Anant Ambani Receives Global Humanitarian Award: అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు, మొదటి ఆసియా వ్యక్తిగా గుర్తింపు
Global Humanitarian Award | వన్యప్రాణి సంరక్షణలో చేసిన కృషికి అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడు, తొలి ఆసియా గ్రహీతగా గుర్తింపు పొందారు.

Anant Ambani Receives Global Humanitarian Award | వేలాది వన్యప్రాణుల్ని సంరక్షిస్తున్న వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీకి అరుదైన గౌరవం లభించింది. డిసెంబర్ 8న అనంత్ అంబానీకి అమెరికాలోని వాషింగ్టన్, DCలో గ్లోబల్ హ్యుమన్ సొసైటీ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందజేసింది. వన్యప్రాణుల పరిరక్షణ, సైన్స్ ఆధారిత సంరక్షణ ప్రయత్నాలకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న వారిలో ఆయన అత్యంత పిన్న వయస్కుడు, ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియా వ్యక్తి కూడా అనంత్ అంబానీ. ఈ కార్యక్రమంలో కన్జర్వేషన్ నాయకులు, దాని రూపకర్తలు, వన్యప్రాణుల నిపుణులు పాల్గొన్నారు. భారతదేశంలో పెద్ద ఎత్తున జంతువుల పునరావాసం, సంరక్షణ వ్యవస్థలను నిర్మించడంలో అంబానీ పాత్రను అంతర్జాతీయంగా గుర్తించారు.
సంరక్షణ పనులకు ప్రపంచ గుర్తింపు
గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును జంతు సంక్షేమ రంగంలో అత్యుత్తమ గుర్తింపుగా పరిగణిస్తారు. గతంలో ఈ గౌరవాన్ని అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్ కెన్నెడీ, బిల్ క్లింటన్ పొందారు. అలాగే నటీనటులు షిర్లీ మెక్‌లైన్, జాన్ వేన్, బెట్టి వైట్ వంటి ప్రముఖులు ఈ అవార్డు అందుకున్నారు. గ్లోబల్ హ్యుమేన్ సొసైటీ ప్రకారం, అధునాతన వన్యప్రాణుల పునరావాసం, జాతుల పరిరక్షణ, దీర్ఘకాలిక పునరుద్ధరణ కార్యక్రమాలకు ఒక నమూనాగా వంతారాను స్థాపించినందుకు అనంత్ అంబానీకి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
View this post on Instagram
గ్లోబల్ హ్యుమన్ నాయకత్వాన్ని ప్రశంసించింది
ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యుమేన్ సొసైటీ ప్రెసిడెంట్, CEO డాక్టర్ రాబిన్ గాంజెర్ట్ మాట్లాడుతూ, “వంతారాకు గ్లోబల్ హ్యుమేన్ సర్టిఫైడ్ గుర్తింపు లభించడం, సంరక్షణలో అత్యుత్తమ ప్రతిభను, ప్రతి జంతువుకు వైద్యం, పోషణ అందించాలనే గొప్ప అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ విషయంలో అనంత్ అంబానీ కంటే గొప్ప ఛాంపియన్ ఎవరు లేరు. ఆయన నాయకత్వం దయ, కరుణకు కొత్త ప్రపంచ ప్రమాణాలు నెలకొల్పింది” అని అన్నారు.
ఆమె మాట్లాడుతూ “వంతారా ప్రపంచంలో ఎక్కడైనా జంతు సంక్షేమం పట్ల అత్యంత అసాధారణమైన నిబద్ధతను కలిగి ఉన్నారు. ఇది కేవలం రెస్క్యూ సెంటర్ మాత్రమే కాదు, వైద్యం కూడా అందించే అభయారణ్యం. వంతారా వెనుక ఉన్న ఆశయం, పరిధి, ఆధునిక జంతు సంక్షేమం ఎలా ఉండాలనేదానికి ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయి” అన్నారు.
గుర్తింపుపై అంబానీ స్పందన
ఈ అవార్డు సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రాముఖ్యతను మరింత బలపరుస్తుందని అనంత్ అంబానీ అన్నారు. “ఈ గౌరవం ఇచ్చినందుకు గ్లోబల్ హ్యుమేన్ సొసైటీకి నేను కృతజ్ఞతలు. నా దృష్టిలో ఇది ఒక శాశ్వత సూత్రాన్ని పునరుద్ఘాటిస్తుంది. అదే సర్వ భూత హితం, అంటే అన్ని జీవుల శ్రేయస్సు” అని అన్నారు.
“జంతువులు మనకు సమతుల్యత, వినయం, నమ్మకాన్ని నేర్పుతాయి. వంతారా ద్వారా, ప్రతి జీవికి గౌరవం, సంరక్షణ, ఆశను అందించడమే మా లక్ష్యం. సేవా స్ఫూర్తితో మేం నడుచుకుంటాము. సంరక్షణ రేపటి కోసం కాదు; ఇది మనం ఈరోజు పాటించాల్సిన ధర్మం” అని అనంత్ అన్నారు.
ధృవీకరణ, భవిష్యత్ లక్ష్యాలు
గుర్తింపు పొందే ముందు, వంతారా పోషకాహారం, పశువైద్య సంరక్షణ, పర్యావరణ నాణ్యత, సహజ ప్రవర్తనకు అవకాశాలు వంటి సంక్షేమం అంశాలను కవర్ చేస్తూ విస్తృతమైన స్వతంత్ర ఆడిట్ ఎదుర్కొంది. ధృవీకరణ ప్రక్రియలో జూవాలజీ, పశువైద్య శాస్త్రం, జంతు ప్రవర్తనలో నిపుణులు పాల్గొన్నారు. వంతారా ఆన్-సైట్ సంరక్షణను అంతరించిపోతున్న, దాదాపు అంతరించిపోయిన జాతుల పునరుద్ధరణ కార్యక్రమాలతో సహా పర్యావరణ వ్యవస్థ స్థాయి సంరక్షణతో మిళితం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో బ్రూక్‌ఫీల్డ్ జూ చికాగో, కొలంబస్ జూ, కొలోసల్ బయోసైన్సెస్, పలువురు భారతీయ వన్యప్రాణుల పరిశోధకులు సహా ప్రపంచ సంరక్షణ సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఈ అవార్డు అందుకున్న వారి జాబితాలో అనంత్ అంబానీ చేరడం ద్వారా జంతు సంక్షేమ విధానం, సంరక్షణ పద్ధతులపై ప్రభావం చూపిన ప్రపంచంలో అరుదైన ప్రముఖులో ఆయన ఒకరిగా నిలిచారు.






















