన ప్రకారం, చిన్న లావాదేవీలపై ఖాతాదార్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
చిన్న లావాదేవీల కోసం ఎక్కువగా UPI వినియోగం
UPI సగటు టిక్కెట్ పరిమాణం గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. అంటే, ప్రజలు చాలా చిన్న మొత్తాలకు కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. 2022 - 2023 సంవత్సరాల మధ్య, UPI సగటు టిక్కెట్ పరిమాణం 8 శాతం తగ్గింది. వరల్డ్‌లైన్ ఇండియా నివేదిక ప్రకారం, ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) మన దేశంలో మూడు ప్రముఖ UPI యాప్‌లు. చెల్లింపుల కోసం ప్రజలు వీటినే అధికంగా క్లిక్ చేస్తున్నారు. NPCI (National Payments Corporation Of India) డేటా ప్రకారం, 2023 సంవత్సరంలో, UPI ద్వారా చేసిన లావాదేవీలు 100 బిలియన్ల మైలురాయిని దాటాయి.
రెండు డిజిటల్ క్రెడిట్ కార్డులు లాంచ్ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
పిక్సెల్ ప్లే (HDFC Bank Pixel Play Credit Card), పిక్సెల్ గో (HDFC Bank Pixel Go Credit Card) పేరిట రెండు డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విడుదల చేసింది. ఈ డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లను బ్యాంక్ పేజాప్ (PayZapp) యాప్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. నెలకు రూ. 25,000 కంటే ఎక్కువ జీతం కలిగిలిన వ్యక్తులు, ఏడాదికి రూ. 6 లక్షలకు తగ్గని ఆదాయంతో ఐటీ రిటర్న్ దాఖలు చేసే స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు ఈ కార్డులు పొందడానికి అర్హులు.
మరో ఆసక్తికర కథనం: కళ్లు బైర్లు కమ్మేలా పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి