Diwali Gifts: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా కార్లు, బైకులు - జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి
Car and Bike Gifts To Employees: ఉద్యోగులను ప్రోత్సహించేందుకు మారుతి సుజుకీ నుంచి మెర్సిడెస్ బెంజ్ వరకు చెన్నై కంపెనీ అందించింది. ఈ కంపెనీ గతంలోనూ ఇలాంటి బహుమతులు ఇచ్చింది.

Team Detailing Solutions Gifts Its Employees With Cars and Bikes: కంపెనీ అనే వాహనానికి యాజమాన్యం - ఉద్యోగులు చక్రాల్లాంటి వాళ్లు. ఈ రెండు చక్రాల్లో ఒకటి సరిగ్గా పని చేయకపోయినా బిజినెస్ బండి నడవదు. ఈ పోటీ ప్రపంచంలో విజయం సాధించడమే కాదు, నిలదొక్కుకోవడం కూడా కష్టం అవుతుంది. గత కొన్నేళ్లుగా, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు, ఖర్చుల తగ్గింపు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లపై నిషేధం వంటి మాటలు వింటూనే ఉన్నాం. ఇలాంటి వాతావరణంలో కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాయి. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందజేస్తున్నాయి. చెన్నైకి చెందిన ఓ కంపెనీకి కూడా అలాంటిదే. దీపావళి కానుకగా తన ఉద్యోగులకు కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. అంతేకాదు, వివాహం సందర్భంగా చేసే సాయాన్ని కూడా పెంచింది. పండుగల సీజన్‌లో కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.
బహుమతులుగా 28 కార్లు, 29 బైకులు
2005లో, చెన్నైలో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ (Team Detailing Solutions) కంపెనీ, ఈ ఏడాది దీపావళి కానుకగా (Diwali 2024 Gifts) తన ఉద్యోగులకు 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. కార్లలో.. మారుతి సుజుకి (Maruti Suzuki), హ్యుందాయ్ (Hyundai)తో పాటు మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) వంటి లగ్జరీ మోడల్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులు మతాబుల్లా వెలుగుతున్న ముఖాలతో వెహికల్ తాళాలు అందుకున్నారు. దీపావళి కాంతి వారి కళ్లలో పండుగ ముందే కనిపించింది.
బహుమతులు ఇవ్వడం వల్ల ఉద్యోగుల్లో మనోధైర్యం పెరుగుతుందని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని మరింత కష్టపడి పని చేస్తారని, ఉత్పాదకత పెంచడంపై దృష్టి సారిస్తారని కంపెనీ చెబుతోంది. టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ & డిటైలింగ్ సర్వీసులు అందిస్తుంది.
ఉద్యోగుల శ్రమకు తగిన గౌరవం
"ఉద్యోగులను నిరంతరం ప్రోత్సహించాలి. అలాగే వారి శ్రమను గౌరవించాలి. ప్రతి ఉద్యోగికి అతని పనితీరు, సంవత్సరాల కష్టాన్ని బట్టి బహుమతులు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. మా ఉద్యోగులు నిబద్ధత & అంకితభావంతో కంపెనీ వృద్ధికి సహకరించారు. వారిని చూసి మేము గర్విస్తున్నాం" - టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ ఎండీ శ్రీధర్ కణ్ణన్ (Sridhar Kannan)
ఉద్యోగులు ఇప్పుడు మరింత ఉత్సాహంతో పని చేస్తారని ఆశిస్తున్నట్లు శ్రీధర్ కణ్ణన్ చెప్పారు. గతంలో కూడా, దీపావళి బహుమతిగా, తమ ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2022 సంవత్సరంలో, ఇద్దరు సీనియర్ సహోద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. వాహనాల సంఖ్య ఏటా పెరుగుతూ, ఈ సంవత్సరం 28 కార్లు & 29 బైక్‌లకు చేరినట్లు చెప్పారు.
"ఉద్యోగుల కలలు నెరవేర్చడానికి మేము సాయం చేస్తున్నాం. ఎవరైనా, తనకు లభించిన కారు కంటే ఖరీదైన కారు కావాలనుకుంటే, అదనపు డబ్బు చెల్లించి కోరుకున్న కార్ తీసుకోవచ్చు" - శ్రీధర్ కణ్ణన్
పెళ్లి సమయంలో రూ.లక్ష సాయం
టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ కంపెనీ, తన ఉద్యోగుల పెళ్లి ఖర్చులకు కూడా డబ్బు అందిస్తోంది. ఇప్పటివరకు, ఉద్యోగి వివాహ సమయంలో 50 వేల రూపాయలు సాయం చేసేది. ఈ ఏడాది దీపావళి నుంచి దానిని లక్ష రూపాయలకు పెంచింది. కంపెనీలో గొప్ప వర్క్ కల్చర్‌ను పెంపొందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: ఇంధనం నింపేటప్పుడు '0' మాత్రమే చూస్తే చాలదు, దీనిని పట్టించుకోకపోతే గుండు కొట్టేస్తారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

