Air india: ఎద్దుల బండిలో వెళ్తాగానీ ఎయిర్ ఇండియా విమానం ఎక్కను గాక ఎక్కను
Air India Flight Passenger Angry: నేను ఎక్కిన ఎయిర్ ఇండియా విమానంలో దుర్వాసన వస్తోంది. సీట్లపై మరకలు ఉన్నాయి. అంతేకాదు, విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
Flight Passenger Angry On Air India: సోషల్ మీడియా విస్తృతమయ్యాక, ఎక్కడ ఏం జరిగినా చిటికెలో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతోంది. చాలా మంది విమాన ప్రయాణికులు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు. ఆ అనుభవాల్లో ఎక్కువ విషయాలు సదరు విమానయాన సంస్థ అందించే సౌకర్యాలు, ఆహారం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలవుతున్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా విషయంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. చిర్రెత్తుకొచ్చిన ఒక ప్రయాణీకుడు... ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం, పరిశుభ్రత గురించి ప్రశ్నించాడు. తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విమానయాన కంపెనీ పరువు తీశాడు. భవిష్యత్తులో తాను ఎద్దుల బండి అయినా ఎక్కుతాగానీ, ఎయిర్ ఇండియా విమానం మాత్రం ఎక్కనని రాశాడు.
విమానంలో దుర్వాసన, సీట్లపై మరకలు
పుణెకు చెందిన రచయిత ఆదిత్య కొండవర్, తాను ఇటీవలే ఎయిర్ ఇండియా విమానంలో బెంగళూరు నుంచి పుణె వచ్చినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో రాశాడు. ఆ ప్రయాణ సమయంలో అతనికి చేదు అనుభవం ఎదురైంది. సీట్లపై మరకలు కనిపించాయట. విమానంలో దుర్వాసన వచ్చిందట. వాటన్నింటికీ ఓర్చుకున్నప్పటికీ, ఆ విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరిందట. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆదిత్య కొండవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తాను ఎప్పుడూ ఎయిరిండియా లేదా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించను అని రాశారు.
"మీరు నాకు చాలా విలువైన పాఠం నేర్పారు. భవిష్యత్తులో నేను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లేదా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించను. అవసరమైతే నేను 100% ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధం. కానీ, సకాలంలో ప్రయాణించే వేరే సంస్థ విమానం మాత్రమే ఎక్కుతా. అవసరమైతే, నేను ఎద్దుల బండిలో కూడా ప్రయాణిస్తాను గానీ ఎయిర్ ఇండియాలో వెళ్లడానికి మాత్రం ఇష్టపడను. టాటా గ్రూప్, దాని అగ్ర నాయకత్వంపై నాకు గౌరవం ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం చేదు అనుభవం ఎదురైంది" అని X పోస్ట్‌లో ఆదిత్య కొండవర్ రాశారు.
Dear @AirIndiaX , Thank you for teaching me a very valuable lesson last night
— Aditya Kondawar (@aditya_kondawar) June 25, 2024
Never and I mean it with all seriousness - I am never flying Air India Express or Air India in my life again - I will pay 100% extra cost if needed but will take other airlines that are on time (only…
క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
ఆదిత్య కొండవర్ చేసిన పోస్ట్‌పై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందించింది, అతనికి క్షమాపణలు చెప్పింది. అతనికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు కామెంట్ చేసింది. ఇన్‌కమింగ్ ఫ్లైట్ ఆలస్యం అయినందున ఆదిత్య కొండవర్ ఎక్కాల్సిన విమానం ఆలస్యం అయినట్లు వివరించింది. కొన్ని విషయాలను మనం నియంత్రించలేమని చెప్పింది. విమాన ప్రయాణంలో ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రిప్లై ఇచ్చింది.
మరో ఆసక్తికర కథనం: జనం దగ్గర ఎన్ని కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయో తెలుసా? ఒక్క నెలలో రూ.లక్షన్నర కోట్ల ఖర్చు