Forbes India billionaires 2022: ఈసారి కూడా తిరుగులేని ముకేశ్ అంబానీ ఆయన్నే ఫాలో అవుతున్న గౌతమ్ అదానీ
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ మొత్తం సంపద 90.7 బిలియన్ డాలర్లు. ఆయన ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే 7 శాతం పెరిగింది. 90 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండవ స్థానంలో ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ(Reliance Industries chairman Mukesh Ambani) 90.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్ల జాబితా(Forbes India billionaires 2022)లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రపంచంలోని ధనవంతుల్లో పదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Adani Group chairman Gautam Adani) 90 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్(HCL Technologies) ఛైర్మన్ శివ్ నాడార్(Shiv Nadar) 28.7 బిలియన డాలర్ల నికర ఆదాయంతో మూడవ స్థానంలో నిలిచారు.
గతేడాదితో పోల్చుకుంటే జాబితాలోని మొదటి మూడు ర్యాంక్‌లు మారలేదు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అంబానీ మొత్తం సంపద గత ఆర్థిక సంవత్సరం కంటే 7 శాతం పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కాంప్లెక్స్‌కు యజమాని అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను అంబానీ లీడ్ చేస్తున్నారు. భారతదేశంలో శాసిస్తున్న 4G వైర్‌లెస్ నెట్‌వర్క్ జియో కూడా ఆయన వ్యాపారాల్లో ఒకటి.
రెండో అత్యంత సంపన్న భారతీయుడు అదానీ మొత్తం నికర ఆస్తుల విలువ 90 బిలియన్ డాలర్లు. 59 ఏళ్ల అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు పోర్ట్‌లు, ఏరోస్పేస్ నుంచి థర్మల్ ఎనర్జీ, బొగ్గు వరకు కంపెనీలను కలిగి ఉన్నారు. గత కొన్ని నెలలుగా అదానీ, అంబానీ కొన్ని బిలియనీర్ ఇండెక్స్‌ల్లో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు. అంబానీ అదానీ ఇద్దరూ బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రాబోయే కాలంలో భారత్‌ను గ్రీన్ ఎనర్జీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
కోవిడ్-19 వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈవో సైరస్ పూనావలా(Cyrus Poonawalla) 24.3 బిలియన డాలర్ల సంపాదనతో నాల్గో స్థానంలో నిలిచారు. గత సంవత్సరం ప్రపంచంలోని 100 మంది సంపన్నుల జాబితాలో చేరిన డి-మార్ట్(D-mart) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని(Radhakishan Damani) ఈసారి 20 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.
ఆర్సెలర్ మిట్టల్(ArcelorMittal ) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్(Lakshmi Mittal) 17.9 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉంటే... సావిత్రి జిందాల్(Savitri Jindal) 17.7 బిలియన్ డాలర్లతో ఏడవ స్థానంలో నిలిచారు. 16.5 బిలియన్ డాలర్లతో ఆదిత్య బిర్లా గ్రూప్(Aditya Birla Group ) అధినేత కుమార్ మంగళం బిర్లా(Kumar Mangalam Birla) ఎనిమిదో స్థానంలో, సన్ ఫార్మాస్యూటికల్స్(Sun Pharmaceuticals ) హెడ్ దిలీప్ షాంఘ్వీ(Dilip Shanghvi ) 15.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్(Kotak Mahindra Bank) మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్(Uday Kotak) 14.3 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచారు. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గతేడాది 140 ఉంటే అది 166కు పెరిగిందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.