Donald Trump New Tarrifs: మరో 'టారిఫ్ బాంబ్' పేల్చిన ట్రంప్- 14 దేశాలపై 40 శాతం వరకు భారీ పన్ను, వార్నింగ్ సైతం
US New Tarriffs | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 14 దేశాలపై కొత్త సుంకాలు విధించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమలులోకి వస్తాయి. గరిష్టంగా మయన్మార్, లావోస్ పై 40% శాతం ట్యాక్స్ విధించారు.

Donald Trump Tarrifs 2025: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు 14 దేశాలపై కొత్త వాణిజ్య పన్నులు (US Tarrifs) విధించనున్నట్లు ప్రకటించారు. అత్యధికంగా 40 శాతం సుంకాన్ని మయన్మార్, లావోస్‌లపై విధించారు. ఈ కొత్త టారిఫ్ నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో తాను విధించిన కొత్త సుంకాల గురించి సమాచారం అందించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక లేఖలను అన్ని దేశాల నాయకులకు పంపించామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ దీనిని సుంకాల లేఖల కొత్త వేవ్ అని అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అటు చైనా, ఇటు రష్యాకు తన విధాన పరమైన నిర్ణయాలతో హెచ్చరికలు పంపారు. అమెరికా గ్రేట్ అగైన్ అంటూ పలు దేశాలపై టారిఫ్ వార్ ప్రకటించి ట్రేడ్ డీల్ కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
14 దేశాలకు ట్రంప్ హెచ్చరిక
గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన నిర్ణయాలతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని నెలలుగా ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారు. తాజాగా ట్రంప్ 14 దేశాలకు లేఖలు పంపారు. ఆఅధికారిక లేఖలలో, అమెరికాపై సుంకాలు (పన్నులు) పెంచితే, అమెరికా కూడా అంతకు మించి పన్నులు విధిస్తుందని ఆ దేశాలను ట్రంప్ హెచ్చరించారు. "మీరు ఏ కారణం చేతనైనా అమెరికాపై మీ సుంకాలు పెంచితే, మీరు ఎంత శాతం పెంచారో, మేము దానికి అదనంగా మరింత పన్ను విధిస్తాం" అని లేఖలో స్పష్టం చేశారు.
అమెరికాకు సుంకాలు ఎందుకు అవసరమో వెల్లడించిన ట్రంప్
అమెరికాపై భారీ వాణిజ్య లోటు (ట్రేడ్ డెఫిసిట్) ఉంది. దశాబ్దాల తరబడి విధించిన తప్పుడు విధానాలను సరిదిద్దడానికి ఈ కొత్త సుంకాలు అవసరమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ మాటల ప్రకారం, ఈ విధానాలలో సుంకాలు, పన్నేతర అడ్డంకులు రెండూ ఉన్నాయి. "అమెరికాపై ఈ వాణిజ్య లోటు మన ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, జాతీయ భద్రతకు కూడా ముప్పుగా మారిందని" ట్రంప్ అన్నారు.
ట్రంప్ మొదట జపాన్, దక్షిణ కొరియాను ఎందుకు ఎంచుకున్నారు?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియా, జపాన్ దేశాలను మొదట టార్గెట్ గా ఎందుకు ఎంచుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్‌ను ప్రశ్నించగా, "ఇది అధ్యక్షుడి విశేషాధికారం. ఆయనకు ఏ దేశాలకు టారిఫ్ విధించాలని భావిస్తే వాటిపై మొదటగా చర్యలు చేపడతారు అని ఆమె బదులిచ్చారు. ట్రంప్ పరిపాలన ఇతర వాణిజ్య భాగస్వాములతో ఒప్పందాలను ఖరారు చేయడానికి దగ్గరగా ఉంటుందని కరోలిన్ తెలిపారు. ఇతర దేశాలతో ట్రంప్ చేసుకోనున్న ఈ ఒప్పందాలు అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాయని అధ్యక్షుడు భావిస్తున్నారని ఆమె అన్నారు.
ఏ దేశాలపై ఎంత పన్ను విధించారు
1. మయన్మార్ - 40%
2. లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (లావోస్) - 40%
3. కంబోడియా - 36%
4. థాయిలాండ్ - 36%
5. బంగ్లాదేశ్ - 35%
6. సెర్బియా - 35%
7. ఇండోనేషియా - 32%
8. దక్షిణాఫ్రికా - 30%
9. బోస్నియా, హెర్జెగోవినా - 30%
10. జపాన్ - 25%
11. కజకిస్తాన్ - 25%
12. మలేషియా - 25%
13. దక్షిణ కొరియా - 25%
14. ట్యునీషియా - 25%






















