EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
గత ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
EPFO Interest Rate: కోట్లాది చందాదార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి (employees’ provident fund - EPF) డిపాజిట్ల మీద వడ్డీని పెంచింది. వార్తా సంస్థ PTI రిపోర్ట్ ప్రకారం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 8.15 శాతం చొప్పున వడ్డీని చెల్లించాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
వడ్డీ మరో 0.05 శాతం పెంపు
ప్రస్తుత (2022-23 లేదా FY23) ఆర్థిక సంవత్సరానికి, EPF చందాదార్లకు 8.15 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. దీనివల్ల, దేశంలోని 6 కోట్ల మందికి పైగా EPF ఖాతాదార్లకు వడ్డీ ప్రయోజనం లభిస్తుంది, వారి ఖాతాల్లోకి మరింత డబ్బు జమ అవుతుంది. ఈ 6 కోట్ల మందిలో 72.73 లక్షల మంది పింఛనుదార్లు ఉన్నారు.
EPFO fixes 8.15 pc interest rate on employees' provident fund for 2022-23: Sources
— Press Trust of India (@PTI_News) March 28, 2023
గత ఆర్థిక సంవత్సరం, అంటే 2021-22 లేదా FY22 కాలానికి ఈ వడ్డీ రేటు 8.1 శాతంగా ఉంది. అయితే, గత 40 ఏళ్లలో (1980 తర్వాత) ఎన్నడూ లేనంతగా తక్కువ వడ్డీ రేటు ఇది. ఈ నిర్ణయం తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి చాలా వ్యతిరేకత ఎదురైంది. EPF చందాదార్లకు 2020-21లో 8.5 శాతం వడ్డీ ఇచ్చారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 8.65 శాతం, 8.55 శాతం, 8.65 శాతం చెల్లించారు. ఇప్పుడు 0.05 శాతం పెంచి 8.15 శాతానికి చేర్చినా, ఇది కూడా దశాబ్దాల కనిష్ట రేటు, గత సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ మొత్తాన్ని ప్రభుత్వం ఓకే చేసినట్లు.
నిన్న, ఇవాళ (27, 28 తేదీలు) జరిగిన చర్చల తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), కొత్త వడ్డీ రేటును నిర్ణయించారు. ఈ వడ్డీ రేటు అమలుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి EPF రేటును ఇవాళ ప్రకటించవచ్చు.