Union Budget 2022 Telangana : ఆశల్లేవన్న కేసీఆర్ అంచనాలను నిజం చేసిన నిర్మలమ్మ .. బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే !
బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకమైన ప్రాజెక్టులు, నిధులేమీ దక్కలేదు. తమకు కావాల్సిన వాటిని వివరిస్తూ కేటీఆర్, హరీష్ రాసిన లేఖలను కేంద్ర ఆర్థిక మంత్రి పట్టించుకోలేదు.
![Union Budget 2022 Telangana : ఆశల్లేవన్న కేసీఆర్ అంచనాలను నిజం చేసిన నిర్మలమ్మ .. బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే ! There are no special projects or funds for Telangana in the budget. The Union Finance Minister ignored the letters written by KTR and Harish explaining what they wanted. Union Budget 2022 Telangana : ఆశల్లేవన్న కేసీఆర్ అంచనాలను నిజం చేసిన నిర్మలమ్మ .. బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/a9282c8b6d4a6ad29e4cd048e6112ac0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
" బడ్జెట్‌లో ఎలాంటి ఆశల్లేవు .." అని పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించేటప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంచనాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మాత్రం వమ్ము చేయలేదు. తెలంగాణ ఆశలు పెట్టుకున్న ఏ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌కు చాలా రోజుల ముందు నుంచే మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు, నిధుల గురించి గుర్తుచేస్తూ లేఖలు రాశారు. అయితే వారు చేసిన విజ్ఞప్తులలో ఏ ఒక్క దానికీ కేటాయింపులు జరగలేదు.
కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం , మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ, జాతీయ రహదారులకు నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద నిధుల పెంపు ఐటీఐఆర్‌తో పాటు బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు అమలు చేయాలని కోరారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న మాస్ రోడ్ ట్రాన్సిట్ సిస్టంకు రూ.450కోట్లు, ఎస్సారెస్పీ రెండోదశకు రూ.3450కోట్లు, మెట్రో నియో ప్రాజెక్టు వరంగల్ కు రూ.184కోట్లు, ఎస్టీపీ పనుల కోసం రూ.2895కోట్లు, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం కోసం రూ.800కోట్లు మొత్తం రూ.7800కోట్లు ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
చేనేత జౌళి రంగానికి సంబంధించి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు రూ.897.92కోట్లు, సిరిసిల్లలో మెగా పవర్ లూం క్లస్టర్ మంజూరు చేసి కేంద్రం 49.84కోట్లు, 5 క్లస్టర్ల ఏర్పాటుకు రూ.20.82కోట్లు, మరో 8 కస్లర్టర్లకు 7.20కోట్లు, పవర్ లూమ్ అప్ గ్రేడ్ కోసం 13.88కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ అలాగే తెలంగాణ ఫార్మాసిటీ, పారిశ్రామిక కారిడార్లకు రూ.14000కోట్లు ఇవ్వాలన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన మేరకు రూ.24,205కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. విభజన చట్టం ప్రకారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. పెండింగ్ లో రైల్వే లైన్లతో పాటు మరో 25 లైన్ల మంజూరు చేయాలని కోరారు. కానీ ఏ ప్రతిపాదనకూ మోక్షం లభించలేదు.
గిరిజన యూనివర్శిటికీ రూ. నలభై కోట్లుకేటాయించారు. కానీ ఈ చిన్న మొత్తంతో యూనివర్శిటీ ఉనికిలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలు.. పన్నుల వాటాల్లో చట్ట బద్ధంగా రావాల్సినవి మాత్రమే తెలంగాణకు వస్తాయి. ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం కానీ.. కేంద్ర ప్రాజెక్టు కానీ తెలంగాణకు దక్కలేదు. అయితే గత ఏడేళ్లలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిధులు కేటాయించిది లేదు. ఇప్పుడూ కేటాయించలేదంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)