Credit Cards: జనం దగ్గర ఎన్ని కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయో తెలుసా? ఒక్క నెలలో రూ.లక్షన్నర కోట్ల ఖర్చు
Credit Cards In India: జనవరి నెలతో పండుగ సీజన్ ముగియడంతో క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ తగ్గింది. మరికొన్ని నెలల్లో ఫెస్టివ్ సీజన్ ప్రారంభం అవుతుంది, ఆన్‌లైన్ షాపింగ్ మళ్లీ జోరందుకుంటుంది.
Credit Card Spending In India 2024: భారతదేశంలో జారీ అవుతున్న క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య (credit card base) ఎప్పటికప్పుడు వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే నెల చివరి నాటికి, మన దేశంలోని మొత్తం క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య 103.3 మిలియన్లకు చేరుకుంది. అంటే, మన దేశంలో బ్యాంక్‌లు/రుణదాతలు కలిసి ఇప్పటి వరకు 10.33 కోట్ల క్రెడిట్ కార్డ్‌లను ఇష్యూ చేశాయి. అంతకుముందు ఏడాది ఇదే నెలతో (2023 మే) పోలిస్తే ఇది 17.7 శాతం వృద్ధి.
2023 మే నుంచి 2024 మే వరకు, ఏడాది కాలంలో, మిగిలిన బ్యాంక్‌లతో పోలిస్తే ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌ల బేస్ అత్యధికంగా పెరిగింది. మే నెలలో దేశవ్యాప్తంగా 7.6 లక్షల క్రెడిట్ కార్డ్‌లు జారీ అయ్యాయి. ఏప్రిల్‌లో బ్యాంక్‌లు విడుదల చేసిన 7.4 లక్షల కంటే ఇది ఎక్కువ. అయితే, ఈ ఏడాది మార్చిలో 10.2 లక్షల క్రెడిట్ కార్డులను బ్యాంక్‌లు/రుణదాతలు ఇష్యూ చేశాయి.
18% పెరిగిన క్రెడిట్ కార్డ్ బేస్
క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులపై అధ్యయనం చేసిన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ పేమెంట్స్ ట్రాకర్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే, క్రెడిట్ కార్డ్ బేస్‌లో అత్యుత్తమంగా 18 శాతం వృద్ధి నమోదైంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే వ్యయం ఏడాదికి 17 శాతం పెరిగింది.
ప్రస్తుతం, మన దేశంలో జారీ అయిన 10.33 కోట్ల క్రెడిట్ కార్డ్స్‌లో ప్రైవేట్ రంగ బ్యాంక్‌లదే అత్యధిక వాటా. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ ప్లేస్‌లో ఉంది. 2024 మే నెలలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గరిష్టంగా 2,89,100 కార్డ్‌లను జోడించింది, ఆ తర్వాతి స్థానాల్లో యాక్సిస్ బ్యాంక్, SBI కార్డ్ ఉన్నాయి.
మే నెలలో 1.65 లక్షల కోట్లు ఖర్చు
2023 మే నెలతో పోలిస్తే, 2024 మే నెలలో క్రెడిట్ కార్డ్ వ్యయంలో 17 శాతం పెరిగి రూ. 1.65 లక్షల కోట్లుగా ఉంది. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే 5 శాతం పెరుగుదల నమోదైంది. గత మూడేళ్లలో, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే వ్యయాలు 47 శాతం పెరిగాయి. క్రెడిట్ కార్డ్ బిల్ ఔట్‌స్టాండింగ్‌లో అన్ని బ్యాంకుల వాటాను పరిశీలిస్తే... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటా 25.1 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 19.4 శాతం, ఎస్‌బీఐ కార్డ్ వాటా 16 శాతం, యాక్సిస్ బ్యాంక్ వాటా 11.6 శాతంగా ఉన్నాయి.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, 2023 మే నెలతో పోలిస్తే, క్రెడిట్ కార్డ్‌పై చేసిన సగటు నెలవారీ వ్యయం 2024 మే నెలలో ఫ్లాట్‌గా (ఎలాంటి మార్పు లేకుండా) ఉంది. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ 4 శాతం పెరిగింది. క్రెడిట్ కార్డ్ సగటు లావాదేవీల సంఖ్య 3.8కి పెరిగింది, అయితే టిక్కెట్ సైజ్ రూ. 4500కు తగ్గింది. ఈ ఏడాది జనవరి తర్వాత పండుగ సీజన్ లేకపోవడం, బ్యాంక్‌ల్లో ఆస్తి నాణ్యత సమస్యల కారణంగా కార్డ్‌లపై సగటు వ్యయం తగ్గింది. జూన్, జూలైలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మన దేశంలో ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతాయి. అప్పటి నుంచి క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరగొచ్చు.
మరో ఆసక్తికర కథనం: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్ - ఈ నెల 30 తర్వాత మీ బిల్లు చెల్లించలేరు!