Budget 2024: ఈసారి బడ్జెట్లో AI కట్టడికి కొత్త టాక్స్! నిర్మలమ్మకు ఆర్థికవేత్తలు సలహా
Budget 2024: ఏఐ, రోబోటిక్స్ లకు పెరుగుతున్న వినియోగం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుదల ప్రభావాన్ని తగ్గించేందుకు రోబోట్ పన్నును ప్రవేశపెట్టడంపై నిర్మలా సీతారామన్ నేడు నిపుణులతో చర్చించారు.
Robot Tax: ఈ సారి దేశంలో సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా పూర్తైన వేళ మోదీ సర్కార్ కేంద్రంలో మూడోమారు కొలువుదీరింది. మోదీ 3.0 బడ్జెట్ లో ఎలాంటి ప్రయోజనాలను ప్రజలకు, పన్ను చెల్లింపుదారులకు, ఉద్యోగులకు అందిస్తారనే చర్చ చాలా రోజులుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఒకదాని తర్వాత మరొకటి బడ్జెట్ ప్రకటనల గురించి ఊహాగానాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడో టర్మ్‌లో ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా తదుపరి దశకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జూలై మూడోవారంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఇది కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా రెండవ టర్మ్ ప్రారంభించగానే బుధవారం బడ్జెట్‌కు సంబంధించి దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో దేశాన్ని తయారీ హబ్‌గా మార్చాలని, ఉత్తమ చదువులు పూర్తి చేసి ఉపాధి అవకాశాల కోసం వెతుకున్న భారతీయ గ్రాడ్యుయేట్‌లకు అవకాశాలు కల్పించటంపై ఇందులో వారు చర్చించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సహా అన్ని రంగాల్లోని ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం పనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం. చాలా కంపెనీలు తమ ఉద్యోగులు, నిర్వహణ ఖర్చుల మదింపులో భాగంగా విరివిగా ఏఐ టూల్స్ వినియోగించటం అధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగిత రేట్లను పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ, రోబోటిక్స్ లకు పెరుగుతున్న వినియోగం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుదల ప్రభావాన్ని తగ్గించేందుకు రోబోట్ పన్నును ప్రవేశపెట్టడంపై తాజా మీటింగ్‌లో చర్చించిన కీలక అంశాల్లో ఒకటిగా ఉందని సమాచారం.
ఆర్థికవేత్తల సూచనలను అమలు చేస్తే రానున్న రోజుల్లో ఇండియాలో రోబోట్ ట్యాక్స్ అమలులోకి రావచ్చు. ఇప్పటికే ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు కూడా దీనిని అమలు చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి తక్కువగా చదువుకున్న యువతకు అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తుండగా.. పట్టభద్రులకు ఉపాధి కల్పించేందుకు అప్రెంటిస్‌షిప్‌లను ఆకర్షణీయంగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దేశంలో MSME రంగానికి కూడా PLI పథకాన్ని తీసుకురావడంపై చర్చ జరిగింది. తద్వారా ఎక్కువ మంది చిన్న పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి వైపు ఆకర్షితులై అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు వెల్లడైంది.
రోబోట్ ట్యాక్స్ అంటే ఏమిటి..?
AI, రోబోట్‌లను అవసరమైన మేరకు పొదుపుగా, తెలివిగా ఉపయోగించాలని ఆర్థికవేత్త, స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్ అశ్విని మహాజన్ అభిప్రాయపడ్డారు. దీనికారణంగా రోబో పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపాధి కోల్పోయిన కార్మికుల నైపుణ్యం పెంపునకు ఖర్చు చేయవచ్చని ఆయన సూచించారు. దీంతో నిర్మలమ్మతో జరిగిన సమావేశంలో రోబోట్ పన్ను విధింపుపై చర్చ జరిగింది. దేశీయ పరిశ్రమలను రక్షించటంతో పాటు ప్రైవేటు పెట్టుబడుల పెంపుపై ఆర్థిక నిపుణులు సూచనలు చేశారు. జూన్ 25 నాటికి బడ్జెట్ తయారీకి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం పరిశ్రమలు, రైతు సంఘాలు, ఎంఎస్‌ఎంఈలు, కార్మిక సంఘాలతో సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది.