Sridhar Vembu Divorce: జోహో శ్రీధర్ వెంబుకు విడాకుల గండం - రూ.15 వేల కోట్లకు పరిహారం కోరుతున్న భార్య
Divorce battle: జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీల మధ్య జరుగుతున్న విడాకుల పోరాటం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది 15వేల కోట్ల వ్యవహారంతో ముడిపడి ఉన్న అంశం.

Divorce battle of Zoho Sridhar Vembu: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీల మధ్య జరుగుతున్న విడాకుల పోరాటం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం కేవలం వ్యక్తిగత విభేదాలకే పరిమితం కాకుండా, సుమారు 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల బదిలీ చుట్టూ తిరుగుతుండటం పెను సంచలనంగా మారింది.
ఆస్తుల మళ్లింపు ఆరోపణలు
శ్రీధర్ వెంబు తన భార్యకు తెలియకుండా జోహో సంస్థలోని అత్యధిక వాటాలను తన సోదరి, ఇతర బంధువుల పేర్లకు మళ్లించారని ప్రమీల అమెరికా కోర్టులో ఆరోపించారు. ఈ వాటాల విలువ సుమారు 15,000 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం, విడాకుల సమయంలో దంపతులకు ఉమ్మడి ఆస్తుల్లో సమాన వాటా ఉంటుంది. అయితే, తన వాటాను దక్కకుండా చేయడానికే శ్రీధర్ వెంబు ఈ రహస్య బదిలీలు చేశారని ఆమె వాదిస్తున్నారు.
శ్రీధర్ వెంబు వివరణ
ఈ ఆరోపణలపై శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన భార్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తాను ఎప్పుడూ ఆస్తుల కోసం పాకులాడలేదని చెప్పుకొచ్చారు. తన ఆర్థిక స్థితిగతులు , కంపెనీ వాటాల బదిలీలు చట్టబద్ధంగానే జరిగాయని, వాటికి తన భార్యతో ఉన్న విడాకుల వివాదానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తన కొడుకు ఆరోగ్యం విషయంలో కూడా తమ మధ్య విభేదాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
As Sridhar Vembu’s counsel, I can add some facts missing from the article. The order was made 1 year ago on an emergency application by his wife, meaning we had little time to response to the outrageously false allegations she made against Sridhar. The judge in California was…
— Christopher C. Melcher (@CA_Divorce) January 8, 2026
రూ. 15,000 కోట్ల చిక్కుముడి
ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్నది జోహో కార్పొరేషన్ హోల్డింగ్ స్ట్రక్చర్. శ్రీధర్ వెంబుకు ప్రత్యక్షంగా కంపెనీలో కేవలం 5 శాతం లోపు వాటా మాత్రమే ఉందని, మిగిలిన 80 శాతం పైగా వాటాను ఆయన సోదరి రాధా వెంబు , సోదరుడు శేఖర్ వెంబు కలిగి ఉన్నారని సమాచారం. ఈ బదిలీలు విడాకుల ప్రక్రియ మొదలైన తర్వాతే జరిగాయా లేక అంతకు ముందే జరిగాయా అన్నది ఇప్పుడు కోర్టులో తేలాల్సిన ప్రధాన అంశం. ఈ నిధుల మళ్లింపు నిజమని తేలితే అది కార్పొరేట్ పాలన పరంగా కూడా పెద్ద వివాదానికి దారితీస్తుంది.
కార్పొరేట్ ప్రభావం
భారతదేశం నుంచి గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా ఎదిగిన జోహో సంస్థ ప్రతిష్టపై ఈ వివాదం ప్రభావం చూపుతోంది. శ్రీధర్ వెంబు గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఒక సింపుల్ లైఫ్ గడుపుతున్న ఇమేజ్‌ను కలిగి ఉన్నారు. అయితే, ఈ 15,000 కోట్ల వివాదం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు కంపెనీ భవిష్యత్తుపై కూడా ఇన్వెస్టర్లలో కొన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియా కోర్టులో ఈ కేసు విచారణ దశలో ఉంది.





















