Edible Oil: వంటనూనెల మంట నుంచి ఊరట, 'ధార' ధర భారీగా తగ్గింపు
ధార వంట నూనెల MRPని లీటరుకు రూ. 15 నుంచి రూ. 20 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Edible Oil: ఖరీదుగా మారిన వంట నూనెలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య జానానికి పెద్ద ఊరట కలిగించే వార్త వచ్చింది. "ధార" (DHARA) బ్రాండ్ పేరుతో ఎడిబుల్ ఆయిల్ విక్రయిస్తున్న మదర్ డెయిరీ (MOTHER DAIRY), తన ఉత్పత్తుల ధరలు తగ్గించింది. ధార వంట నూనెల MRPని లీటరుకు రూ. 15 నుంచి రూ. 20 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఈ కంపెనీ ప్రకటించింది. తగ్గించిన MRPతో ఉన్న నూనె ప్యాకెట్లు వచ్చే వారంలో మార్కెట్‌లోకి వస్తాయని వెల్లడించింది. ఫలితంగా, ధార వంట నూనె కొనే ప్రజలకు ఒక వారంలోనే అవి చౌకగా అందుబాటులోకి వస్తాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన కమొడిటీ ధరలు ఇటీవలి నెలల్లో గణనీయంగా తగ్గాయి. వెజ్ ఆయిల్ ధరలు కూడా బాగా దిగి వచ్చాయి. వంట నూనెలు దిగుమతి చేసుకునే కంపెనీలే గాక, వినియోగదార్లు కూడా ఈ తగ్గుదల ప్రయోజనం పొందాలని భారత ప్రభుత్వం భావించింది. వంట నూనెల ప్యాకేజింగ్‌పై గరిష్ట చిల్లర ధరలను (MRP) తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌కు (SEA) కేంద్ర ఆహార & వినియోగదార్ల వ్యవహారాల శాఖ సూచించింది. గత మంగళవారం నాడు (02 మే 2023) ఈ సూచన చేసింది.
ధార నూనెల కొత్త రేట్లు ఇవి
కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సూచనతో ఎడిబుల్ ఆయిల్ ధరలను మదర్ డెయిరీ తగ్గించింది. సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుసెనగ నూనె ధరల MRPలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మదర్ డెయిరీ తాజా ప్రకటన తర్వాత... ధార రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ లీటర్ పాలీప్యాక్ ధర రూ. 170 నుంచి రూ. 150 కి తగ్గింది. ధార రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్ ధర రూ. 190 నుంచి రూ. 179 కి తగ్గింది. ధార సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 175 నుంచి రూ. 160 కి తగ్గింది. ధార వేరుశెనగ నూనె ధర రూ. 255 నుంచి రూ. 240 కి తగ్గింది.
తగ్గనున్న ఫార్చ్యూన్, జెమిని ఎడిబుల్ ఆయిల్ రేట్లు
అదానీ విల్మార్, జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు స్పందించాయి. 'ఫార్చ్యూన్' (Fortune) బ్రాండ్ పేరుతో వంట నూనెలు విక్రయిస్తున్న "అదానీ విల్మార్" లీటరుకు 5 రూపాయలు, 'జెమిని' (Gemini) బ్రాండ్ పేరుతో నూనెలు అమ్ముతున్న "జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా" లీటరుకు 10 రూపాయల చొప్పున ధరలు తగ్గించాలని నిర్ణయించాయి. ఈ ధర తగ్గింపు ప్రయోజనం దాదాపు మూడు వారాల్లో వినియోగదార్లకు చేరుతుందని ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తాయని, వంట నూనెల రేట్లు 6 శాతం వరకు తగ్గవచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
భారీగా తగ్గిన అంతర్జాతీయ ధరలు
గత ఆరు నెలల్లో, ముఖ్యంగా గత 60 రోజుల్లో అంతర్జాతీయ ధరలు భారీగా తగ్గాయి. వేరుశెనగ, సోయాబీన్, ఆవాలు బంపర్‌గా ఉత్పత్తి అయ్యాయి, అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లు తగ్గాయి. తగ్గిన రేట్ల వద్ద వాటిని దిగుమతి చేసుకుంటున్న కంపెనీలు, మన దేశంలో మాత్రం ఆ మేరకు ధరలు తగ్గించలేదు.
దిగుమతి చేసుకునే సోయాబీన్ నూనె ధర గత రెండు నెలల్లో 14.5% తగ్గింది. పొద్దు తిరుగుడు, రాప్‌సీడ్ నూనెల ధరలు వరుసగా 10.5%, 11% తగ్గాయి. అంతర్జాతీయంగా పొద్దుతిరుగుడు నూనె ధరలు పామాయిల్ కంటే చౌకగా మారాయి.
పొద్దుతిరుగుడు నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ఒకటి.