Gold Price: అక్షయ తృతీయ ముందు ఊరట - భారీగా తగ్గిన బంగారం ధరలు
మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి, దిల్లీ ఎన్‌సీఆర్‌లోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 72,200 వద్దకు చేరింది.
Gold Price Crash: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త. గ్లోబల్ సిగ్నల్ వీక్‌గా ఉండడంతో రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం (23 ఫిబ్రవరి 2024) సాయంత్రానికి, దిల్లీ ఎన్‌సీఆర్‌లోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి (24 కేరెట్లు) రేటు ఏకంగా రూ. 1450 తగ్గింది. రానున్న రోజుల్లో బంగారం ధర రూ. 70,000 కు పడిపోయే అవకాశం ఉందని, ఈ స్థాయి కంటే దిగువకు జారిపోతే మరింత పతనమయ్యే అవకాశం ఉందని కమోడిటీ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.
అక్షయ తృతీయ ఎప్పుడు?
2024 మే 10వ తేదీన, శుక్రవారం నాడు అక్షయ తృతీయ పండుగ ఉంది. మన దేశంలోని ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. అక్షయ తృతీయను హిందువులు, జైనులు ఇద్దరూ జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు కనీసం గ్రాము బంగారమైనా కొంటే, ఆ పెట్టుబడి వర్ధిల్లుతుందని నమ్మకం.
మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి, దిల్లీ ఎన్‌సీఆర్‌లోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 72,200 వద్దకు చేరింది. పన్నులు కూడా కలిపితే ఇది రూ. 74,300 అయింది. స్వర్ణం మాత్రమే కాదు రజతం కూడా జారుడు ధోరణలో కొనసాగుతోంది. పసిడి పతనం ప్రభావం వెండిపై కనిపించింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి కిలో వెండి ధర రూ. 2300 తగ్గి రూ. 83,500 కి చేరుకుంది. దీనికి ఒకరోజు ముందు రూ. 85,800 రేటు పలికింది.
బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణం
ఇజ్రాయెల్ మీద మరిన్ని దాడులు చేసే ఆలోచన లేదని ఇరాన్ ప్రకటించింది. దీంతో, పశ్చిమాసియా మీద కమ్ముకున్న యుద్ధ మేఘాలు దూదిపింజల్లా తేలిపోయాయి. ప్రపంచ స్థాయిలో ఉద్రిక్తతలు తగ్గడంతో సేఫ్ హెవెన్ (బంగారం) నుంచి పెట్టుబడులు వెనక్కు మళ్లాయి. పసిడిలో ప్రాఫిట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ కారణంగా ఎల్లో మెటల్ రేట్లు వరుసగా రెండో రోజూ క్షీణించాయి.
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయి, ఔన్సు ధర 2,298.59 డాలర్లకు చేరుకుంది. ఈ నెల 12న, గోల్డ్ రేట్ ఔన్స్‌కు 2,431.29 డాలర్లకు చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో పాటు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US FED) తన వడ్డీ రేట్లను మరికొంత ఎక్కువ కాలం కొనసాగించే సూచనలు కనిపించడంతో స్వర్ణ ప్రకోపం తగ్గడం ప్రారంభమైంది.
ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పిన ప్రకారం... బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైంది. కోమెక్స్‌లో (COMEX) గోల్డ్ గత రెండు రోజులుగా కాంతివిహీనం కావడమే దీనికి నిదర్శనమని త్రివేది వెల్లడించారు. రానున్న రోజుల్లో, MCXలో (Multi Commodity Exchange) ఎల్లో మెటల్‌కు దాదాపు రూ. 70,000 దగ్గర సపోర్ట్ దొరకొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, అమ్మకాల ఉద్ధృతిలో పసిడి రేటు ఈ స్థాయి కంటే తగ్గితే, రూ. 68,500 వరకు జారిపోవచ్చని చెప్పారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మే నెల నుంచి మారే మనీ రూల్స్, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్పక తెలుసుకోవాలి