Anant Ambani: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో వేడుకలు, ఎన్ని ప్రత్యేకతలో!
Pre Wedding Celebrations: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఖరీదైన క్రూయిజ్ షిప్‌లో నిర్వహించనున్నారు. సముద్రంలో 3 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Anant Ambani Second Prewedding Celebrations: ఆసియాలోనే సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి సందడి మొదలైంది. చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్‌ల(Radhika Merchant) వివాహం ఈ ఏడాది జులైలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో గుజరాత్ లోని జూమ్ నగర్ లో అత్యంత ఘనంగా 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. దేశంలోని రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు సహా విదేశాల నుంచి సైతం ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 1200 మంది అతిథుల సమక్షంలో వేడుకలు వైభవంగా జరిగాయి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్, దిగ్గజ క్రికెటర్లు, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ వేడుకల్లో సందడి చేశారు. అప్పట్లో ఈ వేడుకల కోసం ముకేష్ అంబానీ - నీతా అంబానీ దంపతులు ఏకంగా రూ.1259 కోట్లు వెచ్చించినట్లు పోర్బ్స్ నివేదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి అనంత్ అంబానీ జంట సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు.
ఇన్విటేషన్ కార్డ్ వైరల్
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు వైరల్ అవుతోంది. ఇటలీలోని లగ్జరీ క్రూయిజ్ లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఏర్పాటు చేశారు. ఈ క్రూయిజ్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ కు ప్రయాణిస్తుంది. ఆ సమయంలో అంబానీ కుటుంబం సముద్రం మధ్యంలో వేడుకలు జరుపుకొంటారు. ఈ నెల 29 నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమై జూన్ 1 వరకూ కొనసాగుతాయని వైరల్ అవుతోన్న కార్డు ప్రకారం తెలుస్తోంది. అతిథులంతా ఇటలీ సిసిలీలో పలెర్మోలో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరవ్వాలి. 29న క్రూయిజ్ లోకి వెళ్లిన అనంతరం వెల్ కమ్ లంచ్ థీమ్ తో వేడుకలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
3 రోజులు సముద్రంలో..
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఓ భారీ లగ్జరీ నౌకలో (క్రూయిజ్ షిప్) నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబంతో పాటు పలువురు ప్రముఖులు తరలివెళ్లినట్లు ఆంగ్ల మీడియా వెల్లడించింది. భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు వెళ్లారు. సినీ ప్రముఖులు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్, ఆలియా, రణబీర్ కపూర్ ప్రముఖులతో సహా ప్రపంచంలోని ప్రముఖులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. భారీ క్రూయిజ్ షిప్ లో 3 రోజులు వేడుకలు నిర్వహించనున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి. ఈసారి 800 మంది అతిథులు హాజరు కానున్నట్లు సమాచారం.
ఈ క్రూయిజ్ షిప్ ఈ నెల 28న సాయంత్రం లేదా 29న ఉదయం బయలుదేరుతుందని సమాచారం. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్తుందని.. సముద్రంలో 3 రోజులు ఘనంగా సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 4,380 కిలోమీటర్ల మేర ఈ షిప్ ప్రయాణించనుందని సమాచారం. దాదాపు 600 మంది సిబ్బంది అతిథులకు సేవలందించనున్నారు. ఈ వేడుకల కోసం భారీగానే ఖర్చు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అంతరిక్ష నేపథ్యంగా..
ఈ వేడుకల్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే క్రూయిజ్ షిప్‌లో వేడుక మొత్తం అంతరిక్ష నేపథ్యంగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా రాధికా మర్చంట్ అద్భుతమైన కస్టమ్ మేడ్ గ్రేస్ లింగ్ కోచర్ పీస్ ధరించనున్నట్లు సమాచారం. దీన్ని ఏరో స్పేస్ అల్యూమినియం టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక దుస్తులు గెలాక్సీ ప్రిన్సెస్ అనే భావన కలిగిస్తాయని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రత్యేక మెనూ
సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అతిథుల కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మాదిరిగానే ఈసారి కూడా పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ వంటి రుచికరమైన వంటకాలను అతిథులకు వడ్డించనున్నట్లు సమాచారం.
నో ఫోన్ పాలసీ..
జామ్ నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు బయటికొచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కానీ ఈసారి క్రూజ్ ఈవెంట్ నుంచి మాత్రం అలాంటిది ఏదీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముకేష్ అంబానీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్న వేడుకల్లో దాదాపు 300 వీఐపీ అతిథులు భాగం కానున్నారు. అందుకే ఈ వేడుకల్లో నో ఫోన్ పాలసీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.