Cash With Public: జనం జేబుల్లో ₹30.88 కోట్లు ఉన్నాయట, ఆర్‌బీఐ లెక్క చెప్పింది!
ఇదొక రికార్డ్. గతంలో ఎన్నడూ జనం దగ్గర ఈ స్థాయిలో కరెన్సీ నోట్లు లేవు.
Cash With Public: ఓవైపు డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం; మరోవైపు యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నా కూడా జనం చేతుల్లో నలుగుతున్న నగదు (Currency with Public) లెక్క ఏ మాత్రం తగ్గడం లేదు.
ఈ ఏడాది అక్టోబరు 21 నాటికి, దేశ ప్రజల కరాల్లో 30.88 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఇదొక రికార్డ్. గతంలో ఎన్నడూ జనం దగ్గర ఈ స్థాయిలో కరెన్సీ నోట్లు లేవు.
నోట్ల రద్దుకు ఆరేళ్ల తర్వాత..
రూ. 500, రూ. 1000 నోట్ల వల్ల దేశంలో నల్లధనం టన్నుల కొద్దీ పేరుకు పోతోందంటూ, 2016 నవంబర్ 8న, ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. పెద్ద మొత్తాల్లో డబ్బును అక్రమంగా దాయడం ఇక కుదరదని ప్రకటించారు. తక్కువ నగదు చలామణీలో ఉన్న ఆర్థిక వ్యవస్థ (less cash economy) తమ లక్ష్యమన్నారు. ఇప్పుడు, పెద్ద నోట్లు రద్దయిన ఆరేళ్ల తర్వాత, పరిస్థితి విచిత్రంగా ఉంది. లెస్ క్యాష్ ఎకానమీ పత్తా లేకుండా పోయింది. నగదు వినియోగం ఏటికేడు రికార్డ్ స్థాయిలో బలం పెరుగుతూనే ఉంది.
అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. నగదు వినియోగం సహా జనంతో ముడిపడి ఉన్న ప్రతి పనినీ డిజిటలీకరణ చేస్తోంది. ఈ చర్యలు ఫలించి డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు డేటా విడుదల చేస్తూనే ఉంది. ఈ నెల (2022 నవంబర్) 1వ తేదీ నుంచి డిజిటల్ రూపాయిని కూడా ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చింది. ఇన్ని చేస్తున్నా, దేశంలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ పెరుగుతూనే ఉంది. నిజంగా ఈ డబ్బంతా సామాన్యుల చేతుల్లో వినియోగంలో ఉన్నట్లా..? లేక, నల్లరంగు పులుముకుని అసమాన్యుల లాకర్లలో లాక్ అయినట్లా..?
71.84 శాతం వృద్ధి
ఇంకో విచిత్రమైన విషయం చూద్దాం. నవంబర్ 4, 2016న దేశంలో చలామణీలో ఉన్న డబ్బు ₹ 17.7 లక్షల కోట్లు. ఇప్పుడు ఉన్నది ₹ 30.88 లక్షల కోట్లు. ఈ లెక్కన, ఈ ఆరేళ్లలో దేశంలో ఉన్న డబ్బు 71.84 శాతం పెరిగింది. RBI విడుదల చేసిన ఈ గణాంకాల్లోనే ఈ లెక్కలు ఉన్నాయి.
ప్రజలు లావాదేవీలు జరపడానికి, లావాదేవీలను పరిష్కరించుకోవడానికి, వస్తువులు & సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించే నోట్లు, నాణేల విలువను దేశంలో ఉన్న కరెన్సీ (Currency With Public - CWP) విలువను గణిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 21 నాటికి ఇది ₹ 30.88 లక్షల కోట్లుగా లెక్క తేలింది.
"ఇటీవలి సంవత్సరాల్లో డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, భారత్ సహా అన్ని దేశాల్లో 'చలామణీలో ఉన్న నగదు' (Currency In Circulation - CIC) విలువ & వాల్యూమ్ పెరుగుతూనే ఉంది. మొత్తం ఆర్థిక వృద్ధికి అనుగుణంగా.. GDP/ చెలామణిలో ఉన్న నగదు నిష్పత్తి కూడా కూడా పెరిగింది" అని RBI పేర్కొంది.
నాలుగు రోజుల క్రితం SBI విడుదల చేసిన డేటాలో... దీపావళి వారంలో చెలామణిలో ఉన్న నగదు (CIC) ₹ 7,600 కోట్ల మేర తగ్గిందని, దాదాపు రెండు దశాబ్దాలలో ఇదే మొదటి తగ్గుదల అని ప్రకటించింది.