Union Budget 2024: ఈవీల తయారీపై కేంద్ర బడ్జెట్‌లో గుడ్ న్యూస్! వాటి ధరలు తగ్గుతాయా?
Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ లో ఆటోమొబైల్ పరిశ్రమ గురించి లేదా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేమ్ 3 పథకం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ, ఈవీలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది.
Auto Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగం అనంతరం ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినట్లుగా సంకేతాలు వచ్చాయి. నిజానికి తాము ఈవీల పట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో నేరుగా ఏ ప్రకటనా చేయలేదు. ఆటోమొబైల్ పరిశ్రమ గురించి లేదా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేమ్ 3 గురించి కూడా ప్రస్తావించలేదు. కానీ, ప్రభుత్వం ఈవీలు స్థానికంగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పరోక్షంగా ప్రకటించింది.
అందులో భాగంగా ఇది కస్టమ్ డ్యూటీల నుండి లిథియం, కాపర్, కోబాల్ట్‌లను మినహాయించింది. ఫలితంగా దేశీయంగా లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ రంగం మరింత ఊపందుకోనుందని అంటున్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలలో లిథియంతో పాటు కోబాల్ట్ వంటి కీలకమైన మూలకాలను ఉపయోగిస్తారు. తాజాగా వీటిపై సుంకాల మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారతదేశంలో ఈవీల తయారీకి మరింత సానుకూలత ఏర్పడిందని భావిస్తున్నారు.
ఇప్పటికే భారత ప్రభుత్వం 2030 నాటికి మొత్తం వాహన అమ్మకాల్లో 30 శాతం ఈవీలు ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశంలో 2015లో ఫేమ్ అనే స్కీమ్ (FAME - Faster Adoption and Manufacturing of Hybrid and Electric vehicles) ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో ఈవీలు.. ముఖ్యంగా టూ వీలర్ ఈవీల ఉత్పత్తి, వాడకాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే, ప్రస్తుతం ఉన్న ఫేమ్ - 2కు గానూ ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌లో రూ.2,671 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. అంతకుముందు బడ్జెట్ లో దీనికి కేటాయింపులు ఏకంగా రూ.5,172 చేశారు. ఇప్పుడు సగానికి తగ్గించారు. 2020 బడ్జెట్ లో ప్రభుత్వం ఫేమ్ 2 కోసం రూ.కోట్లు కేటాయించింది. 2021 లో కేటాయింపు తగ్గించి రూ.318 మాత్రమే కేటాయించారు. 2022 లో ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించింది. 2023లో దాదాపు రూ.2,900 కోట్లకు పెరిగింది.
ఫేమ్ పథకం ద్వారా సబ్సిడీలు ఇవ్వడం కారణంగా ముఖ్యంగా ఈవీ టూ వీలర్ల విక్రయాలు బాగా పెరిగాయి. ఇప్పుడు సబ్సిడీల తగ్గింపు చేయడం ముఖ్యంగా టూ వీలర్ కేటగిరీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈవీ వాహనాలకు, సాధారణ కార్ల ధరల మధ్య ధరల అంతరం భారీగా ఉండడానికి కారణం.. బ్యాటరీ తయారీ ధర అనే అభిప్రాయం ఉంది. అది ఈవీ తయారీదారులకు సవాలుగా మిగిలిపోయింది. అయితే, తాజా బడ్జెట్‌లో బ్యాటరీ కాంపొనెంట్స్ పై సుంకాలు తగ్గించడంతో ఈవీల తయారీని పెరుగుతుందని ఆశిస్తున్నారు.