Budget 2025: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరుగుతాయా, కస్టమ్ డ్యూటీపై కేంద్రం ఆలోచన ఏంటి?
Gold Prices: ఈ బడ్జెట్‌లో, గోల్డ్‌పై కస్టమ్ డ్యూటీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, బంగారం ధరలు కళ్లెం వదిలిన గుర్రంలా పరుగులు తీయడం ప్రారంభిస్తాయి.

Budget 2025 Decision On Customs Duty On Gold: బంగారం ధరలపై పన్నులకు సంబంధించి, కేంద్ర బడ్జెట్ 2025లో (Union Budget 2025) పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 01న సమర్పించనున్న ఈ బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) బంగారంపై కస్టమ్ డ్యూటీని పెంచవచ్చు. వాస్తవానికి, గతేడాది కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు తగ్గాయి. ఈసారి కస్టమ్ డ్యూటీ (Custom Duty)ని పెంచితే బంగారం దిగుమతుల వ్యయం పెరిగి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
బంగారం ధరలు
మన దేశంలో పుత్తడి ధర నిరంతరం పెరుగుతూనే ఉంది, ఇటీవల దిల్లీ (Gold Price In Delhi)లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24K) రేటు రూ. 82,000కి చేరుకుంది. ముఖ్యంగా, బడ్జెట్ తర్వాత, రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర దిల్లీలో రూ. 81,300గా ఉంది.
రూ.85,000 నుంచి రూ.90,000 ధర
భౌగోళిక & రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, 10 గ్రాముల బంగారం ధర (24K) రూ. 85,000 నుంచి రూ. 90,000 వరకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. తక్కువ వడ్డీ రేట్లు & ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు బంగారానికి డిమాండ్‌ను పెంచడమే ఈ అంచనాకు కారణం. ఇది కాకుండా, ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలకు ఆజ్యం పోస్తోంది.
ఈరోజు బంగారం ధర ఎంత ?
MCXలో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు మంగళవారం (28 జనవరి 2025) నాడు 10 గ్రాములకు రూ. 80,355 వద్ద ప్రారంభమయ్యాయి. ఇది, సోమవారం కంటే 0.24 శాతం లేదా రూ. 195 ఎక్కువ. మార్చి నెల వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు కిలోకు రూ. 90,223 వద్ద స్థిరంగా ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 80,355 వరకు ఉంటుందని అంచనా.
బంగారంపై బడ్జెట్ 2025 ప్రభావం
2025 బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదే జరిగితే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. గతేడాది బడ్జెట్‌లో కోత విధించడంతో అక్రమ దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు, మళ్లీ సుంకం పెంచితే సీన్ రివర్స్ కావచ్చు.
ఇప్పుడు బంగారం కొనవచ్చా?
బంగారం కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బడ్జెట్ తర్వాత నగల షాప్‌లకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, మార్కెట్ ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి.
స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడులపై 'abp దేశం' ఎవరికీ సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.
మరో ఆసక్తికర కథనం: మనం ఎక్కువ పన్ను చెల్లిస్తున్న వస్తువుల లిస్ట్ ఇదిగో - వీటిని కొన్నప్పుడల్లా మోత మోగిపోద్ది





















