FIIs Stocks: బడ్జెట్ తర్వాత ఈ 4 రంగాల్లో ₹7 వేల కోట్లు కుమ్మరించిన FIIలు
FY24 కోసం కేటాయించిన రూ. 10 లక్షల కోట్ల మూలధన వ్యయం, రెండంకెల రుణ వృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది.
FIIs Stocks: విదేశీ పెట్టుబడిదార్లు భారత మార్కెట్ల నుంచి చౌకగా ఉన్న ఇతర దేశాల మార్కెట్‌లకు డాలర్లను మళ్లిస్తున్నప్పటికీ, కేంద్ర బడ్జెట్ తర్వాత నాలుగు రంగాల్లో దాదాపు రూ.7,000 కోట్లు కుమ్మరించారు.
NSDL డేటా ప్రకారం... జనవరి రెండో పక్షం రోజుల్లో (16-31 తేదీల్లో) రూ. 8,500 కోట్లకు పైగా విలువైన ఆర్థిక రంగ షేర్లను విక్రయించిన FIIలు (Foreign Portfolio Investors), కేంద్ర బడ్జెట్ తర్వాత మనసు మార్చుకున్నారు, నాణేనికి మరోవైపును చూడడం మొదలు పెట్టారు.
4 రంగాల్లోకి 7 వేల కోట్ల రూపాయలు
ఈ నెల మొదటి పక్షం రోజుల్లో (1-15 తేదీల్లో)... ఎఫ్‌ఐఐల టాప్-4 కొనుగోళ్లు - ఫైనాన్షియల్స్ (రూ. 2,368 కోట్లు), ఐటీ (రూ. 1,777 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (రూ. 1,509 కోట్లు), హెల్త్ కేర్ (రూ. 1,099 కోట్లు).
ఆర్థిక సేవల రంగానికి కేంద్ర బడ్జెట్ సానుకూలంగా ఉంది. FY24 కోసం కేటాయించిన రూ. 10 లక్షల కోట్ల మూలధన వ్యయం, రెండంకెల రుణ వృద్ధిని గ్రోత్‌ను సాధించడంలో సహాయపడుతుంది. క్యాపిటల్ గూడ్స్ రంగం కూడా, భారీ ప్రభుత్వ కాపెక్స్ నుంచి నేరుగా లబ్ధి పొందుతుంది.
గత నెల రోజుల్లో హెడ్‌లైన్ ఇండెక్స్ నిఫ్టీ 2.6% తగ్గినా, నిఫ్టీ IT ఇండెక్స్ 3.65% పెరగడం వెనుక FIIల కొనుగోళ్ల మద్దతు ఉంది.
ఈ నెల మొదటి పక్షం రోజుల్లో FIIలు ఎక్కువగా వదిలించుకున్న రంగాల్లో ఆయిల్ & గ్యాస్ (రూ. 6,263 కోట్లు), పవర్ (రూ. 2,351 కోట్లు), మెటల్స్ (రూ. 1,948 కోట్లు) తొలి స్థానాల్లో ఉన్నాయి.
ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, భారీగా పెరిగిన వాల్యుయేషన్ల కారణంగా.. విదేశీ పెట్టుబడి సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 41,500 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశాయి.
భవిష్యత్ చిత్రం ఏంటి?
"MSCI EM ఇండెక్స్‌తో పోలిస్తే MSCI ఇండియా ఇండెక్స్ వాల్యుయేషన్ ప్రీమియం (107% గరిష్ట స్థాయి నుంచి) 68%కి పడిపోయింది. కానీ, పదేళ్ల సగటుతో పోలిస్తే ఇంకా పెరిగింది. ఇంతటి ప్రీమియం వాల్యుయేషన్ల మధ్య ఎఫ్‌ఐఐలు నిలబడలేరు. కాబట్టి, సమీప కాలంలోనూ ఇండియన్ ఈక్విటీ పనితీరు అస్థిరంగా ఉంటుందని భావిస్తున్నాం. మంచి స్టాక్స్‌లో చోటు చేసుకునే పదునైన దిద్దుబాట్లను మీడియం-టు-దీర్ఘకాల దృక్పథంతో కొనుగోలు చేసేందుకు ఒక అవకాశంగా చూడవచ్చు" అని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ చెప్పింది.
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా దాదాపు ఇదే మాట చెప్పింది. భారతీయ మార్కెట్ల విలువలతో పాటు, వినియోగం, పెట్టుబడి, ఔట్‌సోర్సింగ్ రంగాల్లోని చాలా 'గ్రోత్' స్టాక్స్ ఖరీదైనవిగా (ప్రీమియం వాల్యుయేషన్) ఉన్నాయని వెల్లడించింది.
విదేశీ పెట్టుబడిదారులతో పాటు బడా దేశీయ పెట్టుబడిదారులు బ్యాంకులు, వాహనాలు, సిమెంట్ రంగాల మీద ఎక్కువగా బుల్లిష్‌గా ఉన్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.