Sundar Pichai Salary: గూగుల్‌లో మరో హిట్ వికెట్, సుందర్ పిచాయ్ జీతంలో భారీ కోత!
కంపెనీ నుంచి తీసేయగా మిగిలిన పెద్ద స్థాయి ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టాలని నిర్ణయించింది గూగుల్.
Sundar Pichai Salary: ప్రపంచ టెక్కీల కలల సౌథమైన గూగుల్‌లో (Google) ఆర్థిక మాంద్యం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంది. గూగుల్‌లోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న దాదాపు 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని (Google Layoffs) నిర్ణయించిన కంపెనీ, ఆ పనిని ఇప్పటికే ప్రారంభించింది. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ సిబ్బందికి సుందర్ పిచాయ్ గత వారం ఈ-మెయిల్స్ పంపారు. తీసేయాలని నిర్ణయించుకున్న వాళ్లకు హెచ్‌ఆర్ విభాగాల నుంచి లే-ఆఫ్ ఈ-మెయిల్స్ వెళ్తున్నాయి, ఆ వెంటనే వాళ్ల లాగిన్ నిలిచిపోతోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ నుంచి తాజాగా మరో పెద్ద న్యూస్ బాంబులా పేలింది. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) ఓ పెద్ద ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత గూగుల్ వర్క్‌ఫోర్స్‌తో పాటు ప్రపంచ టెక్ కంపెనీల్లో (Tech Company) కలకలం రేగింది.
సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే..
కంపెనీ నుంచి తీసేయగా మిగిలిన పెద్ద స్థాయి ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టాలని నిర్ణయించింది గూగుల్. ఉద్యోగులతో ఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో ఈ విషయాన్ని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంటే పై స్థాయిలో ఉన్న ఉద్యోగులందరి జీతాలకు కటింగ్ ఉంటుందని సుందర్ పిచాయ్ వెల్లడించారు. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్ తగ్గింపు సహా సీనియర్ ఉద్యోగులందరికీ వాళ్ల పని తీరు ఆధారంగానే ఇకపై వార్షిక బోనస్ ఉంటుందని సుందర్ పిచాయ్ వెల్లడించారు.
సుందర్ పిచాయ్ జీతం 2 మిలియన్ డాలర్లు
ఇదే మార్గంలో, తన జీతం కూడా తగ్గించుకోవాలని సుందర్ పిచాయ్ నిర్ణయించుకున్నారు. తన వార్షిక వేతనంలో కోత విధించాలని సంబంధిత హెచ్‌ఆర్‌కు పిచాయ్ సూచించారని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్‌ల ప్రకారం తెలుస్తోంది. అయితే, సుందర్ పిచాయ్ జీతంలో ఎంత కోత ఉంటుందనేది మాత్రం ఇంకా తెలీలేదు. జీతం నుంచి ఏయే ప్రయోజనాలను తగ్గిస్తారు, తగ్గించిన జీతాలను ఎంత కాలం వరకు తీసుకుంటారని వంటి వివరాలు కూడా వెల్లడికాలేదు. 2020 నాటికి, సుందర్ పిచాయ్ ఏడాదికి 2 మిలియన్ల డాలర్లను జీతభత్యాల రూపంలో పొందుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇచ్చే షేర్లు దీనికి అదనం.
గ్లోబల్ కంపెనీ అయిన గూగుల్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కొందరు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. తమ వైపు నుంచి ఒక్క మాట కూడా వినకుండా ఏకపక్షంగా తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నపళంగా తీసేస్తే తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అందరి జీతాల్లోనూ కోతలు పెడితే భారీగా డబ్బులు మిగులుతాయని, ఉద్యోగాలు తీసేసే పరిస్థితి ఉండదని సూచిస్తున్నారు.
యాపిల్ సీఈవో జీతంలోనూ కోత
టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) సీఈవో టిమ్ కుక్ (Tim Cook) కూడా ఇటీవలే తన జీతంలో కోత విధించుకున్నారు. ఏకంగా 40 శాతం కటింగ్‌కు ఓకే చెప్పారు.