![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India GDP: భారతదేశ జీడీపీ అంచనాలో కోత పెట్టిన ప్రపంచ బ్యాంక్
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు మరింత మందగించి 6.3 శాతానికి చేరుకుంటుందని అంచనా.
![India GDP: భారతదేశ జీడీపీ అంచనాలో కోత పెట్టిన ప్రపంచ బ్యాంక్ GDP World Bank Estimates india growth outlook at 6.3 percent in fy24 trims 0.3 percentage India GDP: భారతదేశ జీడీపీ అంచనాలో కోత పెట్టిన ప్రపంచ బ్యాంక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/690615344bcf1edf75d83973367910421686120972834545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
World Bank -India GDP: 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు (GDP) అంచనాను ప్రపంచ బ్యాంకు 6.3 శాతానికి తగ్గించింది. గత జనవరిలో ప్రపంచ బ్యాంకు ప్రకటించిన అంచనా కంటే ఇది 0.3 శాతం తక్కువ. అయితే.. ప్రైవేట్ కన్‌జంప్షన్, పెట్టుబడుల్లో భారతదేశం హాట్ స్పాట్‌లో ఉందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. సేవల రంగం వృద్ధి కూడా బలంగా ఉందని చెప్పింది. 2022 ద్వితీయార్థంలో క్షీణత తర్వాత, 2023లో తయారీ రంగంలో పరిస్థితి మెరుగుపడుతోంది.
"2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు మరింత మందగించి 6.3 శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇది, జనవరి అంచనా కంటే 0.3 శాతం తక్కువ" - ప్రపంచ బ్యాంక్
భారతదేశ GDP వృద్ధి ఎందుకు మందగిస్తుంది?
భారత్‌లో వృద్ధి రేటు మందగించడానికి అధిక ద్రవ్యోల్బణం, రుణ వ్యయాలు పెరగడం కారణమని, దీని వల్ల ప్రైవేట్ వినియోగంపై ప్రభావం పడుతుందని ప్రపంచ బ్యాంక్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ
వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం, "భారత్‌లో వివిధ సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో, ఆశించిన స్థాయికి ద్రవ్యోల్బణం దిగి రావడం వల్ల FY2025-26లో వృద్ధి కొంతమేర పుంజుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు & వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుంది".
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
2023 ప్రారంభంలో, భారతదేశ ఆర్థిక వృద్ధి మహమ్మారి ముందు దశాబ్దంలో సాధించిన స్థాయి కంటే తక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అధిక ధరలు, పెరుగుతున్న అప్పుల వ్యయం కారణంగా ప్రైవేట్ పెట్టుబడులు ప్రభావితం కావడమే దీనికి కారణంగా వెల్లడించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంకు అంచనా
గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్‌పై తన తాజా నివేదికలో, 2022లో 3.1 శాతంగా ఉన్న ప్రపంచ వృద్ధి రేటు 2023లో 2.1 శాతానికి తగ్గుతుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. చైనా మినహా, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు & వర్ధమాన ఆర్థిక వ్యవస్థల (EMDE) వృద్ధి రేటు గత సంవత్సరంలో నమోదైన 4.1 శాతం నుంచి ఈ సంవత్సరం 2.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది, వృద్ధి రేటులో భారీ క్షీణతను చూపుతోంది.
ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడు ఏం చెప్పారు?
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా కొత్తగా పగ్గాలు చేపట్టిన అజయ్ బంగా, "పేదరికాన్ని తగ్గించడానికి, సంపద పెంచడానికి ఖచ్చితమైన మార్గం ఉపాధి కల్పన. వృద్ధి మందగిస్తే ఉద్యోగాల సృష్టి కూడా కష్టమవుతుంది. వృద్ధి రేటు అంచనాలు 'విధి రాత' కాదని గమనించడం ముఖ్యం. దీనిని మార్చడానికి మనకు అవకాశం ఉంది. అయితే మార్పు కోసం మనమందరం కలిసి పనిచేయాలి" అని చెప్పారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన అజయ్ బంగా గత శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
మరో ఆసక్తికర కథనం: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)