Adani Group: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చి సంవత్సరమైంది, ఈ ఏడాది కాలంలో అదానీ గ్రూప్ షేర్లు ఎంత మేర పుంజుకున్నాయి?
గరిష్ట స్థాయి నుంచి ఇప్పటికీ రూ.4.7 లక్షల కోట్ల దూరంలో, 24% వెనుకబడి ఉంది.
Adani Group - Hindenburg Report: సరిగ్గా ఏడాది క్రితం, 2023 జనవరి 24న, అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్, అదానీ గ్రూప్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆ షార్ట్ సెల్లర్ కంపెనీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒక పెద్ద బాంబ్‌లా పేలింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు పెరగడం, విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడుల్లో నిజాయితీ, గ్రూప్ నెత్తిన ఉన్న అప్పులు, కార్పొరేట్ పాలనలో నీతిని హిండెన్‌బర్గ్ ప్రశ్నించింది. ఆ రిపోర్ట్ తర్వాత అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి, నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 80% వరకు నష్టపోయాయి.
హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఈ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది, కేసు సుప్రీంకోర్టును చేరింది. సెబీ (SEBI) కూడా దర్యాప్తు మొదలు పెట్టింది. మొత్తం 24 అంశాల్లో 22 అంశాల్లో విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ ఏడాది జనవరి 3న, అదానీ గ్రూప్‌పై విచారణకు సిట్ ఏర్పాటు చేయడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం, సెబీ దర్యాప్తు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రాక ముందు, అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Adani Group Market Cap) రూ.19.23 లక్షల కోట్లుగా ఉంది. రిపోర్ట్ సృష్టించిన పేలుడుకు అదానీ సామ్రాజ్యం విలువ అత్యంత వేగంగా పతనమైంది. రిపోర్ట్ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే 34 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఒక దశలో, మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.13 లక్షల కోట్లు పతనమై రూ.6.7 లక్షల కోట్లకు దిగి వచ్చింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ 22% నుంచి 80% వరకు నష్టపోయాయి. గ్రూప్‌లోని ప్రతి కంపెనీ షేర్లు కొత్త 52-వారాల కనిష్టాలకు పడిపోయాయి.
2024 జనవరి 24 నాటికి, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చి ఏడాది పూర్తయింది. అంటే, ఫస్ట్ యానివర్సరీ పూర్తయింది. 2024 జనవరి 24న స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్ విలువ రూ.14.5 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది వ్యవధిలో కనిష్ట స్థాయి నుంచి బాగానే పుంజుకున్నా.. గరిష్ట స్థాయి నుంచి ఇప్పటికీ రూ.4.7 లక్షల కోట్ల దూరంలో, 24% వెనుకబడి ఉంది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చిన 2023 జనవరి 24 నాటి ధరలతో పోలిస్తే, 2024 జనవరి 24 బుధవారం నాటికి, అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల్లోని ఏడు కంపెనీల షేర్లు ఇప్పటికీ దిగువనే ట్రేడవుతున్నాయి.
ఏడాది కాలంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పనితీరు (After Hindenburg Report, Adani Group's stock performance during the year):
అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises): 2023 జనవరి 24న రిపోర్ట్ తర్వాత 82 శాతం తగ్గింది. 2024 జనవరి 24, బుధవారం నాడు ₹2887 వద్ద ట్రేడయింది. 2023 ఫిబ్రవరి 1న ఈ షేర్లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయి ₹1,017కి చేరాయి.
అదానీ పోర్ట్స్ (Adani Ports and SEZ): నివేదిక తర్వాత ఆల్ టైమ్ కనిష్ట స్థాయి ₹394.95కి చేరింది. బుధవారం నాటికి ₹1121 వద్ద ఉంది.
అదానీ పవర్ (Adani Power): గత ఏడాది ఫిబ్రవరి 28న ఈ కంపెనీ షేర్లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయి ₹132కి చేరాయి. బుధవారం నాటికి ₹518.00 వద్ద ట్రేడయ్యాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy): ఈ షేర్లు గతేడాది ఫిబ్రవరిలో ₹439 స్థాయికి పతనమయ్యాయి. బుధవారం నాటికి ₹1653.55 వద్ద ఉన్నాయి. ఇప్పటికీ 14 శాతం వెనుకంజలో ఉంది.
అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas): గతేడాది రిపోర్ట్ వచ్చే నాటికి ₹3,944 గరిష్టంలో ఉన్న షేర్లు తర్వాతి 10 నెలల్లో ₹521.95కి క్రాష్ అయ్యాయి. ఈ బుధవారం నాటికి ₹1001.25 వద్ద ఉన్నాయి. ఇప్పటికీ 74 శాతం పతనంలో ఉన్నాయి.
అదానీ విల్మార్ (Adani Wilmar): హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చిన రోజు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ₹573ని తాకిన షేర్లు, ఆ తర్వాత పతనమయ్యాయి. బుధవారం ₹349.50 వద్ద కదిలాయి. 38 శాతం మేర ఇంకా పుంజుకోవాలి.
NDTV: బుధవారం నాడు ఈ షేర్లు ₹262.65 వద్ద ట్రేడయ్యాయి, గతేడాదితో పోలిస్తే ఇప్పటికీ 6 శాతం తక్కువలో ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: అదానీ గ్రూప్ మీద దాడికి సరిగ్గా సంవత్సరం, గౌతమ్ అదానీ రియాక్షన్ ఇది