Credit Card bill: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాల్సిన తేదీ దాటిందా? RBI కొత్త రూల్‌తో నో వర్రీస్!
వినియోగదారుల మీద అదనపు భారం పడకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త గెడెన్స్ ఇచ్చింది.
Credit Card bill: మన దేశంలో క్రెడిట్ కార్డ్‌ల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. క్రెడిట్ కార్డ్‌ల జారీకి అడ్డు- అదుపు లేకపోవడంతో బ్యాంకులు విచ్చలవిడిగా ఇస్తున్నాయి, జనం వాటిని తెగ వాడేస్తున్నారు. గత కొన్ని నెలలుగా, క్రెడిట్ కార్డుల ద్వారా చేస్తున్న ఖర్చులు స్థిరంగా రూ.1 లక్ష కోట్లను దాటుతూ వస్తున్నాయంటే, జనం ఏ రేంజ్‌లో కార్డుల్ని అరగదీస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆహారం, పానీయాలు, దుస్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విందులు, వినోదాలు, విహార యాత్రలు... ఇలా ఏ ఖర్చు కోసమైనా జేబులోంచి క్రెడిట్ కార్డ్ తీస్తున్నారు.
వేల కోట్ల ఔట్‌స్టాండింగ్
PoS (పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినల్ ద్వారా క్రెడిట్ కార్డ్ వ్యయాలు ఈ ఏడాది ఏప్రిల్‌లోని రూ.29,988 కోట్ల నుంచి ఆగస్టులో రూ.32,383 కోట్లకు పెరిగాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ వ్యయాలు కూడా ఏప్రిల్‌లోని రూ.51,375 కోట్ల నుంచి ఆగస్టులో రూ.55,264 కోట్లకు పెరిగాయి. RBI డేటాను విశ్లేషిస్తే... FY17- FY22 మధ్య 16 శాతం CAGR వద్ద క్రెడిట్ కార్డ్‌ల ఔట్‌స్టాండింగ్ (కట్టాల్సిన మొత్తం) పెరిగింది.
ఏదైనా అవసరం కోసం క్రెడిట్ కార్డ్ వాడితే, ఫైన్ లేకుండా 40 రోజుల్లోగా సదరు కంపెనీ ఆ డబ్బును కట్టాలి. మన చుట్టూ.. బిల్ సక్రమంగా కట్టేవాళ్లూ ఉన్నారు, ఎగ్గొట్టేవాళ్లూ ఉన్నారు. సక్రమంగా కట్టేవాళ్ళు కూడా ఒక్కోసారి బిల్ కట్టే చివరి తేదీని మర్చిపోవచ్చు. మరేదైనా కారణం వల్ల కూడా చెల్లింపులను ఆలస్యం చేయవచ్చు. బిల్ కట్టేందుకు సదరు బ్యాంక్ ఇచ్చిన గడువు దాటి పోవచ్చు. అలాంటి సందర్భాల్లో.. లేట్ ఫైన్, వడ్డీ వంటి అదన బాదుడు తప్పదు. దీనికి తోడు సిబిల్ స్కోరు కూడా తగ్గుతుంది.
RBI కొత్త రూల్
ఔట్‌స్టాండింగ్ రీపే చేయాల్సిన గడువు తేదీ దాటితే ఇక అంతే సంగతులా, మోత తప్పించుకునే మార్గమే లేదా అంటే.. ఒక వెసులుబాటు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల మీద అదనపు భారం పడకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త గెడెన్స్ ఇచ్చింది. ఆ మార్గదర్శకాల ప్రకారం, డ్యూ డేట్ దాటిన తర్వాత కూడా ఎలాంటి అదనపు బాదుడు లేకుండా హ్యాపీగా బిల్ కట్టుకోవచ్చు. అయితే ఈ వెసులుబాటును వినియోగించుకోవడానికి కేవలం మూడు రోజుల వరకు మాత్రమే అనుమతి ఉంది.
క్రెడిట్ కార్డ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన RBI జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం... వినియోగదారుడు బకాయి పడిన రోజుల (past Due) గురించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు సమాచారం ఇవ్వాలి. పాస్ట్ డ్యూ మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే కార్డుదారుల మీద ఛార్జీల వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే... ఔట్‌స్టాండింగ్ కట్టాల్సిన తేదీకి మూడు రోజుల తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతేనే ఆలస్య రుసుము, వడ్డీ వంటి ఛార్జీలను విధించాలి. కొత్త నిబంధన ప్రకారం... లేట్ ఫీ ఛార్జీలను క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న గడువు తేదీ నుంచి లెక్కిస్తారు. ఈ ఛార్జీలను కూడా కేవలం ఔట్‌స్టాండింగ్ అమౌంట్ మీద మాత్రమే వేయాల్సి ఉంటుంది తప్పితే, మొత్తం బకాయి మీద వసూలు చేయకూడదని RBI స్పష్టం చేసింది.