Interim Budget 2024: 'దేశంలో 9 - 14 బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్' - కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, కేంద్ర బడ్జెట్ లో మహిళలకు గుడ్ న్యూస్
Budget 2024: దేశంలో 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్స్ వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తన బడ్జెట్ ప్రసంగంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు.
![Interim Budget 2024: 'దేశంలో 9 - 14 బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్' - కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, కేంద్ర బడ్జెట్ లో మహిళలకు గుడ్ న్యూస్ nirmala sitharaman announced cancer vacination for 9 to 14 years girl child in budget 2024 speech Interim Budget 2024: 'దేశంలో 9 - 14 బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్' - కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, కేంద్ర బడ్జెట్ లో మహిళలకు గుడ్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/1c74318f5f071111e1855ace6dd33e091706770798241876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nirmala Sitharaman Budget 2024 Highlights: దేశంలో 9 నుంచి 14 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer) బారిన పడకుండా వారికి వ్యాక్సినేషన్ చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి పెద్దగా కీలక పథకాల జోలికి పోకుండా.. మౌలిక సదుపాయాల కల్పనపైనే దృష్టి సారించారు. వైద్య రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు సహా.. మహిళల కోసం కూడా కొన్ని ప్రకటించారు. దేశంలో మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, వాటి వల్ల వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని వివరించారు. 'లఖ్పతి దీదీ' పథకం కింద దేశంలో కోటి మంది లబ్ధి పొందుతున్నారు. ఈ టార్గెట్ ను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచి 3 కోట్ల మంది మిలియనీర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల పేర్కొన్నారు. పీఎం ఆవాస్ కింద మహిళలకు 70 శాతం ఇళ్లను అందించామని అన్నారు.
నిర్మలమ్మ ఏం చెప్పారంటే.?
- ప్రజలకు సేవ చేయాలన్న యువత ఆశయాలకు అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తెస్తామని నిర్మల సీతారామన్ చెప్పారు. దీన్ని పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని నియమిస్తామని అన్నారు.
- 9 నుంచి 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్) బారిన పడకుండా వ్యాక్సినేషన్ పై దృష్టి సారిస్తామని చెప్పారు. కాగా, దేశంలో ఎక్కువగా సోకే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ 15 - 20 శాతంతో మూడో స్థానంలో ఉంది. 15 - 23 ఏళ్ల లోపు మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.
- సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు మన దేశంలోనే ఉండడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం ఏటా దేశంలో 80 వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 35 వేల మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నట్లు తేలింది.
- పిల్లల్లో రోగ నిరోధకత పెంచడం కోసం తీసుకొచ్చిన 'మిషన్ ఇంధ్రధనుస్సు'ను నిర్వహించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన 'యు విన్' ప్లాట్ ఫాం దేశవ్యాప్తంగా విస్తరిస్తామని అన్నారు. అలాగే, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తోన్న పథకాలను 'సమగ్ర ప్రోగ్రామ్' కిందకు తీసుకొస్తామని చెప్పారు.
- 'ఆయుష్మాన్ భారత్' ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు విస్తరిస్తామని వెల్లడించారు.
- సాక్షమ్ అంగన్వాడీ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. చిన్నారుల ఎదుగుదల కోసం పోషకాహార పంపిణీని మెరుగ్గా అందించేందుకు 'పోషణ్ 2.0' కార్యక్రమాన్ని అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)