Sahara Refund: సహారా బాధితులకు సూపర్ న్యూస్, మీ డబ్బులు 45 రోజుల్లో మీ చేతికివస్తాయోచ్!
కేంద్ర ప్రభుత్వం సహారా రిఫండ్ పోర్టల్‌ను ప్రారంభించడంతో, డబ్బును తిరిగి ఇచ్చే ప్రాసెస్ ప్రారంభమైంది.
CRCS Sahara India Refund Portal: కష్టపడి సంపాదించిన డబ్బును సహారా ఇండియాలో పెట్టి, దానిని తిరిగి పొందడానికి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న సహారా బాధితులకు గుడ్‌న్యూస్. డిపాజిటర్లందరికీ త్వరలోనే డబ్బును తిరిగి వస్తుంది. కేంద్ర మంత్రి అమిత్ షా CRCS సహారా రిఫండ్ పోర్టల్ (CRCS Sahara Refund Portal) లాంచ్ చేశారు. సహారా గ్రూప్ కో-ఆపరేటివ్ సొసైటీల్లో డిపాజిట్స్ చేసిన కోట్లాది మంది సొమ్ము ఈ వెబ్‌సైట్ ద్వారా 45 రోజుల్లో తిరిగి వస్తుంది.
సహారా బ్రాండ్‌ను నమ్మి, సహారా కో-ఆపరేటివ్ సొసైటీల్లో డబ్బు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదార్ల డబ్బు చాలా సంవత్సరాలుగా త్రిశంకు స్వర్గంలో ఉంది. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం సహారా రిఫండ్ పోర్టల్‌ను ప్రారంభించడంతో, డబ్బును తిరిగి ఇచ్చే ప్రాసెస్ ప్రారంభమైంది.
కొంప ముంచిన నాలుగు కో-ఆపరేటివ్ సొసైటీలు
సహారా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే నాలుగు సహకార సంఘాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు డబ్బులు డిపాజిట్ చేశారు.
సహారా-సెబీ రిఫండ్ అకౌంట్ నుంచి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు (CRCS) రూ. 5,000 కోట్లను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 29న ఆదేశించింది. ఆ తర్వాత, నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది పెట్టుబడిదారుల సొమ్మును 9 నెలల్లో వాపసు చేస్తామని అదే రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనకు అనుగుణంగా ఇవాళ (18 జులై 2023) పోర్టల్ ప్రారంభమైంది.
తొలి దశలో రూ. 10 వేల వరకు రిఫండ్
సహారా పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత, తొలి దశలో, డిపాజిటర్లకు రూ. 10,000 వరకు రిఫండ్ వస్తుంది. అంతకుమించి ఇన్వెస్ట్ చేసినవాళ్లు ఉంటే, తర్వాతి దశల్లో రిఫండ్ మొత్తాన్ని క్రమంగా పెంచుతారు. 5,000 కోట్ల రూపాయలతో ఒక కోటి 7 లక్షల మంది డిపాజిటర్లు తమ డబ్బు తిరిగి పొందగలుగుతారని అమిత్ షా చెప్పారు. మొత్తం, రూ. 10 వేల వరకు రిఫండ్ పొందడానికి 4 కోట్ల మందికి అర్హత ఉంది.
డిపాజిటర్లకు తొలి దశలో రూ. 5,000 కోట్లు తిరిగి ఇచ్చిన తర్వాత, మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరుతుందని అమిత్ షా చెప్పారు. తద్వారా ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన పెట్టుబడిదార్లకు మిగిలిన డబ్బును తిరిగి చెల్లించవచ్చన్నారు. పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయని, డిపాజిటర్లకు అవి సాయం చేస్తాయని అమిత్ షా చెప్పారు.
రిఫండ్ ఎలా పొందాలి?
సహారా డిపాజిటర్లు రిఫండ్ పొందడానికి https://cooperation.gov.in లింక్ ద్వారా సహారా రిఫండ్ పోర్టల్‌లోకి వెళ్లాలి
పెట్టుబడిదారు ముందుగా సహారా రిఫండ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి
సహారా రిఫండ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, రిఫండ్ పొందడానికి, పెట్టుబడిదారుకి తప్పనిసరిగా మొబైల్ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఉండాలి
ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కూడా ఉండాలి
బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్‌ను ధృవీకరించిన తర్వాత, డిపాజిట్లకు డబ్బు తిరిగి వస్తుంది
మరో ఆసక్తికర కథనం: ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్ కేటగిరీ వేరు, అందరిలా వీళ్ల ఐటీఆర్ ఫైల్ చేయలేరు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial